Monday, December 23, 2024

కుట్రల కేంద్రం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు

మత పిచ్చి తప్ప మరో చర్చ

రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
 విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు 
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల అతీగతీ లేదు
పన్నుల వాటా ఎగ్గొట్టేందుకే సెస్‌లు కేంద్రం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు
దిక్కుమాలినవి బాయిలకాడ మీటర్లు పెట్టేదేలేదు, దేశానికి ప్రగతిశీల అజెండా కావాలి
గొప్ప సామాజిక ఉద్యమం దేశంలో 978 గురుకుల విద్యా సంస్థలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
ఎనిమిదేళ్లలో 1.33లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం
 ఐటిలో అప్రతిహతంగా దూసుకుపోతున్నాం, కరెంటు కష్టాలకు చరమగీతం
రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంపై మరోసారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు కేంద్రం పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రగతిశీల రాష్ట్రంపై కేంద్ర వైఖరి చాలా బాధాకరమన్నారు. అనేక విషయాల్లో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. ఎవరితో పెట్టుకున్నా పరావాలేదుగానీ…రైతులతో పెట్టుకోవద్దు అని పలుమార్లు కేంద్రాన్ని హెచ్చరించినా పెడచెవిన పెట్టడం శోచనీయని వ్యాఖ్యానించారు. ఈ ధోరణి వీడాలని కేంద్రాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలన్నారు. అప్పుడే ఇతర దేశాలతో పోటీపడే స్థితికి భారతదేశం ఎదుగుతుందన్నారు.
గురువారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ… కేంద్రంలోని మోడీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వ చేస్తున్న విన్నపం బధిర శంఖారావంగా మారడం విషాదకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టం హామీలన్నీ కేంద్రం బుట్టదాఖలు చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు కోరినా ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం తీరును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అలారే రాష్ట్రం రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. వారి అసమర్థతతోనే మోడీ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయాలని తనతో సహా ప్రజాప్రతినిధులందరం కలిసి ఢిల్లీలో ధర్నా చేశామన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం “బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు” అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొందని మండిపడ్డారు. బిజెపి హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకున్నదని విమర్శించారు. కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నదని కెసిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
వివక్షపై నిరంతర పోరాటం
తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉన్నపుడు సమైక్య పాలకులు వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరించడం విచారకరమన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళ నుంచే ఈ వివక్ష ప్రారంభమైందని విమర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టిందని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనివల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును మన కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. కేంద్రం అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ అప్పట్లో రాష్ట్ర బంద్‌ను పాటించాల్సి వచ్చిందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాటి నుంచి నేటివరకూ మన రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తోందన్నారు. అలాగే ఐదేళ్ళపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసిందన్నారు. మన హైకోర్టు మనకు ఏర్పాటైన తరువాత అవసరమైన సిబ్బందిని, నిధులను, భవనాలను సమర్థవంతంగా సమకూర్చుకున్నామన్నారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి చేసిన కృషికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదన్నారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని తానే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యమన్నారు.
కేంద్రం నయాపైసా ఇవ్వలేదు
కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో అందరకీ తెలిసిందేనని కెసిఆర్ అన్నారు. ఆ క్లిష్ట సమయంలో కూడా కేంద్రం రాష్ట్రాలకు ఒక్క నయా పైసా అదనంగా ఇవ్వలేదన్నారు. పైగా న్యాయంగా రావాల్సిన నిధులపై కూడా కోత విధించిందన్నారు. కేంద్రప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాటి 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించిందన్నారు. కానీ ఈ జిల్లాలకు రావాల్సిన నిధులు ఇవ్వడంలో తగని జాప్యం చేస్తోందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రాత్సాహకాలు ఇవ్వాలని ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొందన్నారు. కానీ కేంద్రం చెప్పుకోదగ్గ ప్రోత్సాహకాలు ఏవీ ఇవ్వలేదని అన్నారు. విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్రం పూర్తి స్థాయిలో బుట్టదాఖలు చేసిందన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీ లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ఐటిఐఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఇది అమలు చేసి ఉంటే ఐటి రంగం మరింతగా పురోగమించి ఉండేదన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని చాలా స్పష్టంగా పేర్కొన్నదన్నారు. కానీ ప్రస్తుతం కేంద్రం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మన వైద్య విద్యార్థులకు దేశంలోనే వైద్యవిద్య కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రికి తాను స్వయంగా లేఖ కూడా రాశానన్నారు. రాష్ట్ర విద్యార్థుల వైద్యవిద్యకు అయ్యే ఖర్చును భరించడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలియజేశానని అన్నారు. కానీకేంద్రం నుంచి దీనికి ఎటవంటి ప్రతిస్పందన రాలేదన్నారు. ధాన్యం సేకరణపై 24 గంటల్లో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి తాము డెడ్‌లైన్ విధిస్తే…అక్కడి నుంచి ఎటువంటి జవాబు రాలేదన్నారు.
