అమ్రబాద్‌లో అటవీశాఖ వినూత్న కార్యక్రమాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో అడవుల సంరక్షణతో పాటు.. అక్కడ నివసించే చెంచులకు అండగా నిలిచేందుకు అటవీశాఖ అధికారులు కార్యచరణ చేపట్టారు. ప్రధానంగా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లోని చెంచుల బాగోగులకు అటవీ శాఖ అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల నోటిఫికేషన్‌కు నిరుద్యోగ చెంచు యువతను సన్నద్ధం చేసేలా మన్ననూర్‌లో శిక్షణ కేంద్రాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా వివిధ సందర్భాలను పురస్కరించుకొని అక్కడి స్థానికులకు చేరువ అయ్యేలా కార్యక్రమాలు చేపడుతున్నారు.
యువతకు శిక్షణ తరగతులు..
అమ్రబాద్ టైగర్ రిజర్వ్‌లోని క్షేత్రస్థాయి అటవీ అధికారులు చెంచు తెగకు చెందిన యువతకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు వారిని సిద్ధం చేస్తున్నారు. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ రోహిత్ గోపిడి నేతృత్వంలో అమ్రబాద్ టైగర్ రిజర్వ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆరు మంది క్షేత్రస్థాయి అటవీ అధికారులు మన్ననూర్‌లోని ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో శిక్షణను ఇస్తున్నారు. అధికారుల చొరవతో చెంచు పెంటలకు చెందిన యువత శిక్షణకు హాజరవుతున్నారు. రెండు నెలల పాటు నిర్వహించే ఈ శిక్షణకు దాదాపు 311 మంది హాజరవుతున్నారు. తరతరాలుగా అటవీశాఖకు అనుబంధం ఉన్నందున చెంచు అభ్యర్థులు అటవీ శాఖలో పనిచేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు.
చెంచులకు వైద్యసేవలు..
అమ్రబాద్ టైగర్ రిజర్వ్‌లోని స్థానిక చెంచులకు వైద్యసేవలను అందించేందుకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించారు. ఇటీవల మాతృ దినోత్సవం పురస్కరించుకొని అపోలో సౌజన్యంతో గర్భిణులు, బాలింతలకు వైద్యపరీక్షలు నిర్వహించి, మందులను అందజేశారు. అటవీ ప్రాంతాల్లో జీవనం సాగించే చెంచులకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు క్షేత్రస్థాయి అధికారులు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
జీవ వైవిధ్యంపై అవగాహన ..
అటవీ ప్రాంతాల్లో జీవ వైవిధ్యంపై స్థానిక విద్యార్థులకు అవగాహన పెంచేందుకు అమ్రబాద్ టైగర్ రిజర్వ్ అధికారులు పలు కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగా మన్ననూర్ పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా చిత్రలేఖనం, వక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వారిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
వ్యర్థాల సేకరణపై దృష్టి…
అమ్రబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల మీదుగా శ్రీశైలం.. హైదరాబాద్ రహదారి ఉండడంతో అటవీ ప్రాంతాల్లో భారీగా వ్యర్థాలు పోగు అవుతున్నాయి. వీటి కారణంగా వన్యప్రాణులకు ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మన్ననూర్ కేంద్రంగా అటవీశాఖ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసి.. అటవీ ప్రాంతాల్లో సేకరించిన వ్యర్థాలను తరలిస్తున్నారు. దీంతో స్థానిక చెంచులకు ఉపాధి కల్పించడంతో పాటు అటవీ సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
వన్యప్రాణులకు వీలుగా వంతెనలు..
పెరిగిన జనాభా రవాణా అవసరాలకు అనుగుణంగా టైగర్ రిజర్వ్, అటవీ ప్రాంతాల మీదుగా ఏర్పాటు చేయనున్న రహదారుల్లో.. వంతెనల ఏర్పాటుకు అటవీశాఖ ప్రతిపాదించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ తరహా వంతెనల నిర్మాణానికి ప్రాధాన్యత పెరిగింది. అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే జంతువులకు ఎలాంటి అడ్డుంకులు రాకుండా.. పగలు, రాత్రి తేడా లేకుండా సంచరించే వీలుగా ఈ వంతెనల రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఈ తరహా వంతెనల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.