మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం కార్పోరేషన్‌తో పాటు సిద్దిపేట, నకిరేకల్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు, జిహెచ్‌ఎంసి, మరికొన్ని మున్సిపాలిటీలలో ఏర్పడ్డ ఖాళీలకు ఆకస్మిక ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థపారథి అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిందని, ఇందుకు సంబంధి ంచిన ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుకు నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ పూర్తి అయ్యేవరకు ప్రతి అంశంలో అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి బుధవారం సంబంధిత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ మొదలైందని, కమిషనర్, డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారన్నారు. సాదారణ ఎన్నికల సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి, సూచనలు, నియమావళి రూపొందించి ప్రచురించడం జరిగిందని, అవే సూచనలు, నియమ నిభందనలు ప్రస్తుతం ఎన్నికలకు వర్తిస్తాయని చెప్పారు.
ఈ సుచనలకనుగుణoగా ఎన్నికలు నిర్వహించేలా సిడిఎంఎ పర్యవేక్షిస్తారన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, సామాగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఇండేలిబుల్ ఇంకు తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులతో సిడిఎంఎ సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. జనవరి 1వ తేదీ వరకు అర్హతగల ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరి 15న ప్రచురించిందని, ఆ జాబితాను టీ పోల్ సర్వర్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఆ జాబితాను ఉపయోగించుకొని ఏప్రిల్ 5వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించామని, దానిపై అభ్యంతరాలను పరిశీలించి ఏప్రిల్ 11వ తేదీన వార్డు వారీగా తుది ఓటరు జాబితా ప్రచురించాలని అన్నారు.
గతంలో ఉపయోగించిన పోలింగ్ స్టేషన్లనే వాడుకునేలా చూడాలి
పోలింగ్ స్టేషన్ల గుర్తింపుకు నోటిఫికేషన్ జారీ చేశామని, వీలైనంతవరకు గతంలో ఉపయోగించిన పోలింగ్ స్టేషన్లనే వాడుకునేలా చూడాలని కమిషనర్ సి.పార్థసారథి అన్నారు. ఏప్రిల్ 14వ తేదీన పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురించాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల జాబితా ఏప్రిల్ 7వ తేదీలోపు రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పించా లని, ఆ జాబితాలను రాష్ట్ర ఎన్నికల అధికారి 8వ తేదీ లోపు ఆమోదించి జిల్లా కలెక్టర్లకు పంపాలని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఏప్రిల్ 12వ తేదీ లోపు శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు. అవసరం మేరకు బ్యాలట్ బాక్సులను పరిశీలించి సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరం మేరకు మరమ్మత్తులు జరిపి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు.వార్డు వారీ బ్యాల్లట్ పేపర్ ముందుగా అంచనా వేసుకొని బ్యాలట్ పేపర్ ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్‌లను గుర్తించి, పోటీ చేయు అభ్యర్థుల జాబితా సిద్దమైన వెంటనే తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకొని ముద్రించుకోవాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ సజావుగా, స్వేచ్చాయుత వాతావరణంతో ప్రశాంతంగా నిర్వహించేందుకు సంబంధిత పోలీస్ ఆధికారులతో చర్చించి బందోబస్తు ఏర్పాట్లు చేయాలలని అన్నారు.ఎన్నికల సందర్బంగా ఆదర్శ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని, సాధారణ ఎన్నికలు నిర్వహించే స్థానిక సంస్థలలో ఆయా మున్సిపల్ కార్పొరేషన్, నగర పాలక సంస్థ, మున్సిపాలిటీ పరిధిలో ప్రవర్తనా నియమావళి నోటిఫికేషన్ తేదీ నుండి వర్తిస్తుందని, ఆకస్మిక ఎన్నికలు నిర్వహించే మున్సిపాలిటీలలో ఆ మొత్తం మున్సిపాలిటీ పరిధిలో ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని చెప్పారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా పరిశీలకుల నియామకం
సాధారణ ఎన్నికలు జరిగే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సాధారణ పరిశీలకులను, వ్యయ పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా నియమించడం జరుగుతుందని కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఆకస్మిక ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో సాధారణ, వ్యయ పరిశీలన కొరకు సంబంధిత కలెక్టర్లు తగిన అధికారులను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో చేయవలసిన వివిధ పనులను, వాటిని పూర్తి చేయవలసిన తేదీలను సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టిక తయారు చేసి అందరు మున్సిపల్ కమీషనర్‌లకు పంపించామని, సంబంధిత జిల్లా కల్లెక్టర్లు నిర్ణీత తేదీలలో ఆయా పనులు తుచా తప్పకుండా జరిగేలా చూసుకోవాలని కోరారు. కొవిడ్ -19కు సంబంధించి ప్రత్యేకంగా సూచనలు జారీ చేశామని, వాటిని తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా, భౌతికదూరం పాటించేలా చూడాలని పేర్కొన్నారు. శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్,డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, సంబధిత జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.
Telangana EC Parthasarathy video conference