రైతులు భిక్షగాళ్ళు కాదు
ప్రతి గింజను కొనుగోలు చేయమని కేంద్రాన్ని కోరితే…. ఒక కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలు నూకలు తినాలని చాలా అవహేళనగా మాట్లాడారని తీవ్ర అసంతృర్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా? అని సిఎం నిలదీశారు. ఈ వ్యాఖ్యలు ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయన్నారు. దేశంలోని రైతులు భిక్షగాళ్ళు కాదన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం ఉండాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు..ఎవరితోనైనా పెట్టుకోండి కానీ, రైతులతో పెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నానని అన్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, రైతులతో చెలగాటమాడే ధోరణిని ఇకనైనా మానుకోవాలని కెసిఆర్ సూచించారు.
కేంద్రం సహకరించకపోయినా ఆదుకుంటాం
కేంద్రం మొండి చెయ్యి చూపినా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకుంటామని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు. వారు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నడుం బిగించిందన్నారు. ధాన్యం దిగుబడి, కొనుగోళ్ళలో రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించిందన్నారు. కేంద్రం సహకరించినా, సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి అండదండలు అందిస్తుందని మరోసారి తాను హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రజాస్వామ్య ప్రక్రియను అవలంబిస్తూ, పార్లమెంటరీ పంథాను ఎంచుకున్నాయన్నారు. ఈ పరిణామ క్రమంలో ప్రజాస్వామ్యం పరిణతి చెందేకొద్దీ ఆయా దేశాలు అధికారాలను వికేంద్రీకరిస్తూ ప్రజా సాధికారికతను పెంపొందించాయన్నారు. పౌర సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయన్నారు. కానీ మన దేశంలో అందుకు విరుద్ధంగా జరిగిందన్నారు. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరిణతిని పొంది అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయని విమర్శించారు. విశాలతరం కావల్సిన సమాఖ్య స్ఫూర్తి కుంచించుకు పోతున్నదని కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాలరాస్తున్న కేంద్రం
దేశ రాజ్యాంగం రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ, శాసనాధికారాలను, పాలనాధికారాలను, స్వయంప్రతిపత్తిని కల్పించిందని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకూ కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్నీ, రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాశాయని ఆయన విమర్శించారు. అధికారాలను నిస్సిగ్గుగా హరించాయని మండిపడ్డారు. భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కేంద్రం పరిధిలోని అధికారాలనూ, రాష్ట్రాల పరిధిలోని అధికారాలనూ స్పష్టంగా నిర్వచించిందన్నారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే మూడు జాబితాలను నిర్దేశించిందన్నారు. దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయని మండిపడ్డారు. కాలం గడుస్తున్నకొద్దీ ఉమ్మడి జాబితా పెరుగుతుండగా….. రాష్ట్ర జాబితా తరుగుతున్నదన్నారు. రాజ్యాంగం పేర్కొన్న రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి నామావశిష్టమైపోతున్నదన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసిన సర్కారియా, పూంఛ్ కమిషన్లు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పలు సూచనలు చేశాయన్నారు. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలూ ఈ కమిషన్ల నివేదికలను బుట్ట దాఖలు చేశాయన్నారు. ఇప్పటివరకూ దేశాన్ని ఏలిన ఈ ప్రభుత్వాలు అనుసరించిన ధోరణులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏరకంగానూ మంచి చేయజాలకపోగా, దేశ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధికి, వికాసానికి తీవ్ర అవరోధాలుగా మారాయని విమర్శించారు. .
పన్నుల వాటాను ఎగ్గేంటేందుకే…సెస్‌లు
కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తున్నది సిఎం కెసిఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తోందన్నారు. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నదని విరుచుకుపడ్డారు. ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నదన్నారు. రుణాలు, పెట్టుబడి వ్యయాలు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులకు లోబడే నిర్వహిస్తూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారయిందన్నారు. ఈ ఆంక్షలపై కేంద్రం వెంటనే పునరాలోచించాలన్నారు. రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని ఈ సందర్భంగా కెసిఆర డిమాండ్ చేశారు.
