Wednesday, January 22, 2025

అంతర్జాతీయ మార్కెట్‌కు తెలంగాణ చేపలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న మత్స సంపదను అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని ,ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణా రాష్ట్రం నిలవాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం బేగంపేట లోని హరిత ప్లాజా లో నిర్వహించిన జాతీయ మత్స్యకారుల దినోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

మత్స్యకారుల సౌకర్యార్ధం మత్స్యశాఖ ఆధ్వర్యంలో మీ సేవ యాప్ ను మంత్రి ప్రారంభించారు. మత్స్యకారులు చేపల చెరువుల లీజును నేరుగా మీ సేవలో చెల్లించవయ్యని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మత్స్యకారుల జీవితాలలో వెలుగులు వచ్చాయని చెప్పారు. ఆర్ధికంగా, సామాజికంగా మత్స్యకారులు అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చొరవతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కాళేశ్వరం, కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ తదితర నూతన రిజర్వాయర్ ల నిర్మాణం, మిషన్ కాకతీయ కార్యక్రమంతో శిధిలమైన చెరువులు, కుంటలను అభివృద్ధి చేయడంతో అనేక నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.

ప్రతి రిజర్వాయర్, చెరువు, కుంటలలో తప్పని సరిగా చేప పిల్లలు విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గత సంవత్సరం 80 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తినట్లు తెలిపారు. అదేవిధంగా మత్స్యకారులకు అదనపు ఆదాయ వనరుగా మారాలనే ఆలోచనతో ఉచితంగా రొయ్య పిల్లల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రారంభంలో 2 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయగా, నేడు 21 కోట్లకు పెంచడం జరిగిందని వివరించారు. చేపల చెరువులపై దళారుల పెత్తనాన్ని నిర్మూలించి మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు. పంచాయితీ రాజ్ పరిధిలో ఉన్న చెరువులను కూడా మత్స్యశాఖ పరిధిలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తుచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని, రానున్న రోజులలో ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దళారుల మాయమాటలను నమ్మి తక్కువ ధరకు చేపలను అమ్ముకొని నష్టపోవద్దని అన్నారు. మహిళా మత్స్యకారులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వివిధ రకాల చేపల వంటకాలపై ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా మృగశిర కార్తె సందర్బంగా మూడు రోజులపాటు అన్ని జిల్లా కేంద్రాలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్ ను నిర్వహించడం జరిగిందని, ప్రజల నుండి కూడా అనూహ్యమైన స్పందన వచ్చినట్లు తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణం, అన్ని వసతులతో కూడిన చేపల మార్కెట్ ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ది మత్స్యకారులలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే సంకల్పంతో అర్హులైన లక్షమంది మత్స్యకారులను మత్స్య సొసైటీలలో సభ్యులుగా చేర్చేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు, ఇప్పటి వరకు 45 వేల మంది వరకు సభ్యత్వం అందజేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాతనే వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో మత్స్యకారులకు సబ్సిడీ పై వలలు, వివిధ రకాల వాహనాలను అందజేసినట్లు చెప్పారు. చేపలు, చేపల వంటకాల విక్రయాలు జరుపుకొనేందుకు వీలుగా ఒకొక్కటి 10 లక్షల రూపాయల విలువైన 150 వరకు వాహనాలను 60 శాతం సబ్సిడీపై అందజేసినట్లు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత మత్స్యకారులు నిరాదరణకు గురయ్యారని చెప్పారు. 60 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించే విధంగా ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మెరుగైన సేవలను అందించిన మత్స్య శాఖ అధికారులకు మంత్రి ప్రశంసాపత్రం, మెమెంటో లను అందజేసి శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, వివిధ జిల్లాల కు చెందిన మత్స్యకారులు, మహిళా మత్స్యకారులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News