Sunday, January 19, 2025

ప్రచార బరిలోకి బలగం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఇళ్లలో చుట్టాల సందడి నెలకొంది. ఎన్నికల సందర్భంగా అభ్యర్థులకు తోడుగా ఉండేందుకు దేశవిదేశాలలో ఉన్న బంధువులు, స్నేహితులు అభ్యర్థి ఇంటికి చేరుకుంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రచారం సాగిస్తూనే వారి బంధువులను రంగంలోకి దించుతున్నారు.

తమ సమీప బంధువులు, దగ్గరి స్నేహితులకు ఎన్నికల ప్రచారం, పర్యవేక్షణతో పాటు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలను కట్టబెడుతున్నారు. నియోజకవర్గాలలో నేతలను సమన్వయ పరుస్తూనే ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తెరవెనుక ఎన్నికల వ్యూహరచన చేస్తూనే ఆర్థిక వ్యవహారాలకు చక్కబెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్చులు, ప్రచారంలో పాల్గొనే నేతలు, కార్యకర్తలకు భోజనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం, వాహనాలు ఏర్పాటు చేయడం వంటి పనులను ఒక్కొక్కరు మీదేసుకుంటున్నారు.

కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులు, భార్యాపిల్లలు, విదేశాల్లోనో, ఇతర ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ ఎన్నికల సమయం కావడంతో అందరూ ఇంటికి చేరుకుంటున్నారు. సోదరులు, బావలు, బావమరుదులు, చిన్నాన్న, మామ వంటి బంధులతో పాటు స్నేహితులు, క్లాస్‌మేట్స్, స్కూల్‌మేట్స్ వంటి అభ్యర్థుల శ్రేయోభిలాషులంతా వారి ఇంటి దారి పడుతున్నారు. వారి ఉద్యోగాలు, వ్యాపారాలకు తాత్కాలిక విరామం ప్రకటించి ప్రచారంలో అభ్యర్థులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. బంధువులు, స్నేహితుల రంగ ప్రవేశంతో పార్టీ నేతల్లోనూ ఉత్సాహం నింపుతోంది. కుటుంబాలు, చిన్న చిన్న తగాదాలతో దూరమైన బంధువులు, మిత్రులతో అభ్యర్థులు సమావేశమై వారిని ఏకం చేసి తనను సహకరించేలా చేసుకుంటున్నారు.

ప్రాంతాలవారీగా బాధ్యతలు…
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ సమీప బంధువులు, స్నేహితులకు గ్రామాలు, మండలాలు లేదా డివిజన్లవారీగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసే తేదీ, ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో సమయాభావం వల్ల అభ్యర్థి స్వయంగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించలేరు కాబట్టి ప్రాంతానికి ఒకరు లేదా ఇద్దరిని తమ ప్రతినిధిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే వారిని సంప్రదించేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

అభ్యర్థుల బంధువులు ఆయా ప్రాంతాలకు చెందిన నేతలు, కార్యకర్తలకు అవసరమైన రోజువారీగా అవసరాలు, వాహనాల ఏర్పాట్లు చేస్తూ వారితో కలివిడిగా కలిసిపోతున్నారు. ఆయా ప్రాంతాలలో ఓటర్లను ప్రభావితం చేయగలితే మహిళా సంఘాలు, కుల సంఘాలతో పాటు వివిధ సంఘాల నేతలకు కలుస్తూ వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన చోట అభ్యర్థిని నేరుగా రంగంలోకి దించుతున్నారు. ప్రాంతాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థుల ప్రచార వ్యూహాలకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటున్నారు.

సమయం తక్కువ.. చేయాల్సిన పనులు ఎక్కువ…
పోలింగ్‌కు ఇంకా 21 రోజుల సమయం మాత్రమే ఉంది. సిట్టింగ్‌లు, గతంలో అదేస్థానం నుంచి పోటీ అభ్యర్థులకు మండలాలు, గ్రామాలవారీగా కేడర్ అందుబాటులో ఉండగా, కొత్తవారు వారితో మమేకమయ్యే కేడర్ అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలనే వారికి టికెట్లు ఖరారు కావడంతో ఆ పార్టీ కేడర్ అభ్యర్థితో పైకి మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నా..అభ్యర్థిని సొంత మనిషిగా భావిస్తలేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సిట్టింగ్‌లు, పాత అభ్యర్థుల విషయంలో అసంతృప్తులు పూర్తిస్థాయిలో సహకరించడం లేదని ఆయా పార్టీల్లోనే చర్చించుకుంటున్నారు. అయితే మిగిలిన ఈ 21 రోజుల సమయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలు, పట్టణాలలో అభ్యర్థే స్వయంగా ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది.అంతర్గత విభేదాలు చక్కబెట్టడం, కేడర్‌ను దారిలోకి తెచ్చుకోవడం..అదే సమయంలో ప్రత్యర్థి వ్యూహాలను తిప్పికొడుతూ ఓటర్లను మెప్పించేలా చేయడం అభ్యర్థులకు ప్రయాసగా మారింది. సమయాభావం వల్ల కొంతమంది అభ్యర్థులు విశ్రాంతి లేకుండా తిరుగుతూ సరైన తిండి నిద్రలేక ఇబ్బంది పడుతున్నారు.

కొన్ని చోట్ల బెడిసికొడుతున్న బంధువుల వ్యవహారం…
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల బంధువులు, స్నేహితులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న వ్యవహారం కొన్ని చోట్ల బెడిసికొడుతున్నట్లు తెలిసింది. ఎంతోకాలంగా అభ్యర్థికి చేదోడు వాదోడుగా ఉంటూ నమ్మకం మెలిగిన మమ్మల్ని కాదని అభ్యర్థి తన బంధువులు, స్నేహితులకు బాధ్యతలు అప్పగిస్తున్నారని కొంతమంది నేతలు అంతర్మథనం చెందుతున్నట్లు సమాచారం. కొంతమంది బంధువులు, స్నేహితులు తమపై పెత్తనం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు కనిపించని కొత్త ముఖాలు ఎన్నికల సమయంలోనే కనిపిస్తుండటంతో వారితో కలిసిపోలేక కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News