Tuesday, January 21, 2025

నిలువెల్ల గానాల వీణ

- Advertisement -
- Advertisement -

ప్రజా యుద్ధ సంగీతం, నెత్తుటి చాళ్ళలో విత్తనమై మొలకెత్తిన పాటల వనం, అట్టడుగు ప్రజల కోసం గళమెత్తిన ప్రజా గాయకుడు, తెలంగాణ రాష్ర్ట గిడ్డంగుల సంస్థ చైర్మన్ వి. సాయిచంద్ నిన్న గుండెపోటుతో మరణించడం తెలంగాణ కళా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రజా నాయకుడు, పాట కవి ఇలా అకాల మృత్యువును పొందడం తెలంగాణ ప్రజా సమూహాలను తీవ్రంగా కలిచివేసింది. తెలంగాణ మలి దశ ఉద్యమంలో తన పాటతో ఊపు తెచ్చిన గాయకుల్లో సాయిచంద్ ఒకడు.

సాయిచంద్ వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న మణెమ్మ, వెంకట్రాములు దంపతులకు జన్మించాడు. సాయి చంద్‌కు పాట తన రక్తంలోనే ఉన్నది. అమ్మ బీడీ కార్మికురాలు కాగా, నాన్న చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి. వెంకట్రాములు కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలు గల నాయకుడు. అందుకే ఎక్కువగా ఎర్రజెండా పాటలు పాడేవాడు. ప్రజా ఉద్యమాలతో మమేకమై తిరిగేవాడు. ఈ వారసత్వమే సాయి చంద్‌ను ప్రజా వాగ్గేయకారుడిగా నిలబెట్టింది. దాదాపు రెండు వేల అయిదు వందల పాటలు పాడేలా చేసింది. ఆరవ తరగతిలో ఉన్నప్పటి నుంచే తన చుట్టూ ఉన్న పల్లెల్లో వినిపించే జానపద గేయాలు, ప్రజా ఉద్యమ పాటలు విని ఆ దారిలోనే నడిచిన వాడు. దాశరథి రాసిన ప్రఖ్యాత పాట “ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో..” లాంటి పాటలతో పాటు అనేక సినిమా పాటలు పాడుతూ తనలోని గాన కళను మెరుగుపర్చుకున్నాడు.

సమీకరించు బోధించు పోరాడు అని నమ్మి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేస్తూ పిడిఎస్‌యులో పని చేస్తున్నప్పటి నుంచే మంచి కళాకారుడిగా, గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మలిదశ తెలంగాణా ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి చనిపోయినపుడు సాయి చంద్ పాడిన “రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! రక్త బంధం విలువ నీకు తెలియదురా!!” అంటూ పాడిన మిట్టపల్లి సురేందర్ పాటతో ఒక్కసారి వెలుగులోకి వచ్చి అందరికీ పరిచయం అయ్యాడు. ఈ పాట వింటూ ఆనాటి తెలంగాణ ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శ్రీకాంతాచారి తల్లితో పాటు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న కొన్ని లక్షలాది మంది దుఃఖ సముద్రంలో మునిగిపోయారంటే సాయి చంద్ గొంతులోని తడి ఏపాటిదో అర్థమవుతుంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆట పాటతో రసమయి ఆధ్వర్యంలోని ధూం ధాం వేదికల మీద సాయిచంద్ చెలరేగి పోయి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు.

Singer Sai Chand died with Cardiac Arrest

ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషి చేశాడు. ఆయన పాడుతుంటే ఆయన గొంతు తప్ప మనకు ఏమీ వినబడదు. అంతలా ప్రజల్ని సమ్మోహన పరిచే గొంతు అతడిది. తెలంగాణ ఉద్యమంలోకి రాక ముందు అనేక జనరంజకమైన పాటల్ని, జానపద బాణీలలో పాడి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పుట్టిన బిడ్డగా పాలమూరు కరువు మీద అనేక పాటలు రాసి పాడాడు. ఇతర ప్రజా కవులు రాసిన పాటలు కూడా అనేకం పాడి ఆనాడే కొన్ని పాటల క్యాసెట్లను విడుదల చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. గాయకుడిగా మొదలైన తొలి దశలో “ఏరంచు ఊరు నా ఊరు పాలమూరు/ ఏరంచు ఊరు ఊరంచు ఏరు/ ఎటు పార జూసినా ఎడారి తీరు..” అని పాలమూరు వలస కూలీలపైన పాడిన పాట ఆయనకు బాగా పేరు తెచ్చింది.

