Saturday, November 23, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ కృతజ్ఞతలు..

- Advertisement -
- Advertisement -

“సినిమా టికెట్ రేట్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లకు ధన్యవాదాలు చెబుతున్నాము” అని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “చిన్న సినిమాల టికెట్లను 50 నుంచి 150 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. కానీ దీనికంటే అధిక ధరలకు టికెట్లను విక్రయించకూడదని నిర్మాతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు ప్రేక్షకుల సౌకర్యాలే ముఖ్యం. ప్రస్తుతం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ విధానం గురించి అవగాహన కల్పిస్తున్నాం. కొన్ని థియేటర్లలో క్యాంటీన్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని కూడా సవరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాము” అని అన్నారు.

తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రతి ఒక్క సినిమాకు లాభం జరగాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జీఓ నం.120ను విడుదల చేసింది. ఇందులో కనీస, గరిష్ట టికెట్ ధరలను నిర్ణయించారు. సినిమా టికెట్లను చిన్న సినిమాలు తక్కువ రేట్లకు, మీడియం బడ్జెట్ సినిమాలు మొదటి వారం రోజులు ఎక్కువ రేట్లకు అమ్మాలి. ఆతర్వాత తక్కువ రేట్లకు అమ్మాలి. పెద్ద సినిమాలు సినిమా టికెట్లను మొదటి రెండు వారాలు ఎక్కువ రేట్లకు, తర్వాత తక్కువ రేట్లకు అమ్మాలి. ఈ టికెట్ రేట్లు అన్ని పన్నులతో సహా ఉంటాయి”అని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు బాలగోవింద్ రాజ్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Telangana Film Chamber thanks to TS Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News