మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రలోని పుణే జిల్లాకు చెందిన తుకారం బాగోజీ గయాకర్ టమాటాలు అమ్మి రూ.1.5 కోట్లు ఆర్జిం చించిన విషయం తెలిసిందే. అయితే టమాటాలమ్మి మహారాష్ట్ర రైతే కాదు తెలంగాణ రైతు కూడా కోటిశ్వరుడయ్యాడు. నెల రోజుల్లో టమాటాలు అమ్మి రూ.1.84 కోట్లు సంపాందించాడు. ఆయనే మెదక్ జిల్లా కౌడిపల్లి మండల మహ్మద్ నగర్ కు చెందిన రైతు బాన్స్ వాడ మహిపాల్ రెడ్డి. ఆయన తనకున్న 60 ఎకరాల్లో కూరగాయ పంటలు సాగు చేస్తుంటాడు. అయితే మహిపాల్ మూస పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతిలో కూరగాయలు పండిస్తుంటాడు. ఇలా చేయడం వల్ల నీరు తక్కువ వినియోగించడంతో పాటు మంచి కూరగాయలు పండుతాయని చెబుతున్నారు. సాధారణంగా వేసవిలో కూరగాయలు డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో కూరగాయలు సాగు చేస్తే ఎంతో కొంత లాభం వస్తుందని భావించిన మహిపాల్ రెడ్డి ఏప్రిల్, మే నెలల్లో 12 ఎకరాల్ల టమాటా సాగు చేయగా మరో 12 ఎకరాల్లో క్యాప్సికం సాగు చేశాడు. జూన్ చివర నుంచి టమాటా అందుబాటులోకి వచ్చింది.
అయితే జూన్ నుంచే టమాటా ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. జులై నాటికి టమాటా ధర కిలో రూ.150 లకు పైనే పలుకుతోంద మహిపాల్ రెడ్డి టమాటాను హైదరాబాద్ లోని బోయిన్ పల్లి, షాపూర్ నగర్, పటాన్ చెరు మార్కెట్లకు తీసుకొచ్చి విక్రయిస్తుంటాడు. ఆయన ఈ నెల రోజుల్లో రోజుకు 250 బాక్స్ ల అమ్మనట్లు చెప్పాడు. ఈ నెల రోజుల్లో మొత్తం 8, 000 టమాటా బాక్స్ లు విక్రయించినట్లు తెలిపిన మహిపార్ రెడ్డి.. సగటున బాక్స్ రూ.2,300 చొప్పున ఇప్పటి వరకు రూ.1.84 కోట్లు వచ్చినట్లు చెప్పాడు. టమాటాలు ఇంత ధర పెరుగుతాయని అనుకోలేదని మహిపాల్ రెడ్డి చెప్పారు. వేసవి కాలంలో కాస్త ధరలు పెరిగు తాయని భావించి.. టమాటా సాగు చేస్తున్నట్లు తెలిపారు. పందిరి విధానంలో టమాటా సాగు చేసినట్లు పేర్కొన్నారు. పంటకు డ్రిప్ సిస్టం ద్వారా నీరు అందించినట్లు చెప్పారు. టమాటా పంటకు ఎకరాకు రూ.2 లక్షల ఖర్చ అయినట్లు తెలిపారు. దిగుబడి పెరగడంతో పాటు ధర కూడా బాగానే ఉండడంతో ఈ సారి మంచి లాభాలొచ్చినట్లు వివరించాడు.