ఆ తరువాత తీన్మార్ బీట్‌లో బల్కంపేట ఎల్లమ్మ మీద రాసి పాడిన “ఎళ్ళు ఎల్లమ్మ ఎళ్ళు తల్లి బాయిలోంచి బయటికెళ్ళు/ జడలమారి తల్లి ఎళ్ళు జరా కురిపించు వరాల జల్లు..” అనే పాట తెలంగాణ బోనాల పండుగకు కొత్త ఊపు నిచ్చింది. తల్లి గొప్పదనాన్ని తెలపడానికి చాలా పాటలున్నాయి కాని  నాన్న మీద రాసిన పాటలు చాలా తక్కువ అని గుర్తెరిగి సాయి చంద్ రాసి పాడిన “నాన్నా నాన్నా నాన్నా నీ మనసెంతో మంచిదో నాన్నా/ నాన్నా నాన్నా నాన్నా నీ ప్రేమెంతో గొప్పదో నాన్నా” అనే పాట ఎంతో మంది చేత కన్నీళ్లు పెట్టించింది. నాన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. సీరియస్ పాటలే కాదు సరదా పాటలు కూడా రాసి పాడిన ఘనత సాయి చంద్ ది. దానికి మంచి ఉదాహరణ “మూడు వందాలు ఇస్తా ముక్కుకు ముక్కేరదెస్తా రాయె పిల్లా/ అబ్బబ్బా ఓయి హోయి రాయె పిల్లా ఎంకటి రైలు కట్టా కూలికి..” అంటూ సాగే పాట. పల్లెలో పుట్టి పల్లెలో పెరిగిన సాయి చంద్ ప్రకృతి మీద అనేక పాటలు రాశాడు.

పాడి మెప్పించాడు. “మా పల్లెతల్లి గొప్పతనం చెప్పటానికి ఒక పాట చాలదు నా పాట చాలదు/ ఆ తల్లిగొప్పతనం నీకు ఎంత చెప్పినా తనివి తీరదు మనసు ఆశ తరగదు” అనే పాట పల్లె గొప్పదనాన్ని, ప్రాముఖ్యతను చాటడానికి సాయి చంద్ గళం నుంచి వచ్చిన పాట. ఇలా సుమారు రెండు దశాబ్దాలు ప్రజా ఉద్యమాలతో, విద్యార్ధి పోరాటాలతో కల్సి నడిచిన సాయి చంద్ జమిలీగా దశాబ్దం పాటు అటు దళిత ఉద్యమాలతో, ఇటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో కల్సి అడుగులు కదిపాడు. ఆ క్రమంలో ఆయా సందర్భాలకు అనుగుణంగా అనేక పాటలు రాయడం, వాటికి జనామోదమైన బాణీలు కూర్చి తన గొంతుతో పాడి ప్రజలను కదిలించడం మొదలు పెట్టాడు.

“మేము కళాకారులం కళా బాటసారులం కళా బాటసారులం/ కళయే మా జీవితం కళకే మేమంకితం/ గాత్రమే మా జీవన సూత్రంగా బ్రతుకుతం/ మా ఆకలి కడుపులపై కంజిర దరువేస్తాము/ మా ఎండిన డొక్కలపై డప్పులు మ్రోగిస్తాము/ మా పేగులే తీగలుగా కిన్నెర వాయిస్తాము/ మా ఊపిరి తిత్తులతో మురళిని పలికిస్తాము/ మా పెదవులపై పదముల నాట్యం చేయిస్తాము/ మా పల్లె జానపదుల పల్లకి మేం మోస్తాము”

అంటూ రాసిన, పాడిన పాట కళాకారులకు గొప్ప గుర్తింపును తెచ్చింది. కళాకారుల జీవితాల తీరు, వారి ఆకాంక్ష అన్ని ఈ పాటలో చిత్రితమయ్యాయి. ఇప్పటికీ ఈ పాట ఆయా సభలల్లో మారుమోగుతూనే ఉంటుంది. గాయకులు ప్రజలకు ఉపయోగపడే పాటలు పాడాలి. ప్రజలకు నచ్చే విధంగా పాడాలి. రచయిత భావాన్ని ప్రజలకు చేరవేయాలి. అప్పుడే గాయకుడు విజయవంతం అయినట్లు అని నమ్మే గాయకుల్లో సాయి చంద్ ఒకడు. పాట మార్పు తీసుకురావాలని, పాట ఆర్ద్రతను పంచుతూనే చైతన్యాన్ని కలిగించాలని భావించే పాట కవి సాయి చంద్. ఆయన పాటల ప్రస్థానమంతా ఈ రేఖ మీదనే నడిచింది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కథానాయకుడి పాత్రను పోషించింది కేవలం పాటేనంటే అతిశయోక్తి కాదు. దీనికి ప్రాణం పోసిన వారిలో రసమయి బాలకిషన్, దేశపతి లాంటి గాయకులతో పాటు సాయి చంద్ కూడా ముందు వరుసలో ఉంటాడు. ఉద్యమం నీరసించి నెమ్మదించినపుడు దానికి మళ్ళీ జవసత్వాలు అందించింది ఉద్యమకారుల ఆత్మహత్యలు, ప్రజా గాయకుల పాటలే.

