Sunday, November 24, 2024

నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ

- Advertisement -
- Advertisement -

నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా ఆవిర్భవించిందని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. నుంచి తెలంగాణ దోపిడీకి గురైం దని, ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా శుక్రవారం డా. బి.ఆర్.అంబద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో సిఎం కెసిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీ కరించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఆవిర్భావానికి ముం దు జరిగిన పరిణామాలు గుర్తుచేశారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పడిన త ర్వాత చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.

ఈ దశాబ్ద కా లం ముంగిట నిలిచిన తెలంగాణ రాష్ట్రం చేరాల్సిన గమ్యాలు, అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. తన శరీరంలో సత్తువ ఉన్నం తవరకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటాననితెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 21రోజుల వేడుకగా జరుగుతాయని, గ్రామ స్థాయి నుంచి రాజధాని నగరం వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతు న్న ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. 1969 లో తెలం గాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి రక్తసిక్తమైందని ముఖ్యమంత్రి కెసి ఆర్ పేర్కొన్నారు. ఉద్యమాన్ని అప్పటి ఆంధ్రా పాలకులు కుట్రలతో అణిచివేశా రని అన్నారు. 2001 వరకు ఇంకెక్కడి తెలంగాణ అనే నిర్వేదం జనంలో అల ముకుందని చెప్పారు. ఆ నిర్వేదం, నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ ఉద్య మం మళ్లీ ఎగిసిపడిందని, ఆ ఉద్యమానికినాయకత్వం వహించే చారిత్రక పాత్ర తనకు లభించడంతో తన జీవితం ధన్యమైందని సిఎం కెసిఆర్ అన్నారు. శాంతియుత పంథాలో వివేకమే పునాదిగా వ్యూహత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి క్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయని తెలిపారు.

ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కవు లు, కళాకారులు, కార్మికులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు విభేదాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై ముందుకు కదిలారని, వారందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించి త్యాగధనులైన అమరులకు నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. మన రైతుబంధు పథకం.. కేంద్ర పాలకుల కళ్లు తెరిపించిందని అన్నారు. శుద్ధి చేసిన తాగునీరు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తాగునీటి అంశంలో రాష్ట్రానిది దేశంలోనే ప్రథమస్థానమని చెప్పా రు. మిషన్ భగీరథకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని తెలిపారు.
ఎవరూ కలలోనూ ఊహించని పథకాలు
తెలంగాణ సమాజం ఆరు దశాబ్దాల పాటు అలుపెరుగని పో రాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుందని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రజల ఆశయం జయించి, 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన నాటి దృశ్యం గుర్తుచేసుకుంటే.. ఏ రంగంలో చూసినా విధ్వంసమే అని, అంతటా అలుముకున్నది గాఢాంధకారమే పేర్కొన్నారు. అస్పష్టతలను, అవరోధాలను అధిగమిస్తూ తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదగడం ఒక చారిత్రాత్మక విజయమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏయే రంగాలలో ధ్వంసం చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్లీ చక్కదిద్ది సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ప్రభుత్వం నిజాయితీగా చేపట్టిందని చెప్పారు. సమైక్య పాలకులు అనుసరించిన వివక్షా పూరిత విధానాలను మార్చేయడానికి పూనుకున్నదని తెలిపారు. ‘తెలంగాణను పునరన్వేషించుకోవాలి,తెలంగాణను పునర్నిర్మించుకోవాలి’ అనే నినాదంతో ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు.

తెలంగాణ దృక్పథంతో నూతన విధానాలను రూపకల్పన చేసుకున్నదని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ ప్రభుత్వం అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా, వాచా, కర్మణా అంకితమైందని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. ప్రతి రంగంలోనూ యావద్దేశం నివ్వెరపోయేలా ఫలితాలను సా ధిస్తూ ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ.. నేడు పదో వసంతంలోకి అడుగుపెట్టడం ఓ మైలురాయి అని వ్యాఖ్యానించారు. కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా పథకాలను తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోందని తెలిపారు. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించిందని పేర్కొన్నా రు. సంపద పెంచుదాం.. ప్రజలకు పంచుదాం అనేదే తమ నినాదమని సిఎం స్పష్టం చేశారు.
