Monday, January 20, 2025

అటవీ పునరుజ్జీవన చర్యలు బాగు

- Advertisement -
- Advertisement -

అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్

మనతెలంగాణ/ హైదరాబాద్ : భద్రాది కొత్తగూడెం సర్కిల్ పరిధిలోని రిజర్వు ఫారెస్ట్‌లో చేపట్టిన పునరుజ్జీవన చర్యలు బాగున్నాయని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్. ఎం. డోబ్రియాల్ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం కొత్తగూడెం సర్కిల్‌లో ఆయన పర్యటించారు. క్షేత్రస్థాయిలో అమలు అవుతున్న అటవీకరణ, సంరక్షణ పనులను పర్యవేక్షించేందుకు వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఇటీవల కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆయన తాజాగా అడవుల రక్షణ, పునరుద్దరణ, హరితహారం సన్నాహకాలు, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు, గుత్తికోయల ఆవాసాలను పరిశీలించారు. కొత్తగూడెం, రామవరం రేంజ్ పరిధిలో వేలాది హెక్టార్లలో అటవీ పునరుద్దరణలో పెంచిన చెట్లను పరిశీలించారు.

చాతకొండ, రామవరం, పెనగడప రిజర్వు ఫారెస్ట్ లో చేపట్టిన పునరుజ్జీవన చర్యలు బాగున్నాయని, సిబ్బంది చక్కగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా పిసిసిఎఫ్ డోబ్రియల్ ప్రశంసించారు. వేసవిలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, ఫైర్‌లైన్స్ ఏర్పాటు, రాపిడ్ యాక్షన్ టీమ్‌ల పనితీరుపై ఆరా తీశారు. జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి వసతి కేంద్రాలకు స్వయంగా వెళ్లి పరిశీలించారు. రామవరం రేంజ్ లోని జగ్గంపేట సమీపంలో గుత్తికోయల ఆవాసానికి వెళ్లి వారితో ఆయన మాట్లాడారు.

అడవుల రక్షణకు ప్రభుత్వంతో సహకరించాలని, అడవులను నరికివేత ఎట్టి పరిస్థితుల్లోనే చేయవద్దని అన్నారు. మణుగూరు డివిజన్ సందిళ్లపాడు నర్సరీని పరిశీలించి, హరితహారం సందర్భంగా మున్సిపాలిటీలకు సరఫరా చేసేందుకు వీలైనంత పెద్ద మొక్కలను సిద్దం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది నిబద్దతతో పనిచేయాలని, ఏవైనా సమస్యలు, సవాళ్లు ఎదురైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ పర్యటనలో కొత్తగూడెం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ భీమానాయక్, డిఎఫ్‌ఓ ప్రవీణ, డివిజనల్ అధికారులు నీరజ్, అప్పయ్య, దామోదర్‌రెడ్డి, తిరుమలరావు, బాబు, రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News