వెలుగు దుస్తులేసుకొని సూరీడు… తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికెంత భయమేసిందో… పక్కదులుపుకొని ఒకే పరుగు తీసింది
కవి మల్లెమాల రాసిన సినీ గీతంలోని వాక్యాలవి.
ఈ రోజు జూన్ 2న, తెలంగాణకు కూడా సూర్యోదయం సునామీలా వచ్చింది. చీకట్లు పటాపంచలు అయినయి. పల్లెలు, పట్టణాలు చిరునవ్వులు చిందిస్తున్నయి. 1969 నుంచీ ఈ స్వప్న సాకారం కోసం ఆరాటపడ్డ, పోరాటం చేసిన, ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన తెలంగాణ బిడ్డలకు; వారి స్వరాష్ట్ర ఆకాంక్షకు అనితరసాధ్యమైన రాజకీయ నాయకత్వం ఇచ్చి, రాష్ట్రం సాధించిన మాన్య ముఖ్యమంత్రి కెసిఆర్ కూ; ఇపుడు స్వరాష్ట్రపు ప్రగతిలో హక్కూ -బాధ్యతా కలిగిన స్టేక్ హోల్డర్స్ అయిన మనందరికీ… రాష్ట్రావతరణ శుభాభినందనలు!
తెలంగాణ రాష్ట్రం రాదని, మన జీవిత కాలంలో సాధ్యం కాదని, అది గెలిచే యుద్ధం కాదనీ, 1969 అనుభవం తర్వాత ఇక ఆశ వదులుకోవాల్సిందేనన్ననోళ్ళు ఎన్నో. రాష్ట్రం వస్తే చీకట్లలో మగ్గిపోతరని, హైదరాబాద్ నుంచి పెట్టుబడులు తరలిపోతే తెలంగాణ కుప్పకూలిపోతదని అన్నరు. అనడం కాదు, ఆశించిన్రు. కానీ వారి ఆశలన్నీ ఆవిరి అయినయి. బూడిద నుంచి ఉవ్వెత్తున ఎగిసిన ఫీనిక్స్ పక్షిలా తెలంగాణ సగర్వంగా లేచి నిలబడ్డది. యేయే రంగాలలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తున్నదో, దేశానికే తలమానికంగా నిలబడి ఉన్నదో లెక్కకు మిక్కిలి ఉదాహరణలు; గణాంక సహిత తార్కాణాలు; రాజ్యాంగబద్ధ సంస్థల, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల ప్రశంసలు; దేశంలోని కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల ప్రజాప్రతినిధుల మెచ్చుకోళ్ళు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నయి. వాటి సూక్ష్మ వివరాలలోకి ఇపుడు పోబోవడం లేదు.
Telangana needs to bere- invented. Telangana needs to be re-oriented- అన్నరు సిఎం కెసిఆర్ 2018 ‘ఇండియా టుడే’ సదస్సులో. ఆ తర్వాతి నాలుగేండ్లలో అది చేసి చూపించిన్రు. ఇపుడు India needs to be re-invented. India needs to be re-oriented అంటున్నరు. అదీ సుసాధ్యం చేస్తరుఅని చెప్పడానికి జ్యోతిష్యంలో అభినివేశం అక్కర్లేదు, ఎనిమిదేండ్లుగా నిరంతరమూ ఆయన ఆలోచనలు, వాటి ఆచరణ, ఫలితాలు మన కండ్ల ముందు ఉన్నవే.
ఈ వ్యాస రచయితతో జరిగిన ఒకట్రెండు సమావేశాల్లో సిఎం కెసిఆర్ స్పష్టం చేసిన విషయాలు -తెలంగాణను ఇక దేశంలోని యే రాష్ట్రమూ దాటిపోలేదని; రెండు: భారతదేశం బలీయమైన శక్తిగా ఆవిర్భవించే సమయం మరెంతో దూరం లేదని.
మావో చెప్పిన ‘వేయి ఆలోచనల సంఘర్షణ నూరు పూల వికాసం’ చైనాతోనే ఆగలేదు. ఇపుడు తెలంగాణలో జరుగుతున్నది, రేపు దేశంలోనూ జరగనున్నది. చైనాను మనం దాటిపోగలము. సందేహమే అవసరం లేదు అని కెసిఆర్ గురించి లోతుగా తెలిసిన వారికి ఆర్థం అవుతుంది. ఆయనకు రాజకీయాలు ఒక టాస్క్. ఆయనకాయనే ఒక టాస్క్ ఫోర్స్.
