Tuesday, April 1, 2025

తెలంగాణ విద్యుత్ చరిత్రలో చారిత్రాత్మకమైన ఘట్టం

- Advertisement -
- Advertisement -

పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 22 జల విద్యుత్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి సిద్ధం
విద్యుత్ వనరుల విస్తరణ, గ్రీన్ పవర్ లక్ష్యసాధనలో హిమాచల్ ఒప్పందం ముందడుగు
జల విద్యుత్ తో విశ్వసనీయత, ఆర్థికంగా మేలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మన తెలంగాణ / హైదరాబాద్ : ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పతి ప్లాంట్ల ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించింది. బిల్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ విధానంలో ఉత్తర భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 22 జల విద్యుత్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సిమ్లా లో తెలంగాణ ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థలు, హిమాచల్ ప్రదేశ్ లోని రెండు ప్రధాన హైడ్రో పవర్ ప్రాజెక్టులైన సెలి (400 మెగావాట్లు) మియార్ (120 మెగావాట్లు) అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయి.

ఈ ప్రాజెక్టుల ద్వారా పొందే విద్యుత్ తెలంగాణ రాష్ట్ర క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడనుంది. ‘తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాల మధ్య విద్యుత్ ఉత్పత్తి పై అవగాహన ఒప్పందంలో సెలి (400 మెగావాట్లు), మియార్ (120 మెగావాట్లు, జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఉంటుంది. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ 2025 ప్రకారం 2030 నాటికి 20,000 మెగావాట్లు, 2035 నాటికి 40,000 మెగావాట్లు పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా నిర్ణయించారు. హిమాచల్ జలవనరుల వినియోగం ద్వారా తెలంగాణ ప్రజలకు తక్కువ ఖర్చుతో, విశ్వసనీయమైన, పర్యావరణ హిత విద్యుత్ సరఫరా ఉంటుంది. హైడ్రో విద్యుత్ ఉత్పత్తి వ్యయం తక్కువ, థర్మల్ పవర్ తో పోల్చినపుడు మరింత ఆర్థికంగా కనిపిస్తుంది. హిమాచల్‌లో సంవత్సరానికి 9-10 నెలలు హైడ్రో పవర్ ఉత్పత్తికి అనుకూల వాతావరణం ఉంది. ప్రాజెక్టులను తెలంగాణ జెన్కో నామినేషన్ పద్ధతిలో చేపడుతుంది.

ఇది అంతర్రాష్ట్ర విద్యుత్ సహకారానికి గొప్ప ఉదాహరణ. ఈ ఒప్పందం తెలంగాణ-హిమాచల్ మధ్య బలమైన సంబంధాలకు ప్రతిబింబం అని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ విధానం విద్యుత్ భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా సాగుతోందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు మా కృషి సాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, విద్యుత్ వనరుల విస్తరణకు, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ప్రకారం పర్యావరణ పరిరక్షణకు హిమాచల్ ప్రదేశ్ తో 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు భద్రతను పెంచుకునే అంశానికి కట్టుబడి ఉందని తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాగస్వామ్యంతో ప్రతిపాదిత ప్రాజెక్టులు సెలి (400 మెగావాట్లు), మేయర్ (120 మెగావాట్లు) స్వచ్ఛమైన, ఆర్థికంగా మేలైన, విశ్వసనీయమైన విద్యుత్తును పొందడంలో ఉపకరిస్తాయని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. జల విద్యుత్తు అత్యంత విశ్వసనీయమైన గ్రీన్ పవర్. థర్మల్ పవర్ తో పోల్చినప్పుడు హైడల్ పవర్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. థర్మల్ పవర్ ఉత్పత్తి ఖర్చు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండగా హైడల్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు క్రమంగా తగ్గుతూ వస్తుందని వివరించారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి, జెన్‌కో హైడల్ డైరెక్టర్ సచ్చిదానంద, హిమాచల్ ప్రదేశ్ ఎనర్జీ డైరెక్టర్ రాకేష్ ప్రజాపతి, హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ సెక్రటరీ ఎనర్జీ అరిందం చౌదరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News