ఏడేళ్లలో సబ్బండ వర్గాల అభివృద్ధే లక్షంగా పాలన
కెసిఆర్ విప్లవాత్మక సంస్కరణలు దేశానికే ఆదర్శం
మనతెలంగాణ/హైదరాబాద్: స్వరాష్ట్ర ఆకాంక్ష సిద్ధించి ఏడేళ్లు గడిచింది. సుదీర్ఘ ఉద్యమం, పోరాటాల అనంతరం వివిధ పరిణామాలు, ప్రక్రియలను దాటుకుంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ పూర్తి చేసుకుని 2014 జూన్ 2న కొత్త పది జిల్లాల తెలంగాణ భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా చేరింది. సాధారణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ వెంటనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దు తానంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ తన ప్రణాళికను వెల్లడించారు. అప్పటి నుంచి కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలలో అనూహ్య ప్రగతి సాధించింది. ఏడేళ్లలో తెలంగాణ ప్రజల సాగునీటి, తాగునీటి కష్టాలు తీర్చి, విద్యుత్ సమస్య పరిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడమనే సవాల్‌ను సిఎం కెసిఆర్ మొదటగా స్వీకరించారు. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు రూపొందించి మళ్లీ విద్యుత్ సమస్య తలెత్తకుండా శాశ్వతంగా సమస్యలను పరిష్కరించారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అత్యంత సాహసోపేతంగా తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మానవీయ కోణంలో ఆలోచించి వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్లు, పేద ఆడబిడ్డల పెళ్లిల్లకు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోంది. ఎస్‌సి,ఎస్‌టి,బిసి విద్యార్థుల కోసం గురుకులాలను ఏర్పాటు చేసి అత్యున్నత ప్రమాణాలతో కార్పోరేట్ విద్యను అందిస్తోంది. ఐదేళ్ల గడువుకు ముందే ముందస్తు ఎన్నికల రూపంలో ప్రజల ముందుకెళ్లిన సిఎం కెసిఆర్ మరోసారు విజయఢంకా మోగించి 2018 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టారు.
ఉద్యోగ నియామకాలు
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు, ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2021 మార్చి వరకు మొత్తం 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) ద్వారా 30,594 ఉద్యోగాలు, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 31,972, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 3,623, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో 179, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో 80 ఉద్యోగాలు భర్తీ చేశారు. అదేవిధంగా డైరెక్టర్, మైనారిటీస్ వెల్ఫేర్‌లో 66, జూనియర్ పంచాయతీ సెక్రెటరీస్‌లు ఉద్యోగాలు 9,355, ఆయుష్ శాఖలో 171, టీఎస్ జెన్‌కోలో 856, టీఎస్ ఎన్పీడీసీఎల్‌లో 164, టిఎస్ ఎస్పిడిసిఎల్‌లో 201, టీఎస్ ట్రాన్స్ కోలో 206, టిఎస్-ఆర్ టి సిలో 4,768, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 12,500, జెన్కో, ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్‌పిడిసిఎల్‌లో 6,648 ఉద్యోగాలు భర్తీ చేసింది. వీటితోపాటు విద్యుత్ శాఖలో 22,637 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. హైదరాబాద్ జలమండలిలో 80, తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 243, డిసిసిబిలలో 1,571 ఉద్యోగాలను భర్తీ చేశారు. ప్రస్తుతం 6,258 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉంది.
టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌గా బి. జనార్దన్ రెడ్డి
టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌గా ఐఏఎస్ అధికారి బి.జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. కమిషన్ సభ్యులుగా మాజీ ఎంఎల్‌సి సత్యనారాయణ, టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ఆయుర్వేద డాక్టర్ చంద్రశేఖర్ రావు, రిటైర్డ్ ఈఎన్‌సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ ప్రొఫెసర్ లింగారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణకుమారిలను ప్రభుత్వం నియమించింది.
