Sunday, January 19, 2025

కాంగ్రెస్‌కు రెబల్స్ ట్రబుల్..

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌కు రెబల్స్ ట్రబుల్..

తిరుగుబాటు అభ్యర్థులతో కాంగ్రెస్‌లో కలవరం
నాలుగు చోట్ల రెబల్స్‌కు అభ్యర్థుల బుజ్జగింపు

(వి.వెంకట రమణ/మన తెలంగాణ): కాంగ్రెస్ పార్టీని తిరుగుబాటు అభ్యర్థులు కలవరపెడుతున్నారు. టికెట్ కోసం చివరిదాకా ప్రయత్నించిన వ్యక్తులు టికెట్ దక్కకపోవడంతో రెబల్స్‌గా బరిలో దిగారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థులకు రెబల్స్ తలనొప్పిగా మారారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండడంతో రెబల్స్ నుంచి బరి నుంచి తప్పి ంచేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని బతిమాలుతున్నారు. కొందరు రాజీ మార్గంలోకి వచ్చినా, మరికొందరైతే ససేమిరా అంటున్నారు. టైమ్ లేకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీని రెబల్స్ భయం వెంటాడుతోంది.

వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఇద్దరిని, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇద్దరిని ఈ సమస్య వేధిస్తున్నది. వరంగల్ పశ్చిమ నుంచి కాంగ్రెస్ రెబల్ గా జంగా రాఘవరెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ టికెట్ దక్కక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయనతో బిఆర్‌ఎస్ చర్చలు జరుపుతున్నందున కాంగ్రెస్ కు రెబల్ బెడద ఉండకపోవచ్చు. వర్ధన్నపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రిటైర్డ్ పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజును పార్టీ నిర్ణయించింది. ఇక్కడ టికెట్ రేసులో పేర్లు వినిపించిన మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య రెబెల్‌గా బరిలో ఉన్నారు.

ఇప్పటిదాకా నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న నమిండ్ల శ్రీనివాస్ అలక పాన్పు వహించారు. ఇద్దరికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరితో కాంగ్రెస్ అభ్యర్థికి సమస్య ఎదురవుతున్నది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్థి గా రామచంద్ర నాయక్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన నెహ్రూ నాయక్, భూపాల్ నాయక్‌లు ఇద్దరు కూడా రెబల్‌గా నామినేషన్ వేశారు. చివరిదాకా టికెట్‌కు ట్రై చేసి విఫలం కావడంతో ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. ఈ ఇద్దరిని బరి నుంచి తప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా సఫలం కాలేదు. మహబూబాబాద్ అసెంబ్లీ నుంచి మాజీ ఎంపి బలరాం నాయక్ టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి పార్టీ కొత్త అభ్యర్థి మురళీ నాయక్‌కు అవకాశం ఇచ్చింది.

ఇక్కడ నుంచి కాంగ్రెస్ రెబల్‌గా మహిళా కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు నూనావత్ రాధ నామినేషన్ వేశారు. ఆమెతోని కాంగ్రెస్ పార్టీ నేతలు సంప్రదింపులు చేస్తున్నది. ఈ నాలుగు స్థానాల్లో రెబల్స్ బెడద ఉండగా…పరకాల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నియోజకవర్గ ఇంచార్జి ఇనుగాల వెంకట్రామిరెడ్డి మాత్రం పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నారు. పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డిని పార్టీ ఎంపిక చేసింది. ఆయనతో ప్రచారంలో ఇనుగాల, స్టేషన్ ఘనపూర్ టికెట్ ఆశించిన దొమ్మాటి సాంబయ్య తిరుగుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి నాలుగు చోట్ల రెబల్స్ బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్ అభ్యర్థులకు సహకరిస్తారా? లేదా ఎన్నికల బరిలో నిలుస్తారా అనేది చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News