ప్రజల ఆకాంక్షలపై సంపూర్ణ అవగాహన ఉంది
తెలంగాణ ఉద్యమంలో ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షల పట్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉందని సిఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనుభవం ప్రాతిపదికగా తెలంగాణ ప్రజల ఆర్తిని ప్రతిబింబించే విధంగా మేనిఫెస్టోను రూపొందించుకొని ప్రభు త్వం చిత్తశుద్ధితో అమలు చేసిందని స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే, మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు మన కళ్ళ ముందు కదలాడుతాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ వ్యవధిలో కరోనా మహమ్మారివల్ల దాదాపు మూడేళ్ళ కాలం వృధాగానే పో యిందని సిఎం కెసిఆర్ చెప్పారు. ఇక మిగిలిన ఆరేళ్ళ స్వల్ప కాలంలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించిందని అన్నారు.
ఎక్కడ చూసినా తెలంగాణ మోడల్…
దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మార్మోగుతున్నదని కెసిఆర్ వ్యాఖ్యానించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి న మూనా మన్ననలందుకుంటున్నదని చెప్పారు. అనేక సవా ళ్ళు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందంటే, అందుకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజా సహకారమే కారణమని పేర్కొన్నారు. అభివృద్ధిని సాధించడమేకాదు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా మన రాష్ట్రం నూతన ఒరవడిని దిద్దిందని చెప్పారు. మానవీయకోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఆచరణీయంగా నిలవడమే కాకుండా, ఆయా రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు మన పథకాలపట్ల ఆకర్షితులై, తమ రాష్ట్రాలలో కూడా వీటిని అమలు చేస్తామని ప్రకటించినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుందని అన్నారు.
బిసి కుల వృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్ధికసాయం
దశాబ్ది ఉత్సవాల కానుకగా బి.సి కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధికసాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లోనే గొర్రెల పంపిణీ
దశాబ్ది ఉత్సవాల్లోనే రెండో విడతలో గొర్రెల పంపిణీ ప్రారంభమవుతుందని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇందులో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. గొల్ల కుర్మలకు తొలి విడతలో రూ. 6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం
తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని సిఎం వెల్లడించారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తున్నదని చెప్పారు. జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నని తెలిపారు.
పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సేకరించి ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్హులకు ఇండ్ల స్థలాల పం పిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని కెసిఆర్ ప్రకటించారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఇం కా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను పేదల ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తుందన్నారు.
ఈ పదేళ్ల కాలం సాగునీటి రంగానికి స్వర్ణయుగం
తెలంగాణ వస్తే అంధకారమేనని గతంలో పాలకులు ఎద్దేవా చేశారని సిఎం అన్నారు. ఇప్పుడు విద్యుత్తు విషయంలో విప్లవాత్మక విజయాలు సాధించామని చెప్పారు. ఈ పదేళ్ల కాలం సాగునీటి రంగానికి స్వర్ణయుగమని వ్యాఖ్యానించారు. పాత ప్రాజెక్టులను ఆధునీకరించామని, సమైక్య రాష్ట్రంలో మూలనపడ్డ ప్రాజెక్టులు పూర్తిచేశామని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం దేశ చరిత్రలో అపూర్వ ఘట్టమని పేర్కొన్నారు. 20కి పైగా రిజర్వాయర్లతో రాష్ట్రం పూర్ణకుంభంలా మారిందని అన్నారు. కోటీ 25 లక్షలకు సాగునీరు స్వప్నం త్వరలోనే సాకారం కానుందని కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధాన్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటి స్థానానికి పోటీ పడుతోందని తెలిపారు. పల్లె ప్రగతి. పట్టణ ప్రగతి.. రాష్ట్ర రూపురేఖలనే మార్చేశాయని, కొత్త చట్టంతో స్థానిక సంస్థల్లో అద్భుత మార్పు వచ్చిందని చెప్పారు. ఇటీవల మన పల్లెలకు 13 జాతీయ అవార్డులు వచ్చాయని, మన పురపాలికలు అనేక జాతీయ అవార్డులు పొందాయని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో రాష్ట్రానికి 23 అవార్డులు వచ్చాయని, హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు.