కోటి ఎకరాలను సాగునీరందించడం దృష్టి
తెలంగాణ ఏర్పడిన తరువాత, రాష్ట్ర వ్యాప్తంగా మేజర్, మీడియం, ఎత్తిపోతల పథకాలు, చెరువుల కింద సుమారు ఒక కోటి ఎకరాలకు నీటిపారుదల సౌకర్యంను (ప్రతి గ్రామీణ నియోజకవర్గాలలో 1 లక్ష ఎకరాలు) కల్పించడం ద్వారా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి నీటిపారుదల రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది.దీనిని సాధించడానికి, భారీ నీటిపారుదల ప్రాజెక్టులను, భారీ పరిమాణం లిఫ్ట్ నీటి పారుదల పథకాలు, పూర్వపు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డేవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌ఐడిసి) నిర్వహించిన చిన్న లిఫ్ట్ నీటి పారుదల పథకాల పునరుద్ధరణ, నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా 46,000 చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్దరణ, వాగుల మీద 1200 చెక్ డ్యాంల నిర్మాణం, భారీ మధ్య తరహ సాగునీటి ప్రాజెక్టుల కాలువలపై 3000 తూముల నిర్మాణం చేపట్టడతో సాగునీటి చెరువులు, నీటి వనరులకు నీరు సరఫరా చేయడం ద్వారా కొత్త అయకట్టు, ఇప్పటికే ఉన్న అయకట్టు స్థిరీకరణకు తెలంగాణ ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. 20.39 లక్షల ఎకరాల (2004-14 మధ్యకాలంలో 5.71 లక్షల ఎకరాలతో సహా) కొత్త నీటిపారుదల సంభావ్యత సౄష్టించడంతోపాటు భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు, నీటి పారుదల చెరువులు, నీటి వనరులు, పూర్వపు టిఎస్‌ఐడిసి కింద చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ద్వారా 31.49 లక్షల ఎకరాల అయకట్టు స్థిరీకరణలోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ప్రతిపాదిత 125.06 లక్షల ఎకరాలలో మొత్తం 72.55 లక్షల ఎకరాలు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల క్రింద (పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న 52.16 లక్షల ఎకరాలతో కలిపి) నీటిపారుదల సౌకర్యం సృష్టించబడింది. మిగిలిన 52.51 లక్షల ఎకరాల నీటిపారుదల సదుపాయం రాబోయే 2 నుండి 3 సంవత్సరాల కాలంలో సౄష్టించబడుతుంది. చాలా ప్రాజెక్టులు పూర్తి కావచ్చే దశలో ఉన్నందున మరియు పంపిణీ కాలువ పనులు మెరుగైన పురోగతిలో ఉన్నందున రాబోయే 2 నుండి 3 సంవత్సరాలలో మిగిలిన 52.51 లక్షల ఎకరాల అయకట్టుకు సాగునీటి కల్పన కూడా సాధించబడుతుంది.ప్రభుత్వ నిరంతర కృషి మరియు నిబద్ధతచే తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు, ఉద్దేశ్యాలు రాబోయే 2 నుండి 3 సంవత్సరాలలో నెరవేరుతాయి. దానితో రాష్ట్ర గ్రామీణ ఆర్థిక రంగం యొక్క అభివృద్ధి, అన్నీ రంగాల ఆర్థిక వృద్ధి నీటి పారుదల రంగం ద్వారా సాకారం అవుతాయి.
పరిపాలనా సంస్కరణలు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టింది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. 10 పాత జిల్లాలకు అదనంగా 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి 33కు పెంచింది. పాత 44 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో 30 ఏర్పాటు చేసి 74 వరకు పెంచింది. పాతవి 459 మండలాలు ఉంటే కొత్తగా మరో 131 ఏర్పాటు చేసి 590 వరకు పెంచింది. పాతవి 8,690 గ్రామాలు ఉంటే కొత్తగా మరో 4,079 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి 12,769 వరకు పెంచింది. 52 మున్సిపాలిటీలకు కొత్తగా మరో 77 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి 129కి పెంచింది. అలాగే, పాత 6 కార్పొరేషన్లకు అదనంగా మరో 7 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 13 వరకు పెంచింది. దీంతో మొత్తం పట్టణ స్థానిక సంస్థల సంఖ్య 142 వరకు పెరిగింది.
నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది
తెలంగాణ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. దాదాపుగా 60 లక్షల మందికిపైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నన్ని కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయడం లేదు. రైతుల మేలుకోసం సిఎం కెసిఆర్ దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక వ్యూహాలను అమలు చేస్తున్నారు. పంట వేసే దశ నుంచి పంట అమ్ముకునే దశ వరకు పలు రకాల పథకాలతో పథక రచన చేశారు. రైతుబంధు, రైతు బీమా, రైతుల పంట రుణాలు మాఫీ చేయడం, ఇన్ పుట్ సబ్సిడీ అందించడం, ఉచిత విద్యుత్ అందివ్వడం, గోదాముల నిర్మాణంతోపాటు వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. రైతుల దిగుబడి, తలసరి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అమలు పరుస్తున్నది.
వృద్ధిరేటు : వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం వృద్ధిరేటు మాత్రమే తెలంగాణలో నమోదైంది. ఇపుడు 6.3 శాతం అదనపు వృద్ధి సాధించి 8.1 శాతం నమోదు చేయగలిగింది. రాష్ట్రంలో పంటల ఉత్పత్తిలో 23.7 శాతం వృద్ధి సాధించింది.
