విద్యుత్ కోసం సాగర్ నీటిని తెలంగాణ వాడడం లేదు
పవర్ గ్రిడ్లను కాపాడుకోవడం కోసమే అప్పడప్పుడు వాడుతున్నాం
కృష్ణా నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి చిల్లరగా వ్యవహరిస్తోంది : మంత్రి జగదీష్‌రెడ్డి
మన తెలంగాణ/సూర్యాపేట : విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జున సాగర్ నుంచి తాము నీటిని వినియోగించడం లేదని, కృష్ణా నీళ్ల విషయంలో ప్రతిసారి ఎపి ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం సూర్యాపేటలో ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం నాగార్జున సాగర్ నీటి వినియోగం విషయంలో ఎపి ప్రభుత్వం కృష్ణా యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)కు చేసిన ఫిర్యాదుపై విలేకరులతో మాట్లాడుతూ పవర్ గ్రిడ్లను కాపాడుకోవడం కోసమే అప్పుడప్పుడు నీటిని వినియోగిస్తున్నామని తెలిపారు. ఎపి ప్రభుత్వం అసంబద్ధమైన అర్థంపర్థంలేని విమర్శలతో కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేయడం అలవాటుగా మారిందన్నారు. నాగార్జునసాగర్ విద్యుత్తు ఉత్పత్తి విషయంలో ఎపి ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
నీటి వినియోగంపై ప్రతిసారి కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తున్న ఎపి ప్రభుత్వం వాదనలో నిజంలేదన్నారు. డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో గ్రిడ్‌ని కాపాడేందుకు సాంకేతికపరంగా ఐదు, పది నిమిషాల ఉత్పత్తి అప్పుడప్పుడు జరగడం సహజమేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని ఆపేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోందన్నారు. అయినా తాము ఈ విధంగా చిల్లర ఫిర్యాదులు చేయడం లేదని మంత్రి అన్నారు. సమైక్య ఆంధ్రలో వారే దుర్మార్గంగా నీటిని ఆంధ్రాకు బలవంతంగా తరలించుకెళ్లారని దుయ్యబట్టారు. ఆంధ్రా ప్రభుత్వానికి నీటి యాజమాన్యం విలువ తెలియక తమ పై ఫిర్యాదు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.