మరో రెండు నెలల వరకు డెల్టా ప్రభావం కొనసాగుతుంది
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కోఠిలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం డిహెచ్ మీడియాతో మాట్లాడారు. డెల్టా వేరియంట్ ప్రభావం మరో రెండు నెలల వరకు కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో వైద్య బృందాలు పర్యటించాయని, ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదువతున్నాయని, వరుస పండుగల దృష్టా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే తీవ్రతను పట్టించుకోకుండా కొంతమంది ప్రజలు సామాజిక బాధ్యతను పక్కన పెట్టి, కొవిడ్ జాగ్రత్తలపై నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. డెల్టా వేరియంట్ గాలి ద్వారా వ్యాపిస్తోందని, ప్రజలు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలని అన్నారు. మాస్క్ లేకుండా ఉత్సవాల్లో పాల్గొనవద్దని కోరారు. మాల్స్‌కు గుంపులు గుంపులుగా వెళ్లడం సరికాదని పేర్కొన్నారు.
వైరస్ పూర్తిగా డౌన్ కాలేదు : డిఎంఇ రమేష్‌రెడ్డి
రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోందని డిఎంఇ రమేష్‌రెడ్డి అన్నారు. లాక్‌డౌన్ తీసేశాము అంతే, ఇంకా వైరస్ పూర్తిగా డౌన్ కాలేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా సరే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నాలుగు, ఐదు జిల్లాల్లో వైరస్ ప్రభావం ఉందని, దీనిని అదుపు చేయకపోతే మూడో వేవ్ వచ్చే ఆస్కారం ఉందని చెప్పారు. లాక్‌డౌన్ తరువాత ప్రజలు నిబంధనలు ఉల్లంఘించి బయటే ఎక్కువ తిరుగుతున్నారని, ఇలానే కొనసాగితే కేసులు పెరుగుతాయని తెలిపారు. ప్రజలు మాస్క్ కచ్చితంగా ధరించాలి. థర్డ్ వేవ్ వచ్చినా సిద్ధంగా ఉన్నామని, 27 వేల బెడ్లు సిద్ధం చేయబోతున్నామని చెప్పారు. అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్ బెడ్స్ సిద్ధం చేశామని, అయినా పండగ సమయాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Telangana DH Srinivasa Rao Press Meet