“మందెంట పోతుండే ఎలమందా వాడు ఎవ్వరీ కొడుకమ్మ ఎలమందా/ చూస్తే చిన్న పోరగాడే ఎలమందా వన్నె రుమాలే గట్టిండే ఎలమందా/ చూస్తే చిన్న పోరాగాడే ఎలమందా తెలంగాణా జెండా వట్టె ఎలమందా” అంటూ సాగిన పాట ఆనాడు ఉద్యమం మూలమూలలకు పాకిందని, ప్రతి మనిషినీ ఉద్యమంలో భాగస్వామిని చేసిందని చెప్పడానికి నిదర్శనంగా కనిపించే పాట. ఈ పాట సాయి చంద్ గళంలో ఒక కొత్త ఉత్తేజాన్ని తొడుక్కొని వినిపించేది. గద్దర్, గోరటి వెంకన్న, గూడ అంజన్న, అందెశ్రీ లాంటి రచయితల ఉద్యమ పాటలు సాయి చంద్ పాడి ఉర్రూతలూగించేవాడు. ఇదంతా ఒకవైపైతే దళిత ఉద్యమానికి కూడా సాయి చంద్ వెన్నుదన్నుగా నిలిచాడు.

“నీ తెలివి నీ సహనం నీ త్యాగం నీ సాహసం లేకుంటే/ ఏనాడో బుగ్గై పోతుంటిమో ఈ భరత భూమిలోన/ బగ్గై పోతుంటిమో బాబా అంబేద్కరా/ మా బడుగులకు భాస్కరా/ మీరే లేకుంటే మేమేమై పోతుంటిమో” అని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ బహుజన దృక్కోణం పైన రాసిన అద్భుతమైన పాట బహుజన ఉద్యమానికి కొత్త ఊతమిచ్చింది. “ఎవ్వడు జెప్పిండురా మీరెక్కువ జాతోల్లని/ ఏడా రాసిండ్రురా మేం తక్కువ జాతోల్లమని..” అని సాయి చంద్ పాడిన పాట ఆధిపత్య వర్గాలను ప్రశ్నించి, కడిగి పారేసిన పాట. ఇలా దళిత, స్వరాష్ర్ట ఉద్యమాలను రగిలిస్తూనే సాయి చంద్ సినిమా రంగం వైపు కూడా దృష్టి సారించాడు. ‘ద ఇండియన్ పోస్ట్ మ్యాన్’ అనే సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. సినిమాల్లో కూడా అనేక పాటలు పాడాడు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఫలించి స్వరాష్ర్టం ఏర్పడిన తరువాత సాయి చంద్ ప్రతిపక్షంలో ఉండకుండా అధికార పక్షంలో చేరిపోయాడనే విమర్శను ఎదుర్కొన్నాడు. కాని ప్రజా గాయకులు ఎప్పుడూ ప్రజల పక్షమే అని చాటి చెప్పడానికి అయన రాసి పాడిన పాటలే నిదర్శనం. ఒకప్పుడు ప్రజల కన్నీళ్లను గానం చేశాను. ఆ కన్నీళ్లు మాయమైపోయి సుఖ సంతోషాలు ప్రజలను పలకరించినపుడు ప్రజల సంతోషాన్ని కూడా పాడుతాను అని చెప్పుకొని “రాళ్ళుదేలిన నేలలో రతనాల రాసులు జూస్తిమి/ మోడు వారిన బీడులో మొలకెత్తె చిగురుల జూస్తిమి/ కన్నీళ్లు నిండిన కళ్ళలో మా కలల పంటలు పండెనో / ఎండి పోయిన భూములన్నీ పచ్చగా మార్చేసెనో /ఏరువడిన తెలంగాణాలో ఎతలుదీరి పాయెనో”

 

అని స్వరాష్ర్టంలో ప్రభుత్వ అభివృద్ధిని కూడా కీర్తించాడు. ఒక విజన్ ఉన్న నాయకుని పాలనలో తెలంగాణ ఎలా కొత్త పుంతలు తొక్కుతుందో, ఉమ్మడి రాష్ర్టంలోని కరువు పోయి తెలంగాణ అంతా ఎలా సస్యశ్యామలం అయిందో పాడి చూపించాడు. అంతే కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో కలిసి “స్వరాష్ర్టమై తెలంగాణ విరాజిల్లుతున్నది/ పరవశించి రాష్ర్ట వీణ పాట పాడుతున్నది..” లాంటి పాటలు రాసి, పాడి ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించాడు. మరో అడుగు ముందుకు వేసి తెలంగాణలోని ఇద్దరు బలమైన నాయకులు కెటిఆర్, హరీశ్ రావుల మీద కూడా పాటలు రాసి పాడాడు. అవి ఎంతో సంచలనం సృష్టించాయి. ఇటీవల అరుణోదయ రామారావు మరణించినపుడు రాసి పాడిన “పాటమ్మ అడిగినాదె నా కొడుకు ఏడని/ పల్లె ఎతికినాదే నా బిడ్డ యాడని..” అనే పాట ఆయనకు కూడా వర్తించడం అత్యంత విషాదం. ఒక యువ నాయకుడు, తెలంగాణ దళిత స్వరం, బాధిత కంఠం సాయి చంద్ మరణం తెలంగాణ కళా జగత్తుకు తీరని లోటు. ఆయనకు అక్షర నివాళి

డా. వెల్దండి శ్రీధర్ 9866977741

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News