రెండో విడతలో 1.30 లక్షల మందికి దళితబంధు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బోధనలే శిరోధార్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం.. దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే ఉద్దేశంతో ‘దళితబంధు’ అనే విప్లవాత్మక పథకాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల మొత్తాన్ని వంద శాతం గ్రాంట్‌గా అందిస్తోందన్నారు. దీన్ని లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ డబ్బుతో దళితులు తమకు నచ్చిన ఉపాధిని ఎంచుకుని ఆత్మగౌరవంతో జీవించేందుకు ప్రబుత్వం అండదండలు అందిస్తోందన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 50 వేల మంది లబ్ధిదారులకు రూ.5 వేల కోట్లు అందజేశాం. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించామని చెప్పారు. రెండో విడతలో 1.30 లక్షల మందికి దళితబందు అందించనున్నామని సిఎం వెల్లడించారు.
ఐటీలో మేటీగా తెలంగాణ
ఐటీ రంగంలో తెలంగాణ మేటిగా నిలిచిందని సిఎం కెసిఆర్ వివరించారు. ఇప్పటి వరకు రూ.2.64 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. స్వరాష్ట్రంలో ఐటి రంగంలో 220 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. ఈ క్రమంలోనే ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరింపజేశామని వివరించారు. ఖాయిలాపడిన పరిశ్రమల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇచ్చామని, స్టార్టప్‌లో టి -హబ్ దేశంలోనే రికార్డు సృష్టించిందని చెప్పారు.
స్వరాష్ట్రంలో అధ్యాత్మిక వైభవానికి కృషి
స్వరాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవానికి కృషి చేశామని సిఎం పేర్కొన్నారు. యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతమని కొనియాడుతున్నారని.. అదే మాదిరిగా కొండగట్టు, వేములవాడ, ధర్మపురిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. భద్రాద్రిని వైభవంగా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. కాశీ, శబరిమలలో రాష్ట్ర భక్తుల కోసం వసతి గృహం నిర్మిస్తామని అన్నారు. దశాబ్ది ముంగిట నిలిచిన రాష్ట్రానిది విప్లవాత్మక విజయ యాత్ర అని, రాష్ట్రాన్ని జనం గర్వించే స్థాయికి తెచ్చిన తన జీవితం ధన్యమైందని పేర్కొన్నారు.