ఒకటే మతం, ఒకటే కులం అంటూ కొందరు ఉన్మాదులు రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్న ప్రస్తుత సందర్భంలో అసలు పాలిటిక్స్ ను దాని స్వచ్చార్థంలో చూడాలి మనం. Poli అంటే మిక్కిలి అని. విస్తృతార్థంలో బహుముఖీనమైనదని. మనం స్కూళ్ళల్లో చదువుకున్న ప్రతిజ్ఞలో ఉండేది కదా -సుసంపన్నమైన, బహు విధమైన దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని. అదిగో, అదీ పాలిటిక్స్ అంటే. బహుళత, భిన్నతలో ఏకత!
కెసిఆర్ రూట్ కూడా అంతే. అది బహుళం. ఆయన రూట్ అంటే తెలంగాణ రూట్ మ్యాప్. ప్రగతి భవన్‌లో ఉన్నా, ఫామ్ హౌస్‌లో ఉన్నా ఎన్నెన్నో విభిన్నమైన అంశాలపై ఏకకాలంలో ఆయన ఫోకస్ ఉంటది. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే గొప్పగా నిలపాలని ఒకవైపు ప్రణాళికలు వేస్తూనే, పల్లెల్లో వైకుంఠ ధామాల గురించి చింత చేయగలరు. దేశంలోనే ఎక్కడా లేనట్టి 450 సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తూనే, ప్రైవేట్ రంగంలో దళితులకు రిజర్వేషన్ల గురించి నిర్ణయం తీసుకోగలరు. లక్షన్నర కిలోమీటర్ల మేర పైపులైన్లలో భగీరథ నీటిని పారిస్తూనే, హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లో పిల్లలు ఆడుకునే చైనా బొమ్మలు ఎందుకు ఉండాలి, మనమే ఆ ఉత్పత్తి చేయవచ్చు, ఉద్యోగాలు ఇవ్వవచ్చు కదా అనిమంత్రి కెటి రామారావుకు డైరెక్షన్ ఇవ్వగలరు.
బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్; గర్భిణీలకు పౌష్టికాహారం, ప్రసవానికి కిట్ ద్వారా సహాయం, నవజాత శిశువు పేర ఆర్ధిక సహాయం ఒక బాధ్యత కలిగిన తండ్రిలా ఆడపిల్లను ప్రతి దశలో ఆదుకునే యజ్ఞం నిర్వహిస్తూనే; State of the art విద్యాలయాలు, వైద్యాలయాలు, దేవాలయాల స్థాపన గురించి నిర్ణయం తీసుకోగలరు. గొర్రెలు, మత్స్య సంపద పెంచి అందరూ బలవర్ధకమైన తిండి తినాలని ఒక గొప్ప అతిథేయియై మన కంచం నిండుగా వడ్డిస్తూ మాట్లాడుతూనే, సమాజపు ఔన్నత్యం గురించి వైతాళికులను మించి మాట్లాడగలరు.
రైతుబంధు రూపంలో సహాయం ఇస్తున్నరు సరే, మరలా రైతులు మీకు వాటిని ఎన్ని విడతలలో చెల్లించాలి అని రాజ్‌నాథ్ సింగ్ అడిగిన్రు నన్ను -అంటూవారి దార్శనికత లేమిని, హ్రస్వ దృష్టిని చిరుదరహాస రూపంలో బట్టబయలు చేస్తూనే, తెలంగాణ యువతను నిర్వీర్యం చేసే డ్రగ్స్‌పై ఉగ్ర నరసింహుడు అవగలరు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి జాతీయ మీడియాతో ధారాళంగా చెపుతూనే, ‘వ్యాక్సిన్ కేపిటల్ ఆఫ్ ది వరల్డ్’ గా హైదరాబాద్ ను ఎట్ల నిలుపుతున్న మోకండ్ల నిండా వెలుగుతో ఎలుగెత్తి చాటగలరు. రాబోయే రెండేళ్లలో మూడు లక్షల కోట్ల ఐటి ఎగుమతులు సాధిస్తాం అంటూనే, హరితహారం రూపంలో బ్రెజిల్, చైనా తర్వాత మనమే భూమికి పచ్చరంగు వేస్తున్నం అని సగర్వంగా తలెత్తుకు నిలబడగలరు.