ఆ సంస్కరణలను అమలు చేయం
కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై కెసిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవో దిక్కుమాలిన సంస్కరణలు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నష్టం వచ్చినా సరే…. ఈ సంస్కరణలు మాత్రం అమలు చేయమన్నారు. కేంద్రం ఒత్తిళ్లకు తలవొగ్గితే యేటా రాష్ట్రానికి ఐదు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకొనే అవకాశం ఉండేదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు. వారికి ఇబ్బందులు కలిగించే ఎలాంటి నిర్ణయాన్ని తమ ప్రభుత్వం అంగీకరించదని స్పష్టం చేశారు. ఐదేళ్లలో మొత్తం రూ. 25 వేల కోట్ల కోసం చూస్తే రైతుల బాయిలకాడ మీటర్లు పెట్టాల్సి ఉంటుందన్నారు. రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. అది టిఆర్‌ఎస్ విధానం కాదన్నారు. రైతులమీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. తన కంఠంలో ప్రాణమున్నంతకాలం రైతాంగానికి నష్టంచేసే విద్యుత్ సంస్కరణలను అంగీకరించేది లేదని కెసిఆర్ మరోసారి సష్టం చేశారు.
దేశానికి ప్రగతి శీల ఎజెండా కావాలి
నేడు దేశానికి ఒక సామూహిక లక్ష్యం లేకుండా పోయిందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. చుక్కాని లేని నావలా గాలివాటుకు కొట్టుకు పోతున్నదన్నారు. 75 ఏండ్ల స్వతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్య్రబాధ ఎందుకు పీడిస్తున్నది?అని ప్రశ్నించారు. సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది ? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి కాదు ముఖ్యమన్నారు. అధికార పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు కావాల్సిందన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలన్నారు. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలన్నారు. దీని కోసం దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నారు. మనతో పాటు స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్‌లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నామమన్నారు. ఫలితంగా దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉందన్నారు. విద్వేష రాజకీయాలలో చిక్కి దేశం విలవిలలాడుతున్నదన్నారు. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చలేదన్నారు. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరమన్నారు. విచ్ఛిన్నకర శక్తులు ఇదేవిధంగా పెట్రేగి పోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అశాంతి ఇదేవిధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా… ఉన్న పెట్టుబడులు వెనక్కు మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుందన్నారు. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాదిమంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనుకకు తీసుకపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానాలు కావాలన్నారు. అందుకు తగు వేదికలు రావాల్సిన అవసరముందన్నారు. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలన్నారు. ఆజన్మాంతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవటం తన విధి అని…. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం కూడా మనందరి బాధ్యత అని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి రాజీపడే ధోరణేలేదన్నారు. అలా రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్ళమా? మృత్యువు నోట్లో తలదూర్చి మరీ విజయం సాధించగలిగే వాళ్ళమా? అని ప్రశ్నించారు.
దళితబంధు- ఒక గొప్ప సామాజిక ఉద్యమం
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా, తెలంగాణలో దళితబంధు పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించాలని, దళితులంతా స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఆ లక్ష్య సాధనకోసం తానే స్వయంగా దళితబంధు పథకానికి రూపకల్పన చేశానని అన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఇది రుణం కాదని…. పూర్తి గ్రాంటు రూపంలో ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన… వచ్చిన పనిని లబ్దిదారుడు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చునని అన్నారు. దళితబంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ కూడా ఏర్పాటు చేస్తున్నదన్నారు.. దళితబంధు ద్వారా లబ్ధిపొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే, ఆ కుటుంబం ఆ ఆపద నుండి తేరుకొని తిరిగి ఆర్థికంగా, మరింత పటిష్టంగా నిలదొక్కుకోవడానికి ఈ నిధి దోహద పడుతుందన్నారు.
ఏ రాష్ట్రాం సాధించని ప్రగతిని సాధించాం
దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిందని కెసిఆర్ అన్నారు .ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నారు. ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్యుత్తు సరఫరాలో, తాగునీరు సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక ఐటి రంగాల ప్రగతిలో ఇలా అనేక రంగాలలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచిందన్నారు. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశా నిర్దేశనం చేసే కరదీపికగా మారిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జిఎస్‌డిపి 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా, గత ఆర్ధిక సంవత్సరం నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నదన్నారు. తలసరి ఆదాయం పెరుగుదలలో కూడా రాష్ట్రం రికార్డు సాధించిందన్నారు. 2014..20-15లో రాష్ట్ర తలసరి ఆదాయం లక్షా 24 వేల 104 రూపాయలు కాగా, 2021…20-22 నాటికి 2 లక్షల 78 వేల 833 రూపాయలకు పెరిగిందన్నారు. జాతీయ సగటు ఆదాయమైన 1 లక్ష 49 వేల 848 రూపాయలకంటే ఇది 86 శాతం అధికమన్నారు. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రోజురోజుకూ పెరుగుతుండటం శుభ పరిణామమని అన్నారు.
