Saturday, December 21, 2024

మైనారిటీ ఓటర్ల మొగ్గు ఎటు?

- Advertisement -
- Advertisement -

 ఎన్నికల్లో కీలకం కానున్న మైనారిటీ ఓటర్లు
 ఎంఐఎం మద్దతు కలిసొచ్చేనా
 గతం పునరావృతం అవుతుందా..?
 కాంగ్రెస్ గ్యారంటీలు ప్రభావితం చేసేనా

(సయ్యద్ తాజుద్దీన్/మన తెలంగాణ): ఎప్పటి లాగే ఈ సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపోటములకు మైనారిటీ ఓటర్లు కీలకం కానున్నారు. అధిక స్థానాల్లో అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తుండగా మరికొన్ని స్థానాల్లో వారి ఓట్లు గెలుపోటములను తారుమారు చేస్తున్నాయి. మైనారిటీ ఓటర్లలో ప్రధానంగా ముస్లిం ఓటర్లే కీలకం. దీంతో ఎంఐఎం మద్దతు ఎటువైపు ఉంటే ఆ పార్టీ గెలుపునకు ప్రధాన కారణమవుతున్నాయి. కొన్ని చోట్ల క్రిస్టియన్ ఓట్లు కూడ ప్రధానం కానున్నాయి. ఎప్పటి లాగే ఈ సారి కూడా ఎంఐఎం బిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో గతం వలె ఫలితాలు పునరావృత్తం అవుతాయని బిఆర్‌ఎస్ నమ్మకంతో ఉంది. అయితే కాంగ్రెస్ ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, మైనారిటీ డిక్లరేషన్ మైనారిటీలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

30 స్థానాలలో మైనారిటీల ప్రభావం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాలు మినహాయిస్తే రాష్టంలోని 25 నుండి 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా సుమారు 43 శాతం ముస్లిం మైనారిటీలు ఉంటే ఆదిలాబాద్‌లో దాదాపు 38 శాతం, కరీంనగర్‌లో 21 శాతం, ఖమ్మంలో 16 శాతం, మహబూబ్‌నగర్‌లో 34 శాతం, నల్గొండలో 20 శాతం, నిజామాబాద్‌లో 38 శాతం, వరంగల్‌లో 26 శాతం ముస్లింలు ఉన్నారు. వీరు ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. 50 నియోజకవర్గాల్లో 10 శాతం కంటే ఎక్కువ ముస్లిం మైనారిటీలు ఉన్నారు. అందుకే రాజకీయ పార్టీలు ముస్లింలను ఆకట్టుకోడానికి విశ్వయత్నాలు చేస్తున్నాయి.

2018 ఎన్నికల సమయంలో ముస్లింలుబిఆర్‌ఎస్‌కు అండగా నిలిచారు. ఆ పార్టీ విజయానికి పూర్తిగా సహకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఆర్‌ఎస్‌తో ఎంఐఎం స్నేహం కొనసాగుతోంది. ఈ సంబంధాలు కూడా గత ఎన్నికల్లో ప్రభావితం చేశాయని భావిస్తున్నారు. ఈ సారి కూడా ఎంఐఎం బిఆర్‌ఎస్‌కు మద్దతిస్తోంది. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన ఎంఐఎం ఆ తర్వాత వెనక్కు తగ్గింది. ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు అదనంగా రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా ప్రాంతాల్లో బిఆర్‌ఎస్‌కు మద్దతిస్తోంది.

ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ గాలం
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ముస్లిం డిక్లరేషన్ ప్రకటించి ముస్లిం మైనారిటీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ హామీలను ముస్లింలు ఎంతవరకు నమ్ముతారనేది ప్రశ్నగా మిగిలింది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్, అధికారంలో ఉన్నపుడు ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీ బడ్జెట్ నామమాత్రంగా ఉండేది. అది కూడా ఖర్చు అయ్యేది కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 2013-14లో 23 జిల్లాలకు రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీలకు కేటాయించింది మాత్రం కేవలం రూ.501.38 కోట్లు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014-15లో కేవలం 10 జిల్లాలకు రూ.1,030 కోట్లు కేటాయించారు. 2023-24 బడ్జెట్ నాటికి మైనారిటీ సంక్షేమానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేటాయింపులు 2,200 కోట్లకు చేరాయి. దీంతో పాటు కాంగ్రెస్ హయాంలో తరచూ మతకలహాలు జరగడం, బాబ్రీ మసీదు విధ్వంసం తదితర ఘటనలు మైనారిటీలు కాంగ్రెస్‌కు దూరం అయ్యేలా చేశాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

సంక్షేమానికి బిఆర్‌ఎస్ సర్కార్ ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మైనారిటీలకు పూర్తి భరోసా నిచ్చాయి. మజ్లిస్ పార్టీ బిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడం కూడా ఇందుకు దోహదం చేసింది. కెసిఆర్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్ళలో మైనారిటీల కోసం చేపట్టిన పథకాలు ముఖ్యంగా గురుకులాల సంఖ్యను 204 కు పెంచి 97 వేల మంది మైనారిటీ విద్యార్థులు ఉచితంగా విద్యనందించడం.

మైనారిటీ ఓట్లు కీలకం కానున్న నియోజకవర్గాలు
రాష్ట్రంలో మైనారిటీలు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, అంబర్‌పేట, సికిందరాబాద్, సనత్‌నగర్, కంటోన్మెంట్, ఎల్‌బి నగర్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ముధోల్ , మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ ఈస్ట్, నిర్మల్, భాన్సువాడ, కరీంనగర్, జహీరాబాద్, వికారాబాద్, ఖానాపూర్, కామారెడ్డి, ఖమ్మం, మహేశ్వరం, సంగారెడ్డి, తాండూరు, గోషా మహల్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News