జాతీయ అవార్డులే పట్టణ ప్రగతికి నిదర్శనం
తెలంగాణలోని పురపాలికలు భారీ సంఖ్యలో జాతీయ అవార్డులను పొందడం పట్టణ ప్రగతి విజయానికి నిదర్శనమని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలు అవార్డుల్ని గెల్చుకున్నాయని చెప్పారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన జీవనాన్ని, రాష్ట్రానికి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన గ్రామ సర్పంచ్‌లకు, ఎంపిటిసిలకు, జెడ్‌పిటిసిలకు, మండల అధ్యక్షులకు, జిల్లా పరిషత్ ఛైర్మన్లకు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లకు, కార్పోరేషన్ల మేయర్లకు, కార్పోరేటర్లకు, పంచాయతీరాజ్, మున్సిపల్ మున్సిపల్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
సామాజిక భద్రత కోసం ఆసరా పెన్షన్లు
మానవీయ దృక్పథం లేని ప్రగతి నిరర్థకమని తాను నమ్ముతానని సిఎం అన్నారు. పేదల కన్నీరు తుడవని, కడుపు నింపని పాలన, పాలన అనిపించుకోదని చెప్పారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధితో పాటు, ప్రజా సంక్షేమానికి కూడా సింహభాగం నిధులను ఖర్చు చేస్తున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్లకింద కేవలం 200 రూపాయలు మాత్రమే చెల్లించేవని, అవికూడా అర్హులందరికీ చేరేవి కావని అన్నారు. అందుకే, తెలంగాణ రాష్ట్రంలో పింఛను కింద ఇచ్చే మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచుకున్నామని తెలిపారు. దివ్యాంగులకు చెల్లించే పెన్షన్ను 3,016 రూపాయలకు హెచ్చించుకున్నామని, పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో పాటు, లబ్ధిదారుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకున్నామన్నారు. 2014లో లబ్ధిదారులు 29 లక్షలు ఉండగా, నేడు 44 లక్షలకు పైగా ఉన్నారని, పెన్షన్ పొందేందుకు వయోపరిమితిని 57 సంవత్సరాలకు తగ్గించడంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగిందని వెల్లడించారు.
పెళ్ళి భారం కాకూడదని కల్యాణ లక్ష్మి
పేదింటి ఆడపిల్లల పెళ్ళి తల్లిదండ్రులకు భారంగా మారకూడదని కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఒక లక్షా 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు 13 లక్షల 16 వేల మంది ఆడపిల్లల వివాహాలను ప్రభుత్వం జరిపించిందన్నారు. ఇందుకోసం 11 వేల కోట్లకు పైగా రూపాయలను ప్రభుత్వం వెచ్చించిందని తెలిపారు.
నేతన్నలకు సంక్షేమ కార్యక్రమాలు
ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యల పరంపర మనల్ని ఎంతగానో కలచివేసేదని సిఎం గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత నేతన్నల జీవితాలలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, సహాయ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. చేనేత కార్మికులకు నూలు, రంగులపై కేంద్ర ప్రభుత్వం కేవలం 10 శాతం సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకొంటే, తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నదని చెప్పారు. వీటితోపాటు, నేత కార్మికులకు పావలా వడ్డీకే రుణ సదుపాయం కల్పించడంతో పాటు, 2010 నుంచి 2017 వరకూ జాతీయ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల వద్ద ఒక్కొక్క చేనేత కార్మికుడు తీసుకున్న లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసుకున్నామన్నారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించి ఆదుకొనేందుకు 2017 సంవత్సరం నుంచి బతుకమ్మ చీరెల తయారీని వారికే అప్పగిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకూ రూ. 1,727 కోట్లు అందించినట్లు సిఎం వెల్లడించారు. చేపల పెంపకం కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసింది. ప్రమాదంలో మరణించే మత్స్యకారుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ ద్వారా రూ. 4 లక్షలు, ప్రభుత్వం మరో రూ.5 లక్షలు, మొత్తంగా 9 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తూ అండగా నిలుస్తున్నదని తెలిపారు. కల్లుగీత వృత్తి మీద ఆధారపడి జీవించే గౌడ సోదరుల కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే సమైక్య రాష్ట్రంలో మూసివేయించిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కల్లు దుకాణాలను తిరిగి తెరిపించిందని తెలిపారు. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చెట్ల పన్నును రద్దు చేసిందని,గతంలోని పన్ను బకాయిలను సైతం మాఫీ చేసిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైన్ షాపుల కేటాయింపులో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, మరణించిన లేదా అంగవైకల్యం చెందిన గీత కార్మికునికి పరిహారాన్ని 5 లక్షల రూపాయలకు పెంచి, చిత్తశుద్ధిని చాటుకున్నదని చెప్పారు. 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి ప్రభుత్వం 2,016 రూపాయల పింఛన్ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రైతుబీమా తరహాలోనే గౌడ సోదరులకు కూడా 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రభుత్వం అందించబోతున్నదని, ఇందుకు అవసరమైన బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
మైనారిటీల అభివృద్ధికి అనేక పథకాల అమలు
మైనారిటీల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. మైనారిటీ బాలుర కోసం 107, బాలికల కోసం 97 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పింది. మైనారిటీ బాలికల విద్యలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు. ఇమామ్‌లకు, మౌజన్లకు నెలకు రూ.5 వేల చొప్పున మొత్తం 10 వేల మందికి జీవన భృతిని అందజేస్తున్నదన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఓన్ యువర్ ఆటో, డ్రైవర్ ఎంపవర్ మెంట్ పథకం, ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వమే అధికారికంగా రంజాన్, క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ, నిరుపేద ముస్లిం, క్రైస్తవ మతాల పేదలకు కొత్త బట్టలు అందిస్తున్నదని పేర్కొన్నారు. బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం కొత్త చీరలు పంపిణీ చేస్తున్నదన్నారు.
