సృష్టిలోని ఏ మనిషి అయినా పుట్టినప్పటి నుండి అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కుంటాడు. అయితే మనిషి తను ఏదో ఒక సందర్భంలో తను కూడా గొప్ప వ్యక్తిని కావాలని పరితపిస్తాడు. అందరూ తనను మంచివాడని గొప్పవాడని అనాలని ఆశిస్తాడు. అందుకోసమై నానా విధాల ప్రయాసపడుతూ, ప్రయత్నిస్తూ కాలంతో పరిగెడుతాడు. అందుకు కళామతల్లి ముద్దు బిడ్డ సాయిచందు జీవితమే ఒక తార్కణం. అమరచింతలో పుట్టి పెరిగిన సాయిచందు బాల్యమంతా పేదరికంతో పస్తులతో గడిచింది. రోజు కూలి బీడి చూట్టే అమ్మ ఒక్క రోజు పని మానేసిన పస్తులు తప్పని పరిస్థితి తండ్రి కమ్యూనిస్టు కావడం చేత సాయిచందును ఆ మార్గంలో పయనించాలన్న సంకల్పం నూరి పోశాడు. అభ్యుదయ భావాలను, అరుణోదయ పాట బాణీలను పసి తనంలోనే నరనరాన జీర్ణించుకొని జనం పాటను భుజానెత్తుకుని బాలకార్మిక వ్యవస్థ పైన వెట్టి చాకిరి పైన గళమెత్తి ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా పాటల పిల్లగాడిగా విప్లవ జ్వాలై మెరిశాడు.
నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళుకు పన్నిరాయే/ ఒంటిగా ఓ శోకం బెట్టకు చిన్ని తమ్మయ్య/ నీ జంటగా నేనుంటారారా చిన్ని తమ్మయ్య /అంటూ పేదోడి కష్టాలు కలిగినోడికి ఎప్పటికి అర్థం కావని, కాబట్టి నీకు నేను తోడుంటాను, నీ కష్టాల్లో భాగం పంచుకుంటానని చెప్పే విధంగా తన మధురమైన కంఠంతో ఎందరో పసి హృదయాలను తట్టి లేపాడు. నేను 8వ తరగతి, అదే స్కూల్‌లో సాయిచందు 9వ తరగతి చదువుతున్న నేపథ్యంలో స్కూల్ ఫంక్షన్‌లో సాయిచందు స్వీయ రచన గానంతో అరుణ అరుణ ద్వజ కిరణాలం/ అభ్యుదయానికి వారసులం/ ఉషస్సు కోసం తపస్సు చేసే / ఋషి మునిజనుకుని వారసులం / అనే పాట పాడి అరుణ కేతనానికి, అభ్యుదయానికి ప్రతికలం అంటూ విద్యార్థి లోకంలో అభ్యుదయ బీజాలను నాటాడు. వెలివాడలో జన్మించిన సాయిచందుకు వినోదం, విలాసవంత జీవితం లేకపోయినా బాధపడలేదు. కన్న తల్లి కండ్లముందే కరెంటు తీగలకు బలైపోతే పసి హృదయం విలవిలాడిపోయింది. అమ్మలేని లోటు ఎవరు పూడ్చలేనిది. ఆకలితో కడుపు మాడ్చుకొని నాన్నా చూపిన విప్లవ బాటలో పాటై పయనించాడు.
అన్నింటికి మించి కమ్యూనిస్టు పోరాటాలకు, అభ్యుదయ ఆలోచనలకు, అమరుల ఆశయాలకు ఆదర్శాలకు ప్రజా ఉద్యమాలకు నిలువుటద్దంగా ఉండే అమరచింత సాయిచందుకు పాటల వంతెనగా నిలిచి తనలో మంచి స్ఫూర్తిని నింపాయి అనడంతో అతిశయోక్తి లేదు. ఇంటర్మీడియట్ విద్య వరకు జంటగా ఉండే అ,ఆ (అమర చింత, ఆత్మకూర్)లో పూర్తి చేసుకొని ఉన్నత విద్యకు వెళ్లాలన్న తన ఆలోచన తనను పట్నం వైపు అడుగులు వేయించింది.
గ్రాడ్యూయేషన్ చేస్తూనే విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న తరుణంలోనే గొప్ప కళాకారులైన గద్దర్, గోరేటి వెంకన్న, విమలక్క, నాగన్న, రామారావు లాంటి వారితో సాయిచందుకు ఏర్పడిన పరిచయంతో తన గాత్రానికి వెయ్యి ఏనుగుల బలాన్ని చేకూరి పాటల పయనం నలుదిశల వ్యాపించింది. డా॥ బి.ఆర్. అంబేద్కర్ వారసుడిగా శాస్త్రీయ దృక్ఫథంతో అంబేద్కర్ ఇజాన్ని వెలుగెత్తి చాటుతూ ఏమిస్తే తీరుణయ్య నీ రుణం అంటూ అంబేద్కర్ ప్రతిష్టతను ఆకాశానికి ఎత్తి నిచ్చెనమెట్ల ఆటవికపు అశృష్యతపై అగ్గి రవ్వను రాజేశాడు.
