Saturday, November 16, 2024

నిరుపేదల సమర గీతం గద్దర్

- Advertisement -
- Advertisement -

‘I have become a Communist because our party strives more than any other to know and to build the world, to make men clearer thinkers, more free and more happy. Pablo Picasso
‘When I give food to the poor, they call me a saint. When I ask why the poor have no food, they call me a Communist’ –Hlder Camara
‘Balladeers are typically skilled singers and song writers who specialize in the art of the ballad, often drawing on stories and themes from their own lives and experi ences’ –Jenny Louis
‘కీర్తి త్యాగానుసారిణీ’ అని ఆర్యోక్తి. త్యాగాన్ని బట్టే కీర్తి వరిస్తుందని తాత్పర్యం. కుటుంబం, చదువు, ఉద్యోగం, తత్సంబంధిత ఉజ్వలమైన భవిష్యత్తు కళ్ల ముందుండి అన్నిటినీ తృణప్రాయంగా త్యజించి నమ్మిన ఆశయం కోసం రాజ్యంతో తలపడడానికి దళంలో చేరడం నిరుపమాన త్యాగమే మరి. జీవితంలో ఉద్యమం ఒక వంతుగా కాకుండా, ఉద్యమమే జీవితంగా బ్రతికిన సుప్రసిద్ధ ప్రజాగాయకుడు గద్దర్. ఆగస్టు 6న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో మరణించారు. అభ్యుదయ కాముకులు, ఉద్యమ సంఘాలు యుద్ధనౌక అంటూ ముద్దుగా పిలుచుకునే గద్దర్ మృతి సమాజాభ్యుదయానికి తీవ్ర నష్టం. ముఖ్యంగా వామపక్ష దళిత బహుజన సాంస్కృతిక రాజకీయాలకు తీరని లోటు. పీపుల్స్ వార్ నిర్మాణంలో కావొచ్చు, బయటకు వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలో పౌరహక్కుల చైతన్య వ్యాప్తిలో కావొచ్చు, తెలంగాణ మలిదశ ఉద్యమ విజయవంతానికి జరిగిన కృషిలో కావొచ్చు ఆయన కాంట్రిబ్యూషన్ అనితర సాధ్యమైనది. సాహిత్యం విషయానికొస్తే విప్లవ గీతానికి క్లాసిక్ స్థాయిని కల్పించిన ఘనత ఆయనదే. మా గొల్లసుద్దులను కులీనుల నృత్య రూపాల ప్రక్కన నుంచోబెట్టిన ఘనతా ఆయనదే.

గద్దర్ ప్రగతిశీల భావాలను, ప్రజా కళారాధనను తెలుగు సమాజం గత యాభై ఏండ్లుగా స్వాప్నికంగా అనుకరిస్తూ వచ్చింది, వాస్తవికంగా ఆనందిస్తూనూ వచ్చింది. వామపక్షాలకు, దళిత బహుజన శిబిరాలకు, తెలంగాణావాదులకు గద్దర్ ఆయా దశల్లో సంజీవనిలా దాపున్న వాడు కనుకనే ఆయన అంత్యక్రియల్లో అన్ని వర్గాల పట్టింపు, ప్రతిస్పందన అంత పెద్ద మొత్తంలో సంభవించింది. అధికారికంగా ఎలాంటి పదవి హోదా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం ఆయనకు మాత్రమేదక్కిన ఒక అరుదైన గౌరవం. గత వారం పది రోజులుగా గద్దర్ అభిమానులు నిర్వహిస్తున్న సంతాప సభలు, నివాళి కార్యక్రమాలను చూస్తే ఆయన చనిపోయిన క్షణం నుంచి మళ్లీ జీవించడం మొదలైనట్టు కనిపిస్తుంది. తెలుగునాట ఎందరో ప్రజాకవులు మహాకవులున్నప్పటికినీ గద్దర్ మాదిరిగా పాట ద్వారా రాజకీయాలను సాహిత్యాన్ని ప్రభావితం చేసినవాళ్లు మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.పల్లెపదాల బాణీలకు అరుణకాంతులనద్ది జననాట్యమండలి ద్వారా పాటను భౌతిక శక్తిగా తీర్చిదిద్దిన మూర్తిమంతుడు. ఆయన భౌతికంగా మన మధ్య ఇవాళ లేరు. భౌతిక శక్తిగా ఆయన వదిలి వెళ్లిన పాటలు, వాటి ప్రదర్శనా తాత్త్వికత, కళారీతులు మన మధ్య సజీవంగా ఉన్నాయి. దోపిడీ పేదరికం వివక్ష అణచివేత సమాజంలో కొనసాగినంత కాలం ఆయన కాలిగజ్జెల సవ్వడి, విచారధార ప్రజల గుండెల్లో మార్మోగుతూనే వుంటుంది. బుద్ధుడు, మార్క్, అంబేడ్కర్ లాగే గద్దర్ ప్రాసంగికత వర్థిల్లుతూ వుంటుంది.

