Tuesday, January 21, 2025

గంజాయి రవాణాకు చెక్ పెడుతున్న తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

గంజాయి వాడకం, సాగు, సరఫరాపై ఎక్పైజ్ శాఖ నిఘా
సరిహద్దులతో పాటు వాహనాల్లో రవాణా చేస్తున్న గంజాయి స్వాధీనం
పోలీసుల తనిఖీల్లో పలుచోట్ల బట్టబయలు
ఆంధ్రా, ఒడిషా సరిహద్దుల మీదుగా రాష్ట్రంలోకి గంజాయి సరఫరా
ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు ముమ్మరం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గంజాయి వాడకం, సాగు, సరఫరా పెరుగుతున్నట్లు ఎక్పైజ్ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని అరికట్టడంతో పాటు వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలిస్తున్న గంజాయిని పట్టుకోవడానికి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బృందాలతో కలిసి స్థానిక అధికారులు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. గంజాయిని అరికట్టడంలో భాగంగా ఐదేళ్లుగా స్టేషన్ల వారీగా నమోదైన కేసుల సంఖ్య, విభాగాల వారీగా ఎలాంటి కేసులు నమోదయ్యాయి, ఏ వర్గాలు ఆ నేరాల్లో భాగస్వాములు అవుతున్నారన్న వివరాలను ఎక్సైజ్ అధికారులు బయటకు తీశారు.

ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో గంజాయి వాడకం, సాగు, సరఫరాపై ఎక్పైజ్ శాఖ అధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రా, ఒడిషా సరిహద్దుల మీదుగా ఈ గంజాయిని సరఫరా చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. దీంతోపాటు సంగారెడ్డి, అదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట, నల్లగొండ జిల్లాలో ఈ గంజాయి సాగుచేస్తున్నట్టు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ జిల్లాలో గంజాయి సాగుతో పాటు ఆంధ్రా, ఒడిషా సరిహద్దుల నుంచి కూడా ఈ గంజాయి భారీగా సరఫరా అవుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు అధికారులు గంజాయి వాడకం, సాగుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు.
16 స్టేషన్లు… 80 మంది గంజాయి సాగు…
రాష్ట్రంలో 139 ఎక్సైజ్ పోలీస్స్టేషన్ల ఉండగా 16 స్టేషన్ల పరిధిలో 80 మంది గంజాయిని సాగుచేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్లలో నమోదైన కేసులు పరిశీలించిన తర్వాత ఆయాప్రాంతాలపై ఎక్సైజ్ అధికారులు నిఘాను పటిష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న మొక్కలను గుర్తించిన అధికారులు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. వారికి రైతుబంధు నిలిపివేయాలని చేయాలని ప్రభుత్వానికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు సిఫార్సు చేయడం విశేషం.
జనవరి నుంచి 900ల పైచిలుకు గంజాయి కేసులు
ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 900ల పైచిలుకు గంజాయి కేసులను ఎక్సైజ్ అధికారులు నమోదు చేశారు. అందులో గుడుంబాకు చెందినవి 650 ఉండగా 612 మందిని అరెస్టు చేశారు. దీంతోపాటు గుడుంబాకు చెందిన 26 మంది, మాదకద్రవ్యాల విక్రయాలకు సంబంధించి 31 మందిపై పిడిచట్టం కింద అధికారులు కేసు నమోదు చేశారు.
ఆదివారం మూడుకిలోల గంజాయి స్వాధీనం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఎక్పైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వాహన తనిఖీల్లో ఒక వ్యక్తి నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్ది జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్ ఏ.చంద్రయ్య, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ టి.రవీందర్ రావు ఆదేశాల మేరకు సరూర్ నగర్ ఏఈఎస్ బి. హనుమంతరావు పర్యవేక్షణలో వాహనాలను తనిఖీ చేస్తుండగా విశాఖ పట్నం నుంచి ప్రైవేటు బస్సులో తరలిస్తున్న ఓ నిందితుడి నుంచి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. నేరస్థుడు కెసి రాజు, 34 సంవత్సరాలు, కొడుగు జిల్లా, కర్ణాటక రాష్ట్రంగా గుర్తించినట్టు హయత్‌నగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ టి.లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. ఈ దాడుల్లో సరూర్‌నగర్ డిటిఎఫ్ సిఐ టి.సత్యనారాయణ, ఎస్‌ఐలు జి.హనుమంతు, ఎండి పాష, యాదయ్య, సరూర్ నగర్ ఎక్సైజ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News