కరెంటు కష్టాలకు చరమగీతం
కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రంగాలకూ నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణే అని చెప్పడానికి తాను గర్విస్తున్నానని అన్నారు.. రాష్ట్రం ఏర్పడిన నాడు విద్యుత్ కోతలతో, పవర్ హాలిడేలతో ఉక్కిరిబిక్కిరైన విషయం మనకు తెలుసన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు కాగా…. ప్రస్తుతం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు అని అన్నారు. అలాగే సోలార్ విద్యుదుత్పత్తిలో రాష్ట్రం గత ఎనిమిదేళ్ళలో 74 మెగావాట్ల నుండి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించిందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. 2014లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగిందన్నారు. ఇక జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73 శాతం అధికంగా ఉందన్నారు.
రాష్ట్రంలో మంచినీరు దొరకని ప్రాంతమే లేదు
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్నపుడు పల్లెలు సాగునీటి కోసమే కాదు, తాగునీటి కోసం కూడా తల్లడిల్లాయని సిఎం కెసిఆర్ అన్నారు..నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించేదన్నారు. చిన్న వయస్సులో నడుం వంకరపోవడం, బొక్కలు విరగడం, కాళ్ళు వంకర తిరగడం లాంటి సమస్యలతో నల్లగొండ బిడ్డలు సతమతమయ్యారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఫలితంగా నేడు రాష్ట్రంలోని 100 శాతం ఆవాసాలలో ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ పథకాన్ని ఎందరో ప్రశంసించారని…. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా లభించిందన్నారు. తెలంగాణ అమలుపరచిన మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందన్నారు. అనేక రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఈ పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించి వెళ్ళడం మనందరికీ గర్వకారణమన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా మంచినీరు దొరకని ప్రాంతమే లేదన్నారు. నీటికోసం బిందెలతో మహిళలు బారులుతీరిన దృశ్యాలు లేవు…. మంచినీటి యుద్ధాలు లేవన్నారు. ప్రజల దాహార్తి తీర్చాలన్న ప్రభుత్వ అంకిత భావానికి ఇది ప్రబల నిదర్శనమన్నారు.
పంట పెట్టుబడిగా సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం
రైతులకు పంట పెట్టుబడిగా సాయంగా దేశ చరిత్రలో రూ. 50 వేల కోట్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్ అన్నారు దేశంలో మరే రాష్ట్రంలోనూ రైతన్నలకు ఇంతటి సౌకర్యాలు లేవన్నారు. అందుకే ఇతర రాష్ట్రాలు కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు.. తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయరంగానికి శతాబ్దాలుగా ఆదరువుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురై, పూడిపోయి, గట్లు తెగిపోయి, శిథిలావస్థకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం మిషన్ కాకతీయ పేరుతో పెద్దఎత్తున ఈ చెరువులను పునరుద్ధరించుకున్నామన్నారు. 15 లక్షలకుపైగా ఎకరాల సాగుభూమిని స్థిరీకరించుకున్నామన్నారు.
సస్యశ్యామలగా తెలంగాణ
రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, పథకాలు అమలులోకి రావడంతో ప్రస్తుతం మన రాష్ట్రం ‘సజల సుజల సస్యశ్యామల తెలంగాణ’ గా మారిందని కెసిఆర్ అన్నారు. రైతన్నల రుణభారం తగ్గించడానికి రైతురుణ మాఫీ చేశామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవటం, ప్రతి ఐదు వేల ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్ గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించటం, రైతువేదికల నిర్మాణం, పంటకల్లాల నిర్మాణం, రైతుబంధు సమితిల ఏర్పాటు, పంటకాలంలో పెట్టుబడి సాయం కోసం రైతుబంధు, విధివశాత్తూ అసువులు బాసిన రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు రైతుబీమా, ప్రాజెక్టులు నిర్మించి సమృద్ధిగా సాగునీరు అందించడం, నీటి తీరువా బకాయిల రద్దు చేయటం, ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా సాగునీటి సరఫరా చేయటం ద్వారా నేడు వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించగలిగామన్నారు.
దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక అపూర్వఘట్టమని సిఎం కెసిఆర్ అన్నారు. కేవలం మూడేళ్ళలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచామన్నారు. చైనా వంటి దేశాల్లో మాత్రమే సాధ్యమనుకునే వేగంతో ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించుకున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తోందన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయన్నారు. ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతిపెద్దదైన రిజర్వాయర్ మల్లన్న సాగర్ అని అన్నారు. దీని నిల్వ సామర్థ్యం 50 టిఎంసిలు అని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలను మల్లన్నసాగర్ కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు అభిషేకించి మొక్కు తీర్చుకున్నాంమన్నారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంతోపాటు, సస్యశ్యామల తెలంగాణను కూడా కన్నుల పండుగగా చూసుకోగలగటం మనందరికీ గర్వకారణమన్నారు.
నిమిదేళ్లలో 1.33 లక్షల ఉద్యోగాలు
గడిచిన ఎనిమిదేళ్ళలో 1 లక్షా 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సిఎం కెసిఆర్ వెల్లడించారు.. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీచేస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 11,103 మంది ఉద్యోగుల సేవలను మానవతా దృష్టితో క్రమబద్ధీకరించి, ఇంకా ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను కొత్తవారితో భర్తీ చేస్తున్నదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 2,24,142 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరపటం ద్వారా తెలంగాణ యావద్దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
నవశకానికి నాందిపలికిన ధరణి
భూ రికార్డులు ప్రక్షాళనచేసి, రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవశకానికి నాంది పలుకుతూ ప్రత్యేకంగా ధరణీ పోర్టల్‌ను తీసుకొచ్చామని సిఎం కెసిఆర్ తెలిపారు. భూ రికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్ రూపొందించామన్నారు. దీంతో ప్రజలకు ప్రయాస లేకుండా, సులభతరంగా నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరుగుతున్నదన్నారు.
పెట్టుబడులను ఆకర్శించడంలో అగ్రగ్రామి
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని కెసిఆర్ అన్నారు. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్..ఐపాస్ చట్టం, నిరంతర విద్యుత్తు, నీటి సరఫరా, రాష్ట్రంలో పరిఢవిల్లుతున్న శాంతిభద్రతలు, సుస్థిర ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేళ్ళలో మొత్తం 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి వచ్చాయన్నారు. మొత్తం 16 లక్షల 48 వేల 956 ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. ఇక ఐటి రంగంలో రాష్ట్రం అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోందన్నారు. 1500కు పైగా పెద్ద, చిన్న ఐటి పరిశ్రమలు ప్రస్తుతం హైదరాబాద్‌లో కొలువై ఉన్నాయన్నారు. ప్రపంచ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఐ.బి.ఎం, కాగ్నిజెంట్, అమేజాన్, ఒరాకిల్ వంటి అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్నారు.
గురుకుల విద్యకు ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ వికాసం కోసం మొదటిదశలో గురుకుల విద్యకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. దేశంలో అత్యధికంగా 978 గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా విద్యార్థినీ, విద్యార్థులకు సమగ్ర శిక్షణనిస్తూ ఈ గురుకులాలు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మన ఊరు – మన బడి అనే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికిందన్నారు. వర్తమాన కాల అవసరాలకు తగినట్టుగా పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్దఎత్తున చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయల వ్యయంతో దశలవారీగా అన్ని పాఠశాలల్లో అభివృద్ధిపనులు చేపడతున్నదన్నారు. మొదటి దశలో మండలాన్ని యూనిట్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయల వ్యయంతో కార్యాచరణ ప్రారంచామన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యం
రాష్ట్ర ప్రజలు చక్కటి ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో జీవించాలన్నదే ప్రభుత్వ ఆశయమని సిఎం కెసిఆర్ అన్నారు. అందులో భాగంగానే వైద్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న దృఢసంకల్పంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ముందుగా ప్రభుత్వ హాస్పటిళ్ళలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచడమే కాకుండా అధునాతన వైద్యపరికరాలు సమకూర్చిందన్నారు. 57 వైద్యపరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారి కోసం 42 ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేసిందన్నారు. గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ కు తీసుకురావడం ప్రసవానంతరం తిరిగి ఇంటికి చేర్చడం కోసం ప్రభుత్వం 300 అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. హైరిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడం లోనూ, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచడంలోనూ దేశంలోనే రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచిందన్నారు.

Telangana Formation Day: KCR Speech at public garden 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News