నలభై ఏండ్ల క్రితం నాబోటి వాళ్లం అట్టడుగు వర్గాల తొలి తరం అక్షరాస్యులం ఉన్నత విద్య కోసం ఊర్లల్లోంచి పట్టణాలకు వచ్చినప్పుడు ఏ బాటన నడవాలి? ఏ పాటలు వినాలి? ఏ చింతన అనుసరించాలి? అనే ప్రశ్నలు తలెత్తినపుడు పికాసో అన్నట్టు’ ప్రపంచాన్ని లోతుగా తెలుసుకోవడానికి, నిర్మించడానికి, మనుషులు స్వేచ్ఛగా మరింత సంతోషంగా బ్రతకడానికి కమ్యూనిజం కృషి చేస్తుంది. ప్రపంచ శ్రేయస్సును కోరేది కమ్యూనిజమే’నని ఉద్బోధించిన పాటల పాఠశాల గద్దర్. చదివిందాని కంటే, ఆయన పాటల్లో ప్రదర్శనల్లో మార్క్సిజం సులువుగా అర్థం అయ్యేది. అసలు గద్దర్ అనే పేరే మాకు విచిత్రంగానూ, వినూత్నంగానూ అనిపించింది.

‘గదర్’ అనేది మన దేశంలో బ్రిటిష్ పాలనను అంతం చేయడానికి ప్రవాస భారతీయులు స్థాపించిన అంతర్జాతీయ రాజకీయోద్యమమని, యునైటెడ్ స్టేట్స్, కెనడా వెస్ట్ కోస్ట్‌లో పని చేసే విప్లవకారుల కార్యాచరణతో అనుసంధానమై పని చేస్తుందని, అందుకే గదర్ పార్టీ స్ఫూర్తి సూచకంగా గుమ్మడి విఠల్‌కు బదులుగా ‘గద్దర్’ నామధారణ చేసుకున్నాడని తెలుసుకున్నాక ఆయన మీద మాకు మరింత గౌరవం పెరిగింది. విప్లవకారుడు అనే వాడు నిర్భయంగా సమాజంలో సమూలమైన మార్పును వాంఛిస్తాడు, సమర్ధిస్తాడు. అతని సక్రియాత్మక ఆలోచనలు సమాజం యథాతథ స్థితిని నిత్యం సవాలు చేస్తుంటాయి. లక్ష్య సాధన కోసం సాయుధుడై వ్యవస్థాగత క్రమాన్ని మలుపు (రివాల్వ్) తిప్పేందుకు ఉపక్రమిస్తాడని గద్దర్ పాటలు అర్థం చేయించాయి. కాలక్రమేణా సామాజిక రాజకీయ ఆర్థికరంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలన్నీ ఆయన సాహిత్యం ప్రతిబింబిస్తూ వచ్చింది.

ప్రసిద్ధ హిందీ గీత రచయిత అభిలాష్ లాగే గద్దర్ ఆర్ట్ లవర్. అకడమిక్స్ లో అద్భుతమైన విజయాలను కాదనుకొని జీవిత లక్ష్యాన్ని మార్చుకున్న అభిలాష్ వలెనే ‘ఇత్నీ శక్తి హమే దేనా దాతా’ అంటూ స్మరించుకోవాల్సిన పాటలెన్నో గద్దర్ గొంతున రాజుకున్నాయి. ‘మా భూమి’ సినిమాలో’ బండెనక బండిగట్టి’ , ‘రంగుల కల’ సినిమాలో ‘జర భద్రం కొడుకో’ పాటల్లో ఆయన ఆలాపన నర్తన ఇవాళ్టికీ మా తరానికి పీటసీగర్ ‘We Shall Overcome’ వలె గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్నిస్తున్నాయి. అప్పట్లో ఫలానా కార్యక్రమానికి గద్దర్ వస్తున్నాడనో, వస్తాడనో తెలియగానే విద్యార్థులమే కాదు అభిమాన ప్రజానీకం వేలాదిగా తరలివచ్చేది. బహుశా సినిమా హీరోలకు కూడా లేని జనాకర్షణ గద్దర్‌కు ఉండేది. ఏడు ఎనిమిది దశకాల్లో ఆయన ఒక ప్రజాసమ్మోహనశక్తి. లక్షల మందిని కదిలించిన వైబ్రెంట్ పర్ఫార్మర్. గొల్లసుద్దుల వేశధారణలో ఎర్రజెండా పిడికిట ధరించి గొంతెత్తాడో అక్కడో లాంగ్ మార్చ్ సాక్షాత్కారం. అప్పటికి అడవి ఆయన ఆరాధ్య స్థలం కావటాన వేదికల మీద ఆదివాసీ ‘రేలా రేలా’ స్వరఝరి జాలువారేది.

