Monday, December 23, 2024

ఎనిమిదేళ్ల సంబురం

- Advertisement -
- Advertisement -

Special article about quad summit in tokyo తెలంగాణ రాష్ట్రం అవతరణ చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టం. ప్రజలు వీరోచితంగా పోరాడి సాధించుకున్న రాష్ట్రానికి ఎనిమిదేళ్లు పూర్తి అవుతున్న ఈ రోజు కూడా చరిత్రాత్మకమైనది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు లక్షాల ప్రాతిపదికగా సాగిన మహోద్యమానికి సారథ్యం వహించిన టిఆర్‌ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీయే ప్రజల విశేష ఆదరాభిమానాలతో అధికార పగ్గాలు చేపట్టి రాష్ట్రాన్ని ఎనిమిదేళ్లుగా పాలిస్తున్నది. టిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధి కూడా చరిత్రలో చాలా అరుదుగా నమోదయ్యే సుపరిపాలనల జాబితాలో చేరుతుంది. తలాపున గోదావరి పారుతున్నా భూములు ఎండి నెరియలైన దుస్థితిలో, పెట్టిన పెట్టుబడి కూడా దక్కని రైతుల ఆత్మహత్యలతో దశాబ్దాలుగా కన్నీరు మున్నీరైన రాష్ట్రాన్ని వలసాంధ్ర పాలకుల గుప్పెట్లోంచి విముక్తం చేసి జలకళ తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని బాగు చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దక్కుతుంది.

గోదావరి నది పరీవాహక ప్రాంతంలో 79 శాతం, కృష్ణలో 69 శాతం తెలంగాణలోనే వున్నప్పటికీ ఈ ప్రాంతం చిరకాలం కరువు, కాటకాల నట్టిల్లయింది. అటువంటి ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం అయిన అనతికాలంలో దేశంలోనే గరిష్ఠ వరి సాగు రాష్ట్రంగా మారింది. ఏ ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలైనా పరిపాలన ప్రాథమ్యాలను ఎంచుకోడంపైనే ఆధారపడి వుంటుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు విజ్ఞతాయుతంగా వేసిన అడుగులను మెచ్చుకోక తప్పదు. అభివృద్ధి సంక్షేమాలకు సమాన ప్రాధాన్యమిస్తూ సాగిన ఎనిమిదేళ్ల పాలనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం వినూత్నమైన పంథా తొక్కింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అంధకారమయమవుతుందని చేసిన హెచ్చరికలను, పెట్టిన శాపనార్థాలను పటాపంచలు చేస్తూ గృహావసరాలకు, వ్యవసాయానికి నిరంతర, నాణ్యమైన విద్యుత్తును అందజేయడం ఆషామాషీ విషయం కాదు. అదే సమయంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అనే కొత్త వ్యూహాలతో పల్లెలను జల పుష్కలంగా చేయగలిగారు.

ఈ పథకాలను చూడడానికి ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కూడా తెలంగాణకు వచ్చారు. గోదావరి నది గతిని మార్చి దాని నీటిని ఎగువ ప్రాంతాలకు మళ్లించడానికి చేపట్టి అతి త్వరగా నిర్మాణం పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అపురూపమైనదిగా కలకాలం నిలిచిపోతుంది. ఇంకొక వైపు హైదరాబాద్‌ను ఐటి రాజధానిగా తీర్చి దిద్దుతున్న తీరు అమోఘమైనది. పింఛన్ల మొత్తం పెంచారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు ఆదర్శప్రాయంగా అమలవుతున్నాయి. జిల్లాల సంఖ్యను 10 నుంచి 33 కి పెంచి పరిపాలన వికేంద్రీకరణ చేసి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్లారు. వ్యవసాయదారు పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలు కాకుండా చేయడానికి ప్రవేశపెట్టిన రైతు బంధు వల్ల సాగు రంగానికి పూర్తి స్వస్థత చేకూరింది. రైతు ఆత్మహత్యలు బాగా తగ్గుముఖం పట్టాయి.రైతు బంధు దేశంలో మరెక్కడా లేని విప్లవాత్మక పథకంగా గుర్తింపు పొందింది. అలాగే రైతు బీమా కూడా ఆ కుటుంబాలకు అభయ ప్రదాత అయింది.

తరాలుగా న్యూనతను, దారిద్య్రాన్ని అనుభవిస్తున్న, సామాజికంగా అట్టడుగున వుండి అణగారిపోయిన దళిత కుటుంబాలకు రూ. పదేసి లక్షలతో స్వయం ఉపాధి పథకాలను నెలకొల్పుకునే అవకాశం కల్పించిన దళిత బంధు తెలంగాణ ప్రభుత్వ కీర్తి కిరీటంలో అమరిన విశేషమైన తురాయి వంటిది. విద్య, వైద్యరంగాల అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానాలను ఉత్తమ ప్రమాణాలతో తీర్చి దిద్దడానికి జరుగుతున్న కృషి కళ్లముందున్నదే. ఒక వైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకుపోయే కృషి సాగిస్తూనే కేంద్ర పాలకుల నిరంకుశత్వ, ఫెడరల్ వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టారు. దేశంలో పుష్కలంగా వనరులున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకునే విజ్ఞత లోపించిన కేంద్ర పాలకులు ప్రజలను చీల్చి పాలించే కుటిల పూరిత విధానాలను అవలంబిస్తున్నారని భావించిన కెసిఆర్ వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టని రోజంటూ ఇటీవల లేదు. సమూలమైన మార్పు తీసుకురావాలనే దీక్షతో ఆ దిశగా ఎన్నో సవాళ్లనెదుర్కొని ఆయన ముందడుగు వేస్తున్నారు. దాని పర్యవసానంగా రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయంగా రావాల్సిన నిధులను నిలిపివేసి అప్పు సైతం ఎక్కడా పుట్టకుండా కేంద్ర పాలకులు కక్షతో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లు నిండిన సందర్భంగా రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి దేశానికి దిక్సూచి కావడానికి తగిన బలం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లభించాలని కోరుకుందాం. ఎంతో పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకొన్న తెలంగాణ ప్రజలకు ‘మన తెలంగాణ’ వినమ్ర విజయాభివందనాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News