Saturday, November 23, 2024

కరెంట్ అఫైర్స్: ఈ గవర్నెన్స్‌లో తెలంగాణకు ఐదో ర్యాంకు

- Advertisement -
- Advertisement -

Proposals connecting Kodangal to Narayanpet or Mahabubnagar

తుర్కియే ఆందోళనలు న్యాయబద్ధమైనవే: నాటో చీఫ్

నాటో కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్‌ల చేరికపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తుర్కియే (టర్కీ) లేవత్తిన భద్రతాపర ఆందోళనలు న్యాయబద్ధమైనవేనని కూటమి సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్ బర్గ్ అభిప్రాయపడ్డారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నీనిస్టోతో ఆయన భేటి అయ్యారు. తుర్కియేతో పోల్చితే మరే ఇతర నాటో దేశాలు తీవ్రవాద దాడులను ఎదుర్కోలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆదేశ ఆందోళనలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. స్వీడన్, ఫిన్లాండ్‌లు దశాబ్దాల తరబడి తటస్థంగా ఉన్నా.. ప్రస్తుత రష్యా చర్యలతో భయపడి నాటోలో చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

యుద్ధ విమానాల పెంపు యోచనలో బారత్:

యుద్ధ విమానాల సంఖ్యను పెంచుకోవాలని భారత్ సన్నాహాలు చేస్తోంది. భారత వాయుసేనలోకి చేర్చడానికి మరో 114 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. వీటిలో 96 భారత్‌లో తయారు కాగా మిగిలిన 18 విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. మేక్ ఇన్ ఇండియా పథకం కింద 114 మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను సమకూర్చుకోవాలని భారత వాయుసేన యోచిస్తోంది. ఇటీవల భారత వాయుసేన విదేశీ వెండర్స్‌తో సమావేశం కూడా నిర్వహించింది. ఈ సమావేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ఎలా చేపడతారో అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం 18 యుద్ధ విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోనుంది. తదుపరి 36 విమానాలను భారత్‌లోనే తయారు చేయించాలని భావిస్తోంది. చివరి 60 విమానాల తయారీని భారతీయ కంపెనీలకు అప్పగించనుంది.

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు కానున్న డిస్‌ప్లే ఫ్యాబ్ :

దేశ చరిత్రలో తొలిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్ తయారీ రంగంలో రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల భారీ పెట్టుబడి లభించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రముఖ ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తన అనుబంధ సంస్థ ఎలెస్ట్ ద్వారా తెలంగాణలో అడ్వాన్స్‌డ్ డిస్‌ప్లేల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సాధించింది. జూన్ 12న బెంగళూరులో మంత్రి కె.తారక రామారావుతో జరిగిన సమావేశంలో ఎలెస్ట్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఎలెస్ట్ తరఫున ఎక్స్‌పోర్ట్ చైర్మన్ రాజేష్ మెహతా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో 6వ తరం అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్ ఉత్పత్తి కోసం రూ. 24 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల తయారీ కంపెనీలకు అవసరమైన అమోలెడ్ డిస్‌ప్లేలను ఎలెస్ట్ తయారు చేసి సరఫరా చేయనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ (ఎలక్ట్రానిక్స్)సుజయ్ కారంపురి,ఎలెస్ట్ సిఈఓ శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

అజర్‌బైజాన్ గ్రాండ్ ప్రి విజేత వెర్‌స్టాపెన్:

ఫార్ములావన్ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్ ఈ ఏడాది ఐదో టైటిల్‌ను గెల్చుకున్నాడు. జూన్ 12న జరిగిన అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల రేసును వెర్‌స్టాపెస్ అందరికంటే వేగంగా గంటా 34 నిమిషాల 5.941 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పోల్ పొజిషన్ తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో 21వ ల్యాప్‌లో వైదొలిగాడు.

భారత్ రేటింగ్ అంచనా పెంచిన ఫిచ్ రేటింగ్ సంస్థ

భారత దేశ సార్వభౌమ రేటింగ్‌కు సంబంధించి అవుట్‌లుక్ ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ రెండేళ్ల తర్వాత నెగిటివ్ నుండి స్థిరంకు అప్‌గ్రేడ్ చేసింది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ వల్ల మధ్య కాల వృద్ధికి ఎదురయ్యే సవాళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే రేటింగ్‌ను మాత్రం బీబీబీ మైనస్‌గా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ఫిచ్ 2006 ఆగస్టులో బీబీబీకు అప్‌గ్రేడ్ చేసింది. అప్పటి నుంచి ఇదే రేటింగ్ కొనసాగుతుంది. అయితే అవుట్ లుక్ మాత్రం స్టేబుల్ నెగెటివ్ మధ్య ఊగిసలాడుతోంది. భారత్ ఎకానమీ రికవరీ వేగవంతంగా ఉందని, ఫైనాన్షియల్ రంగం బలహీనతలు తగ్గుతున్నాయని ఫిచ్ తాజాగా పేర్కొంది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల వల్ల సవాళ్లు ఉన్నప్పటికీ ఎకానమీకి ఉన్న సానుకూల అంశాలు తమ తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది.

ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం:

ఉస్మానియా క్యాంపస్‌లో అత్యాధునిక సమీకృత పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అడోబ్ ముందుకొచ్చిందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో, ఉస్మానియా పూర్వవిద్యార్థి శంతను నారాయణ్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్ అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు.

ఐక్య రాజ్య సమితి తీర్మానంలో హిందీ:

ఐరాస సర్వ ప్రతినిధి సభ జూన్ 10న బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటి సారిగా హిందీని కూడా చేర్చింది. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో ఈ ప్రతిపాదనకు భారత్ సహా 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి. ఆరు అధికార భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్‌తో పాటు సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్ పేర్కొంది. ఐరాస గ్లోబల్ కమ్యూనికేషన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ భాషలను కూడా ఉపయోగించడాన్ని ప్రశంసించింది.

ఇన్‌స్పేస్ ఆఫీసు ప్రారంభం:

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇండియన్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ (ఇన్ స్పేస్)మోదీ ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న లక్షంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. ఐటీ తరహాలోనే గ్లోబల్ స్పేస్ సెక్టార్‌లోనూ భారత సంస్థలు అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. అంతరిక్ష రంగంలో గతంలో సంస్థలకు ప్రవేశం లభించేది కాదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వంలో సంస్కరణలను తెరతీయడం ద్వారా ప్రైవేట్ రంగానికి స్వాగతం పలుకుతోందని తెలిపారు. స్పేస్ సెక్టార్‌లో సంస్కరణల ద్వారా అన్ని నియంత్రణలను, ఆంక్షలను తొలగించామని వివరించారు. ప్రైవేటు రంగానికి ఇన్‌స్పేస్ తగిన మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ గవర్నెన్స్‌లో తెలంగాణకు ఐదో ర్యాంకు:

నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్‌మెంట్ (ఎన్‌ఈఎస్‌డీఏ) 2021 ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ 5, ఏపీ 8వ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఆన్‌లైన్ పద్ధతిలో అందిస్తున్న సేవలపై నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులను ఖరారు చేసింది. రాష్ట్రాలను హిమాలయఈ శాన్య, కేంద్రపాలిత ్రప్రాంతాలు, గ్రూప్‌ఎ, గ్రూప్‌బిలుగా విభజించి ఆయా కేటగిరిల్లో ర్యాంకులను ప్రకటించింది. గ్రూప్ ఎ కేటగిరిలోని మొత్తం 10 రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, పంజాబ్‌లు తొలి మూడు స్థానాలను దక్కించుకోగా తెలంగాణ 5, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచాయి.

ఈ గవర్నెన్స్ 2021 ర్యాంకులు:

మొదటి స్థానం కేరళ
రెండో స్థానం తమిళనాడు
మూడో స్థానం పంజాబ్
నాలుగో స్తానం కర్ణాటక
ఐదో స్థానం తెలంగాణ
ఆరో స్థానం గోవా
ఏడో స్థానంహరియాణా
ఎనిమిదో స్థానం ఆంధ్రప్రదేశ్
తొమ్మిదో స్థానం మమారాష్ట్ర
పదో స్థానం గుజరాత్.

గడువు ప్రకారమే ఎస్ 400 : రష్యా

భారత్‌కు ఎస్ 400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను ముందుగా నిర్ణయించుకున్న గడువు ప్రకారమే అందజేయనున్నట్లు రష్యా తెలిపింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఎస్ 400 సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుందేమోనని భారత్‌లో ఆందోళనల నేపథ్యంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లవుతున్న సందర్భంగా రష్యా డైజెస్ట్ అనే మేగజీన్‌కు ఆయన ముందుమాట రాశారు. పశ్చిమ దేశాలకు చెందిన అనేక కంపెనీలు బయటకు వెళ్లిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం తమ దేశ విపణిలో భారత వ్యాపారాలకు అవకాశాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చినట్లయిందని అందులో పేర్కొన్నారు. ఐదు యూనిట్ల ఎస్ 400 వ్యవస్థల కోసం రష్యాతో భారత్ 2018 అక్టోబరులో 500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News