జైనులకు మైనార్టీ హోదా
తెలంగాణ ప్రభుత్వం జైన మతస్తులకు మైనారిటీ హోదా కల్పించడంతో వారిలో సంతోషం నెలకొన్నదని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సర్వమత సమాదరణ విధానానికి ఇది తార్కాణమని వ్యాఖ్యానించారు. సమాజంలో అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోందని సిఎం వెల్లడించారు. దేవాలయాలను నమ్ముకొనిజీవనం సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా ఆదుకుంటున్నదన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయాలలో విధులు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా వేతనాలు అందిస్తున్నదని తెలిపారు. ఇటీవల నగరంలోని గోపన్‌పల్లిలో సకల సౌకర్యాలతో, కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని తాను స్వహస్తాలతో ప్రారంభించానని చెప్పారు. ఈ భవనం భారతీయ సనాతన సంస్కృతికి వారధిగా, వైదిక గ్రంథాలయంగా, వివిధ క్రతువుల నిర్వహణకు మార్గదర్శిగా పేద బ్రాహ్మణులకు సహకార కేంద్రంగా, లోక కల్యాణకారిగా వెలుగొందాలని ఆకాంక్షించారు. విప్రహిత పేరుతో ఏర్పాటయిన ఈ భవనం సకల జనహితగా, విశ్వహితగా వెలుగొందాలని పేర్కొన్నారు. మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని తన సంజీవని వ్యాఖ్యతో ప్రపంచానికి చాటిచెప్పిన మహామహోపాధ్యాయుడు కోలాచల మల్లినాథ సూరి పేరున ఆయన స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేద, శాస్త్ర పండితులకు ప్రతినెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుండి రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు. ఈ భృతిని పొందే అర్హత వయస్సును ప్రభుత్వం 75 ఏళ్ల నుండి 65 ఏళ్లకు తగ్గించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 2,796 దేవాలయాలకు కూడా ధూప దీప నైవేద్య పథకాన్ని విస్తరింపజేస్తున్నదని తెలిపారు. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాలయలకు ధూప దీప నైవేద్యం పథకం కింద నిర్వహణ వ్యయం అందుతుందని చెప్పారు. ఇప్పటివరకు ధూపదీప నైవేద్య పథకం కింద దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు 6 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ఈ మొత్తాన్ని 10 వేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ప్రకటించారు. వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న 2 లక్షల రూపాయలను ఇకనుంచీ వార్షిక గ్రాంట్‌గా ఇస్తామని తెలిపారు. ఐఐటి, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు.
