Thursday, January 23, 2025

జనగణన లేక తగ్గిన వాటా..

- Advertisement -
- Advertisement -

2011లో రాష్ట్ర జనాభా 3.51కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా 2.102 శాతం 
2021లో జనాభా 3.77 కోట్లు పదేళ్లలో 25లక్షలు పెరిగిన జనాభా
2.5%కు పెరగాల్సిన రాష్ట్ర వాటా
ఆ లెక్కన రాష్ట్రానికి రూ.4,500 కోట్ల నష్టం?
23-24లో రాష్ట్ర వాటా రూ.21,470 కోట్లు
జనాభా లెక్కలు జరిగి ఉంటే రాష్ట్ర ఆదాయం పెరిగేది

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాల ఆదాయానికి గండికొట్టి తన ఖజానాను లక్షలాది కోట్ల రూపాయలతో నింపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక అడ్డదారులు తొక్కుతోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు జరపకపోవడానికి కూడా బలమైన కారణమే ఉందని, ఎందుకంటే జనాభా లెక్కల ఆధారంగానే కేంద్రప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు వాటాలు ఖరారు అవుతాయని, దాంతో ఎక్కడ రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో వాటాలు పెంచాల్సి వస్తుందోననే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం 2021లో జరపాల్సిన జనాభా లెక్కలు జరపలేదనే విమర్శలున్నాయి. జనాభా గణన (సెన్సెస్) జరపకపోవడానికి కేంద్ర ప్రభుత్వం చెప్పే కుంటిసాకులన్నీ ఒక ఎత్తయితే అసలు సిసలు కారణమైతే ఇదేనని, అందుకే పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా నిధుల్లో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని కొందరు సీనియర్ అధికారులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి కార్పోరేషన్ ట్యాక్స్, ఇన్‌కం ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, సెంట్రల్ జిఎస్‌టి, కస్టమ్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్‌ల పేరుతో ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఈ ఏడు రకాల పన్నుల రూపంలో వస్తున్న ఆదాయంలో 41 శాతం నిధులను రాష్ట్రాలకు వాటాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగానే 2023-24వ ఆర్ధిక సంవత్సరంలో దేశంలోని 28 రాష్ట్రాలకు 10,21,448.16 కోట్ల రూపాయల నిధులను బదలాయించనున్నట్లుగా కేంద్రం బడ్జెట్‌లో పేర్కొంది. ఈ నిధుల్లో తెలంగాణ రాష్ట్రానికి 2.102 శాతం లెక్కన రానున్న కొత్త ఆర్ధిక సంవత్సరంలో 21,470 కోట్ల 59 లక్షల రూపాయల నిధులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ రికార్డులు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రాల వాటాలను ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభాను ఆధారంగా చేసుకొని మాత్రమే ఖరారు చేస్తారు. 2011లో జరిగిన జనాభా గణన ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,51,93,978 మంది ఉన్నారని, ఆ లెక్కన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పన్నుల ఆదాయంలో 2.102 శాతం నిధులు వస్తాయని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ లెక్కలు వేసింది.

కానీ పదేళ్ళకు ఒక్క సారి దేశంలో జనగణన జరపాల్సిన కేంద్ర ప్రభుత్వం 2021లో ఎలాంటి జనాభా గణన జరపకపోవడంతో తెలంగాణ రాష్ట్రంతోపాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ వాటాల నిధులు తగ్గిపోయాయని ఆ అధికారులు వివరించారు. 2021లో దేశ జనాభా 140 కోట్ల 75 లక్షల 63 వేల 842 మంది ఉన్నారు. అదే విధంగా 2022లో దేశ జనాభా 141 కోట్ల 71 లక్షల 73 వేల 173 మంది ఉన్నారు. 2023 జనవరి నెలాఖరు నాటికి దేశ జనాభా 142 కోట్ల 86 లక్షల 27 వేల 663 మందికి ప్రజలు పెరిగారు. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో 2011లో 3,51,93,978 మంది జనాభా ఉండగా అప్పటి లెక్కల ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 2.102 శాతంగా నిర్ణయించారు. అదే విధంగా 2021లో తెలంగాణ రాష్ట్ర జనాభా 3కోట్ల 77 లక్షల 25 వేల మంది ఉన్నారని తెలిపారు.

రెండేళ్ళ క్రితమే జనాభా గణన జరిపి ఉన్నట్లయితే రాష్ట్ర జనాభా ప్రాతిపదికన కేంద్ర పన్నుల ఆదాయంలో సుమారు 2.5 శాతానికి పెరిగి ఉండేదని, ఆ లెక్కన తెలంగాణ రాష్ట్రానికి అదనంగా మరో 4,500 కోట్ల రూపాయల నిధులు వచ్చి ఉండేవని, ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ అదనపు నిధులు ఇవ్వాల్సి ఉంటుందనే దురుద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం జనాభా గణన చేపట్టలేదని భావిస్తున్నట్లుగా ఆ అధికారులు వివరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జనాభా 2023 జనవరి నెలాఖరు నాటికి 4,10,08,763 మందికి పెరిగిందని, ఈ లెక్కన కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా నిధుల్లో తెలంగాణకు 2.7 శాతం లెక్కన కొత్త ఆర్ధిక సంవత్సరంలో మరో 6,300 కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉండేదని వివరించారు. ఇలా అన్ని కోణాల నుంచి రాష్ట్రాలకు తాను ఇవ్వాల్సిన నిధులకు గండికొట్టేందుకే కేంద్రం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని, ఇలాంటి తప్పుడు విధానాల మూలంగానే బిజెపియేతర రాష్ట్రాలే కాకుండా చివరకు బిజెపి పాలిత రాష్ట్రాలే అధికంగా నష్టపోయితున్నాయని ఆ అధికారులు వివరించారు.

ముఖ్యంగా దక్షిది రాష్ట్రాలకే ఎక్కువగా నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఇలా కేంద్రం కుట్రలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయని, ఈ అంశాలపై అన్ని రాష్ట్రాలూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ పెద్దలను అడుగుతూనే ఉన్నారని, ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలైతే కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉలుకూ పలుకూ లేకుండా, ఎలాంటి సమాధానాలు కూడా ఇవ్వకుండా దాటవేత ధోరణితో పబ్బం గడుతున్నారని ఆ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఎత్తులు, జిత్తులను పక్కనబెట్టి జనాభా గణన చేపట్టాలని, తద్వారా పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాలను సవరించాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News