ప్రదర్శన తాలూకు గద్దర్ నృత్యభంగిమలు, హావభావాలు, దరువు, కోరస్ కలుపుకొని పాశ్చాత్య వాగ్గేయకారుల ‘పవర్ బాలెడ్ ( Power Ballad is a slow rock song with a strong, emotional vocal delivery and typically a grandiose production) లను మించి ప్రజలను కదిలించేవి. జై బోలో తెలంగాణ సినిమాలో’ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’ పాట మళ్లీ చూడండి. ‘అమ్మా తెలంగాణమా ఆకలికేకల గానమా’, ’ఊరు మనదిరా ఈ వాడమనదిరా’ కొండలు పగలేసినం కండలను పిండినం’ ప్రదర్శనలు పునఃతిలకించండి. ‘వరిసేలు ఏడ్సినాయి’, ‘నిండు అమాస నాడు ఓ లచ్చగుమ్మడి’ ’సిరిమల్లె చెట్టుకింద లచ్చు మమ్మో’, ‘మదనా సుందరి మదనా సుందరి’, ‘మల్లె తీగకూ పందిరివోలె’, ‘పొద్దు తిరుగుడు పువ్వును పొద్దు ముద్దాడే’ ఇత్యాది పాటల శ్రుతిలయలు, రాగతాళాలు గద్దర్ గొంతులో ఎంత శ్రవణ సుభగత్వం దాగి వుందో చాటుతాయి. శ్రీశ్రీ చెప్పినట్టు కాదేదీ పాటకనర్హం అంటూ చీపురు, ఫ్యాను, టాయిలెట్, టి.వి, చెప్పులు మొదలైన వాటిమీద కట్టిన విలక్షణమైన పాటలు తెలుగు భాష మీద గద్దర్ మార్కు సంతకం.

దైనందిన జీవితంలో ఉపయోగించే చిన్న చిన్న పని ముట్ల మీద పాటలు ఎట్లా రాసిపాడగలిగినాడనే సంశయాన్ని ప్రఖ్యాత పెయింటర్ గణేశ్ హొలాయ్ సూత్రీకరించినట్టు ‘ఒక నేత ఒక అందమైన చీరను నేస్తాడు, దాని అంచు, చిక్కనైన డిజైన్, షేడ్స్ దాని విలువను పెంచుతాయి. ఇదే దుకాణంలో విశిష్టమైన డిజైన్ ముక్కగా మారుతుంది. ఒక స్త్రీ ఆ చీరను ధరించినప్పుడు ఆమె జీవితంలో అది భాగం అవడంతో పాటు దాని మార్పులు కూడా భాగం అవుతాయి. అప్పుడు అది పెయింటింగ్‌గా రూపాంతరం చెందుతుంది, ఎందుకంటే ఇది వ్యక్తి జీవితంలో ఒక భాగం అవుతుంది. మార్కెట్‌లో చాలా రకాల స్పూన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు మీ ఉదయపు కప్పు టీని తయారు చేయడానికి ఒక నిర్దిష్ట చెంచాను ఎంచుకున్న క్షణం, మీరు మీ కప్పులో టీని కదిలించేటప్పుడు అది మిణుకు మిణుకుమంటూ శబ్దం చేస్తుంది, అది మీ సుఖదుఃఖాలతో మీ ఆలోచనలతో గాఢంగా పెనవేసుకుంటుంది. అప్పుడు చెంచా ఇకపై సరుకుగా ఉండదు, అది పెయింటింగ్ అవుతుంది. కష్టాల నుండి ఉద్భవిస్తే తప్ప కళ కళ కాదు.

