హైదరాబాద్: బహ్రెయిన్‌లో ఎన్నారై బిఆర్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బిఆర్‌ఎస్ సెల్ ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముందుగా అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేకును కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బిఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టిలు మాట్లాడుతూ బహ్రెయిన్‌లో రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం సిఎం కెసిఆర్ అహర్నిశలు పోరాడారని వారు గుర్తు చేశారు. స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేళ్లలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, ఇదంతా సిఎం కెసిఆర్ వల్లే సాధ్యమైందన్నారు. నాడు పరాయి పాలనలో బీడు భూములు, ఎండిన చెరువులు, తాగు నీటి కష్టాలు, కరెంట్ షాక్‌లతో రైతులు చనిపోయారన్నారు. నేడు 24 గంటల కరెంట్‌తో రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారన్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని, అనేక అవార్డులు సొంతం చేసుకుంటున్నాయన్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్ స్థాయిలో ముందున్నామని వారు తెలిపారు.