దేశంలోకెల్లా అత్యధిక వేతనాలు
రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను అందించుకున్నామని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చుకున్నామని తెలిపారు. కరోనాతో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనా, గత పిఆర్‌సిలో 30 శాతం ఫిట్ మెంట్‌ను ఇచ్చుకున్నామని చెప్పారు. దీనిని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా వర్తింపజేసి అమలు పరుచుకున్నామని అన్నారు. గ్రామీణ సమాజానికి అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు చేస్తున్న సేవను గౌరవిస్తూ ప్రభుత్వం వారి వేతనాలను మూడు దఫాలుగా 325 శాతం పెంచిందని చెప్పారు. 2014లో అంగన్‌వాడీ టీచర్ల వేతనం కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేదని, ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్ వాడీ టీచర్లకు రూ.7,800, అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.7,800 చొప్పున దేశంలోకెల్లా అత్యధిక వేతనాలను చెల్లిస్తున్నామని తెలిపారు.
ఆరోగ్యంలో దేశంలో అగ్రగామిగా తెలంగాణ
రాష్ట్రం స్వల్ప వ్యవధిలో వైద్యారోగ్య రంగాన్ని విస్తృత పరిచిందని, వైద్యసేవల ప్రమాణాలను పెంచిందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. 2014లో తెలంగాణ వచ్చేనాటికి ఆరోగ్యరంగం అంపశయ్య మీద ఉందని, మందుంటే సూదిలేక, సూది ఉంటే మందు లేక, పడకలు లేక ఉన్న పడకలకు ఆక్సీజన్ సౌకర్యం లేక, సిబ్బంది లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు. నేడు స్వపరిపాలనలో ఆరోగ్య రంగం ప్రజలకు అత్యంత చేరువయిందని, విశ్వసనీయతను పెంచుకున్నదని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యభాగ్యాన్ని అందించడంలో నేడు తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని వెల్లడించారు. అన్ని దవాఖానాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఆస్పత్రులలో అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్లు, కిడ్నీరోగుల కోసం ఉచితంగా డయాలసిస్ సెంటర్లు, అన్ని ఆస్పత్రులలో ఆక్సిజన్ సదుపాయం గల పడకలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇటీవలనే వైద్యారోగ్యశాఖలో 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను, 1442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించామన్నారు.
నగరం నలువైపులా ఆసుపత్రులు
రాష్ట్రం నలువైపుల నుంచీ రాజధాని నగరానికి వైద్యం కోసం వచ్చే పేషంట్లకు సత్వరం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం కోసం హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నామని సిఎం తెలిపారు. నిమ్స్ విస్తరణలో భాగంగా మరో 2 వేల పడకలతో ఏర్పాటు చేస్తున్న నూతన వైద్య భవనానికి ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే స్వయంగా తాను శంకుస్థాపన చేస్తున్నానని చెప్పారు. వరంగల్ నగరంలో 1,100 కోట్ల రూపాయలతో 2 వేల పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని, అతి త్వరలోనే ఈ హాస్పిటల్ ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. గతంలో నగరంలోని బస్తీలలో వైద్యసౌకర్యాలేవీ ఉండేవి కావని, పేదలు విధిలేక ప్రయివేటు వైద్యులను ఆశ్రయించవలసి వచ్చేదని చెప్పారు. బస్తీ పేదలకు చేరువలో వైద్యం అందించేందుకు హైదరాబాద్ నగరంలో 256 బస్తీ దవాఖానాలు ప్రారంభించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల రేటు 30 శాతం నుంచి 62 శాతానికి పెరిగిందని, అలాగే, ప్రసవ సమయంలో మాతృ మరణాల రేటు 2014లో లక్షకు 92 కాగా ప్రస్తుతం 43కి తగ్గిపోయిందని చెప్పారు. శిశు మరణాల సంఖ్య 2014లో వెయ్యికి 35 కాగా, ప్రస్తుతం 21కి గణనీయంగా తగ్గిపోయిందన్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య మహిళ అనే అత్యుత్తమమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటయిన నాటికి తెలంగాణ ప్రాతంలో కేవలం మూడంటే మూడు వైద్య కళాశాలలు ఉండేవని సిఎం తెలిపారు. తొలి ఏడున్నరేళ్లలోనే ప్రభుత్వం 12 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించిందని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News