హైదరాబాద్ : రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే 5.8 శాతం ఓట్లు పెరిగినట్లు పేర్కొంది.‘ పురుష ఓటర్లు – 1,58,71,493, మహిళా ఓటర్లు – 1,58,43,339, ట్రాన్స్ జెండర్ ఓటర్లు – 2,557, కొత్త ఓటర్ల సంఖ్య – 17.01 లక్షలు, తొలగించిన ఓట్లు – 6.10 లక్షలు, సర్వీస్ ఓటర్లు 15,338 మంది, ఓవర్సీస్ ఓటర్లు 2,780 మంది ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా లింగ నిష్పత్తి – 998 : 1000 ఉన్నట్లు వెల్లడించింది.
ఓటరు జాబితా పక్షాళన అనంతరం మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లు తెలిపింది. తొలగించిన ఓట్లు పోగా రాష్ట్రంలో ప్రస్తుతం 3,17,17,389 ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి మరో మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల బృందం హైదరాబాద్‌కు చేరుకుని ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు, వివిధ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎన్నికల బృందం మూడు రోజుల పర్యటన రేపటితో ముగియనుంది. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పెరిగిన లింగ నిష్పత్తి..
జనవరి 5న ఓటర్ల జాబితాలోని లింగ నిష్పత్తి 992 నుంచి 998కి మెరుగుపడింది. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో లింగ నిష్పత్తి 707 నుంచి 743కి మెరుగుపడింది. 80 ఏళ్లు పైబడిన 43,943 మంది ఓటర్లు, 5,06,493 మంది దివ్యాంగులు ఉన్నారు. తుది జాబితా ప్రచురించబడినప్పటికీ, ఓటర్ల జాబితాను నిరంతరం నవీకరించే ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటర్లు తమ వివరాలను eci.gov.inకి లాగిన్ చేయడం ద్వారా తెలుసుకునే వీలుందన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో తుది ఓటర్ల జాబితా ప్రచురించారు.