Wednesday, January 22, 2025

తెలంగాణ విద్యా విధానం దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

హన్మకొండ -: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మడికొండ తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన విద్యా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుడా చెర్మన్ సంఘం రెడ్డి సుంధర్ రాజ్ యాదవ్ హాజరయ్యారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో గురుకుల విప్లవం ఏర్పడిందని, నాడు ఉమ్మడి రాష్ట్రంలో 200 గురుకులాలు మాత్రమే ఉంటే నేడు 1002 గురుకులాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మడికొండలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం విద్యా దినోత్సవాన్ని ప్రిన్సిపల్ ఉమా మహేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, తెలంగాణ విద్యా విధానం దేశానికే ఆదర్శంగా మారిందని అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందుతోందని తెలిపారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 200 గురుకులాలు ఉంటే నేడు 1002 గురుకులాలు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు చేసిందని వివరించారు. నాడు హాస్టల్ విద్యార్థులకు దొడ్డు బియ్యం వండిపెట్టేవారని, కానీ నేడు సన్న బియ్యంతో కూడిన భోజనం విద్యార్థులకు అందుతోందని తెలిపారు. ఒక్కో గురుకుల విద్యార్థి కోసం ప్రభుత్వం 1,25,000 ఖర్చు చేస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యార్థుల సంఖ్య దాదాపు 6 లక్షలు అని తెలియజేశారు.

మన ఊరు మన బడి పేరుతో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పథకాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని రూప కల్పన చేశారని తెలిపారు. దానిలో భాగంగా 7300 కోట్లతో 26 వేల పాఠశాలల ఆధునీకరణ జరగనున్నట్లు వివరించారు. వాటితో పాటు క్రీడా మైదానాల అభివృద్ధి కూడా జరుగుతోందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఇంటర్, డిగ్రీ కళాశాలలను సైతం ప్రారంభించిందని తెలిపారు. మన గురుకులాల్లో చదివిన పిల్లలు ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎంబీబీఎస్, విదాశాల్లో ఎంఎస్ చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో విద్యా బోధన కొనసాగుతోందని స్పష్టం చేశారు.

ఆంగ్ల మాధ్యమం బోధన, టీచర్ల భర్తీ చేపట్టి, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, ల్యాబ్ సౌకర్యాలను ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను పెంచడం జరిగిందన్నారు. విదేశాల్లో పేద విద్యార్థుల చదువు కోసం రూ.20 లక్షల స్కాలర్ షిప్ ను తెలంగాణ ప్రభుత్వం పూలే, అంబేద్కర్ పేర్లతో అందిస్తోందని తెలిపారు. కేంద్రం విద్య కోసం బడ్జెట్ నుంచి కేవలం 6 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌లో 10 నుంచి 15 శాతం నిధులను విద్య కోసం ఖర్చు చేస్తోందని వివరించారు.
కలలు కనండి, లక్ష్యాలను నిర్దేశించుకోండి
విద్యార్థులు చిన్ననాటి నుంచి లక్ష్యాలను నిర్దేశించుకొని చదవాలని కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ సూచించారు. లక్ష్యాలను చేరేందుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటే సత్తా విద్యార్థులకు ఉందని తెలిపారు. విద్యార్థులు కలలు కనాలని సూచించారు. కలలను సాకారం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కేవలం విద్య మాత్రమే మనకు సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తుందని తెలిపారు. దేశ సంపద, భవిష్యత్ విద్యార్థుల చేతిలోనే ఉందని అన్నారు.

విద్యార్థుల తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు దక్కే గౌరవ మర్యాదలు వేరే ఏ వృత్తి వారికి దక్కవని, ఈ సందర్భంగా సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు, వారు చేస్తున్న కృషి, ఫలితాలను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మునిగాల సరోజన కరుణాకర్, శ్రీధర్‌రావు, ఉపాధ్యాయులు మాలిక, జ్యోతి, రాధిక, మల్లారెడ్డి, వాసుదేవ రావు, పద్మ, సరిత, విద్యార్థినులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News