ఎపి ప్రాజెక్టుల అదనపు పనులన్నింటినీ నిలిపివేయండి
కృష్ణ బోర్డుకు తెలంగాణ ఇఎన్‌సి లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టుతోపాటు అదనపు పనులను నిలిపివేయించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డును కోరింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. వరదనీటిపై ఆధారపడి నిర్మిస్తున్న వెలిగొండ లాంటి ప్రాజెక్టుల వల్ల తెలంగాణ సాగు, తాగు నీటి ప్రయోజనాలు దెబ్బతింటాయని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి వివిధ ప్రాజెక్టుల ద్వారా ఎపి కృష్ణాజలాలను బేసిన్ వెలుపలకు తరలిస్తోందని , ఇప్పటికే పలు మార్లు అభ్యంతరాలు తెలిపామన్నారు. ట్రిబ్యునల్ తీర్పుకు కూడా ఇది విరుద్దమని లేఖలో స్పష్టం చేశారు. అనుమతుల్లేని వెలిగొండ ప్రాజెక్టు పనులను ఎపి కొనసాగించకుండా వెంటనే నిలువరించాలని బోర్డుకు విజ్ణప్తి చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర జల్‌శక్తి మంత్రి ,జలవనరుల విభాగాలకు కూడా తీసుకుపోవాలని కోరారు.
తాగునీటికి 20శాతమే లెక్కించాలి:
తాగునీటి అవసరాలకోసం ఉపయోగించే నీటిలో 20శాతం నీటిని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని కోరుతూ ఈఎన్సీ మురళీధర్ బోర్డుకు మరో లేఖ రాశారు. బచావత్ ట్రిబ్యునల్ కూడా ఇదే విషయం తెలిపిందన్నారు. కృష్ణాజల వివాదాల మొదటి ట్రిబ్యనల్ తీర్పులో ఈ అంశం స్పష్టంగా ఉదని తెలిపారు. ఈ విషయంలో బోర్డు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తెలంగాణ ఏడాదికి 21.9టిఎంసిల నీటివాటాను కోల్పోతోందని లేఖలో తెలిపారు. అన్ని అంశాలను ఇప్పటికే బోర్డు దృష్టికి తీసుకువచ్చామని , వెంటనే ట్రిబ్యునల్ తీర్పులోని అంశాలను అమలు చేయాలని కోరారు. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత వివరాలను కూడా లేఖతోపాటే జతపరిచారు.
27న నీటివాటాలపై చర్చ:
కృష్ణానదీజలాల్లో తెలుగు రాష్ట్రాలకు నీటి వాటాలను తేల్చేందుకు ఈ నెల27న కృష్ణారివర్ బోర్డు సమావేశం కానుంది. ఉదయం 11గంటలకు జలసౌధలో బోర్డు 14వ సమావేశం నిర్వహిస్తున్నట్టు బోర్డు సభ్యకార్యదర్శి రాయపురే రెండు రాష్ట్రాలకు నోటిసులతోపాటు అజెండా ప్రతులను పంపారు.