పట్టాల చదువున్న ఉద్యోగం లేదాయే/ నిరాశతో నిరుద్యోగినై తిరుగుడాయే/ కన్నోరికే కొడుకు బరువాయే/ నిస్సాహాయుడనైన నా గొంతులో పాటే రాదాయే. /ఏ పాట పాడను, ఏమని పాడను /బ్రతుకే కన్నీరురో ఓరయ్యో / అంటూ నిరుద్యోగులు అనుభవించే వెదను సాయి చందు గొంతులో ఆలపిస్తూ అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి నిరుద్యోగి ఆవేదనను ఆవిష్కృతం చేసింది. అస్తిత్వం కోల్పోయి అతాలా కుతలం అవుతున్న తెలంగాణ స్వరాష్ర్ట పోరులో తనదైన శైలిలో పాటకు పదును పెట్టాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు, మేదావులు, విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, యువకులు సబ్బండ వర్గాల ప్రజలు మమేకమైన మహోన్నత పవిత్ర యుద్ధం. ఆ ఉద్యమానికి ఒకవైపు నుంచి మేదావుల ఆలోచన తోడైతే మరో వైపు నుంచి విద్యార్థుల ఉదృత పోరాటాలు, త్యాగాలు తోడయ్యాయి. ఈ ఆలోచనలను, త్యాగాలను ప్రజల గుండె కన్నీటి కడలిలో కదిలించి కదనానికి కయ్యం ఆడించింది సాయిచందు పాట.
వందల ఉద్యమ వేధికలపై తెలంగాణ గోసను తన గొంతులో ప్రతిద్వనించాడు. తెలంగాణ తల్లి ఋణం తీర్చుకోవడానికి వీరుడు తల్లి ఒడిలో ఒరిగి పోతున్నారంటూ వీరుల్లారా వీరవనితల్లారా /అమ్మ ఋణముకై రణముల ఓరిగినారా / తెలంగాణలో కంటి చెమ్మల్లారా/ నునువెచ్చని నెత్తురు చిమ్మినారా/ అని సాగిన పాట విద్యార్థుల త్యాగాలతో ఎరుపెక్కి / ఒక్కరా, ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు/ జైలు గోడలతో చెలిమి చేసినోళ్ళు/ తూటాలతో హోళి ఆడినోళ్ళు/ రణ భూమికి రంగులద్దినొళ్లు /తరగతి గదులల్లో పెరిగినోళ్ళు/ పోరులో ఒరవడి మార్చినోళ్లు అంటూ /విద్యార్థులను ఉవ్వెతున ఉసిగొల్పినాడు. రాతి విగ్రహాల్లో దాక్కొని ఉన్న శివుడా నీకు మనస్సు లేదా అంటూ తూటా లాంటి పదాలతో తెలుగు భాషలో ఉన్న వ్యాజనిందాలంకారం చేత శివుడిని ప్రశ్నించే పాటయ్యాడు సాయిచందు. ఎందరో తల్లిదండ్రుల గుండె గోసను కంఠశోసను మనసుతో గానం చేసిండు. తెలంగాణ ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు తమ బాధను పాటలో పాడుతుంటే తమ బిడ్డను సాయిచందు పాటల్లో చూసుకున్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక కూడా తన పాటకు ఏ రోజు విరామం ఎరుగలే. సాయిచంద్ బాల్య భావాలే నేటి గులాబి దండులో గుబాలింపు చేసింది. ఎన్నో వేధికల మీద తెలంగాణ విజయాలను, ఉద్యమ గుర్తులను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పాడిండు. చివరి శ్వాసదాక పాటే ప్రాణంగా సాగిండు. పాటంటే సాయిచందు, సాయిచందు అంటే పాట అనే రీతిగా ఎదిగిండు. ఎక్కడికి వెళ్లితే అక్కడ ఏ సందర్భం ఉంటే ఆ సందర్భానుసారము పాట తన గాత్రం నుండి జాలువారింది. ఏడు సంద్రాలు దాటిన సాయిచందు పాటల పాలపుంత అయ్యిండు. అమ్మపాటై, అరుణోదయ పాటై, జార్జిరెడ్డి పాటై, అంబేద్కర్ పాటై, అలసిన ఆకలి జీవుల పాటై, ఆడ బిడ్డల పాటై, నిలువెత్తు కరిగిన ముసలొల్ల చేతికర్ర పాటై, ప్రేమోన్మాద వేటకొడవలి పాటై పల్లె అంతా మదిలకొచ్చే అంటూ కన్న ఊరి మమకారాన్ని పాడిన పల్లెపాటై ప్రవహించే నది లా, పాటల వరదై సాగుతున్న సాయిచందు గుండె బరువెక్కిందే మో, ఆ గుండెకు 2010 సం॥రంలోనే ఆపదొచ్చింది.
అయినా ఆగ ని ఆ పాట నిన్నటి దాకా ప్రతి వేధిక మీద చెరగని ముద్ర వేస్తూ మ బ్బులు చీల్చుకువచ్చే సూర్యునివలే ప్రతి మదిలో ప్రకాశించింది. కా ని ఊహించని జల ప్రళయం ఒక్కసారిగా తీరాన్ని ముంచినట్లు కా లం వెయ్యి పడగల పామై బుసలు కొట్టినట్లు ఆ గుండెకు మళ్లీ ఆప ద వచ్చి సాయిచందు ఊపిరిని ఆపింది. జనంపాట శోకసంద్రము లో మునిగింది. మరణం మనిషికి సహజం. కాని ఆ మరణం పాట కు లేదు. నీ పాట ప్రతి గడపలో గర్జిస్తుంది. నీ పాటకు ఈ తెలుగు ప్రపంచం ఉన్నంత వరకు మరణం లేదు. జోహార్ సాయిచంద్.