తలసరి ఆదాయం, తలసరి ఉత్పత్తి గురించి ఆర్థికవేత్తలను తీసికట్టు చేస్తూ అంకెల రూపంలో వెనుకబాటు సంకెలలను తెంచుతూనే, రాజీవ్ గాంధీ చెప్పిన ‘పది పైసలు ప్రజలకు, తొంభై పైసలు అది వారికి చేరే ఖర్చుకు’ లెక్కను తలకిందులు చేయగలరు. పది పైసల ఖర్చుతో తొంభై పైసలు తన ప్రజలకు ఇచ్చి చూపించగలరు.
ట్యాబ్‌లో వార్తలు, విశ్లేషణలు సీరియస్‌గా చదువుతూనే, ‘వడగండ్ల వాన వల్ల కాయలు రాలుతయి, ధాన్యం తడుస్తది’ అంటూవిషణ్ణ వదనుడు కాగలరు. వెంటనే సిఎస్‌కు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించండి అని ఆదేశించగలరు. విశ్రాంతి ఎరుగని పని మంతుడాయన! ఈ వ్యాస రచయిత కూడా ఇంగ్లండ్ సహా మన దేశంలోని ఎందరో నాయకులను గమనించి ఉన్నడు. కొందరు వ్యవస్థలను ఉపయోగించుకుని వ్యక్తులుగా ఎదుగుతరు. వారు తప్ప వ్యవస్థలు గుర్తుకు రానంతగా పాతుకుపోతరు. అతి అరుదుగా మరి కొందరు తమ వ్యక్తిత్వాన్ని వ్యవస్థీకృతం చేస్తరు. వారి పేరు తలచుకోగానే సమాజం సాక్షాత్కరిస్తది. వారి కార్యరంగం తటిల్లతలా మెరుస్తది. ప్రొఫెసర్ జయశంకర్ అట్లాంటి ఒక సిద్ధాంత కర్త అయితే, కెసిఆర్ ఒక అరుదైన రాజకీయ విప్లవకారుడు. ఇపుడు పైన పేరా మరొకసారి చదవండి. ఇప్పటి దాకా చెప్పుకున్న విషయాలు కెసిఆర్ అనే ఒక వ్యవస్థ గురించి అని అర్థమైతది. ఆ వ్యవస్థలో స్టేక్ హోల్డర్ అయినందుకు ఉప్పొంగుతము. టిఆర్‌ఎస్ పార్టీ కాని వారు, కెసిఆర్ అంటే వ్యక్తిగత వ్యతిరేకత ఉన్న వారు కూడా నర్మంగా, మర్మంగా మనసులోనే ఆయనకు ప్రణమిల్లగలరు!
నాడు ఉద్యమాన్ని మేము భావోద్వేగాలతో మొదలు పెట్టలేదు. ఒక వెలుగు వెలిగి ఆరిపోయిన గత కాలపు అనుభవాల నుంచి నేర్చుకున్నం. పూర్తి అవగాహనతో ఉద్యమాన్ని నడిపినం. ఆ మొత్తం ప్రస్థానం దేశంలోని రాబోయే యే విప్లవాత్మక కార్యాచరణకైనా ఒక పాఠ్యాంశం అవుతుంది అన్నరు కెసిఆర్. అడుగడుగునా ప్రతీప శక్తులు అడ్డుపడుతూ ఉంటయి. వాటి అంతు చూడాలి. పౌండ్రక వాసుదేవుడిని నిర్మూలిస్తే తప్ప శ్రీకృష్ణుడి మార్గం సుగమం కాలేదు. అట్లనే తెలంగాణకు అడ్డుపడుతున్న ఎంతోమంది పౌండ్రకులను మనం రాజకీయంగా నిర్మూలిస్తే తప్పలక్ష్యం చేరలేము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్వప్నించిన Social efficiencyని (సామాజిక సామర్థ్యం) అన్ని కులాల, మతాల భాగస్వామ్యంతో సాధించి, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించిన మనం… ఇపుడు దేశ నిర్మాణం చేద్దాం. ఆనందాల తేలే ఈ వేళ… సంబరాలు చేసుకుంటూనే, తెలంగాణ బిడ్డగా గర్విస్తూనే, దేశమాత పిలుపును అందుకుందాం, ముందుకు సాగుదాం.
జై తెలంగాణ. జై భారత్.
శ్రీశైల్ రెడ్డి పంజుగుల
9030997371