ఇదిగో ఈ తాత్త్విక వ్యాఖ్యతో ప్రేక్షకులు గద్దర్ పాటల విస్తృతిని సమన్వయం చేసుకోవాల్సుంటుంది. జీవితంలో భాగమైన ప్రతి విషయాన్ని, శ్రమలో సంలీనమైన ప్రతి వస్తువును విప్లవకారుడు తనదైన సృజనశీలతతో మేళవించగలడనే దానికి గద్దర్ మన కాలానికే కాదు ముందుతరాలకూ ఒక నిదర్శనం. మలి దశ తెలంగాణోద్యమంలో భాగంగా మా నకిరేకల్ స్టేడియంలో ఒక బహిరంగ సభ జరిగింది. దాదాపు మూడు వందల మంది కళాకారులు గద్దర్ లాగే ఆహార్యం ధరించి జాతీయ రహదారి మీద నడుస్తున్న కన్నులపండుగైన దృశ్యంలో గద్దర్ ను గుర్తుపట్టడం ప్రేక్షకులకు కష్టమే అయింది. ప్రశ్ననైనా పారవశ్యంగా అడిగే పద్ధతికి, శోకమైనా శ్లోకమంత మాధుర్యంగా వినిపించే ఫణితికి గద్దర్ ఒక రసాముద్రిక. తనకు ముందు పాట కాన్వాసు మీద తెలంగాణా సాయుధ పోరాటం బానిసల విముక్తికి శ్రుతిపెడితే, దానికి కొనసాగింపుగా గద్దర్ స్వాతంత్య్రానంతరం ప్రజలకు ప్రభుత్వాల ద్వారా దక్కవలసిన ఉపాధి, స్వావలంబన, సామాజిక మార్పుకు సమర గీతమై రగిలినాడు. ఆదర్శం పట్ల వినమ్రత, అమరత్వం పట్ల తాదాత్మ్యత, ఆదరించిన ప్రకృతి పట్ల కృతజ్ఞత గద్దర్ పర్ఫార్మెన్స్ నుండి మనకు అదనంగా లభించే భావోద్వేగాలు.
ఎర్రజెండా ఆయన అక్కున జేరి పసిపాప అవడమూ, పోరుజేసే వీరుడుగా ఎదగడమూ, కథాకథన సామర్థ్యంలో వెల్లువెత్తే ఆశుకవిత్వం, నృత్య రూపకంలో పాత్రోచిత సవరణలు, సంభాషణలతో ఎగిరి దూకే గద్దర్ మనకో నిత్యానురక్తి. ఆయనకు ఆయనో జగన్మోహిని, నర్తకి. మహాకవి శేషేంద్ర అన్నట్టు ‘ఒక శబ్దాన్ని వాక్యంలో భిన్న భిన్న స్థలాల్లో పెట్టడం చేత ఎలా ఆ వాక్యార్థ వైఖరి మారుతుందో రచనా మర్మజ్ఞులకే తెలుసు. ఏ కవుల రచనలు మన మీద ఆశ్చర్యాఘాతం విసురుతాయో ఆ కవులందరి రచనలు ఇలా జాగ్రత్తగా నిర్మింపబడ్డవే. పైకి ఎంత సరళంగా కనిపించినా వాటి వెనుక ఎంత వ్యూహజ్ఞత నిలిచి ఉందో రచన లోతుల్లోకి ప్రయాణాలు చేసే నావికులకే తెలుసు’.

ప్రజల కోసం ప్రజల గురించి పాట రాయడానికి సంబంధించి శేషేంద్ర చెప్పిన శబ్దవేవృతా, నిర్మాణ కౌశలంలో గద్దర్ మహాపండితుడు. రాజకీయాల్లో, సాహిత్యంలో ఆయన పీడితుల పక్షం. దానిపేరే ప్రతిపక్షం. రెవల్యూషనరీగా అంబేడ్కరిస్టు గా బుద్ధిస్టుగా సూర్యుడు చంద్రుడు వెన్నెల ఆయన తన పిల్లలకు పెట్టుకున్న పేర్లు మాత్రమే కాదు, తేట తెలుగున ప్రజావాగ్గేయాన్ని ఆయన దిద్దితీర్చిన తీరూ తెన్నూ కూడా.గద్దర్ బ్రెజిలియన్ సోషలిస్టు హెల్డర్ కామారా వలె ఇంటింటికీ వెళ్లి భిక్ష పంచిన సన్యాసి కాదు,కానీ ప్రజల్ని వీధి నాటకానికి రప్పించి దేశంలో ఆకలికేకలు ఆర్తనాదాలు ఎవడి సృష్టో పేదలకు విప్పిచెప్పిన మనీషి, కమ్యూనిస్టు.జెన్నీ లూయిస్ అంటున్నట్టు గద్దర్ రాసిందీ కాలరేఖమీద ధీరోదాత్తుడిగా నిలబడి నర్తించి వినిపించిందీ ఆత్మకథా సమాహారమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News