రుణవిముక్తులను చేసిన ‘రుణమాఫీ’
రైతులు తీసుకున్న రుణాలు వారికి భారం కాకూడదన్న ఉద్దేశంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,124.37 కోట్ల రుణమాఫీ చేసింది. ఒకేసారి మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆర్.బి.ఐ అంగీకరించక పోవడంతో 4 విడతలుగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసింది. రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని రైతులందరికీ రూ. లక్ష లోపు పంట రుణాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది. 2014 మార్చి 31 వరకు ఉన్న రూ. లక్ష లోపు వ్యవసాయ రుణాలు రద్దు చేసింది. 4 విడతల్లో రైతులకు రూ.16,124.37 కోట్ల రుణమాఫీ సంపూర్ణమయ్యింది. 35,29,944 మంది రైతులకు ప్రయోజనం కలిగింది.
రెండో దఫా రైతు రుణమాఫీ రూ.25,936 కోట్లు
2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 నాటికి రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా రూ.లక్ష లోపు తీసుకున్న రూ.25,936 కోట్లు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 40.66 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీతో లబ్దిచేకూరనున్నది. రుణమాఫీ మార్గదర్శకాలతో కూడిన జీవో ఆర్టీ నంబర్- 148ని 2020 మార్చి 17న విడుదల చేశారు. అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి రూ.లక్ష చొప్పున రుణమాఫీ చేస్తున్నారు. స్వల్పకాలిక పంట రుణాలతోపాటు బంగారం తాకట్టు పెట్టి రైతులు తీసుకున్న పంట రుణాలు కూడా మాఫీ చేస్తారు. రుణమాఫీకి ప్రభుత్వం 2019-20 బడ్జెట్లో లో రూ.6 వేల కోట్లు, 2020-21 బడ్జెట్లో రూ.6225 కోట్లు కేటాయించింది. రెండోదఫాలో రూ.25వేల లోపు బాకీ ఉన్న 5.88 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1210 కోట్ల రుణాలను తొలుత మాఫీ చేస్తున్నది. ఈ నిధులను 07 మే, 2020న ప్రభుత్వం విడుదల చేసింది. వీరి రుణాలకు నగదును వారి వారి ఖాతాల్లో జమ చేశారు. రుణమాఫీ అయిన రైతులు బ్యాంకుల నుంచి కొత్త రుణాలను పొందనున్నారు. రూ.25 వేలకు పైగా అప్పు ఉన్న రైతులకు నాలుగు విడతలుగా రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు.
రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లింపు
పంట రుణాలను మాఫీ చేయడమే కాకుండా, ప్రభుత్వం 2009 నుంచి రైతులకు చెల్లించాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ పాత బకాయిలను కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చెల్లించింది. వడగండ్లు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహరం 2014-15లో రూ.480.43 కోట్లతో 12.64 లక్షల రైతుల ఖాతాలలో జమ చేశారు. తర్వాత వైపరీత్యాలకు కూడా ప్రభుత్వం రూ.845.14 కోట్లను రైతులకు చెల్లించింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 37,45,102 మంది రైతులకు మొత్తం రూ.1325 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారు.
రైతుకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించే ‘రైతుబంధు’
రైతుల పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నది. రైతుకు పంట సమయంలో పెట్టుబడి చాలా కీలకం. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలవుతున్నారు. పెట్టుబడి కోసం చేసిన అప్పు, దానిమీద పడే వడ్డీ పులిమీద పుట్రలా ఒకదానికి ఒకటి తోడై రైతును పూర్తిగా కృంగదీస్తున్నాయి. ఈ క్షోభ నుంచి రైతును కాపాడడం కోసం పంటకు అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వమే పంటసాయంగా అందించాలని నిర్ణయించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ రైతుపక్షాన నిలబడి ఇంతగొప్ప నిర్ణయం తీసుకోలేదు.
భూముల వివరాలు : రాష్ట్రవ్యాప్తంగా 1,50,12,603 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి, 61,50,134 మంది రైతులు ఉన్నారు. 60.95 లక్షల మంది పట్టాదారుల్లో మూడెకరాల్లోపు ఉన్నవారు 72.57 శాతం మంది ఉన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకు చెందిన వారే 98.7 శాతం మంది ఉన్నారు. మొత్తంగా పది ఎకరాల్లోపు ఉన్న రైతులే 98.38%గా ఉన్నారు. 25 ఎకరాలు పైబడిన రైతులు 6,679 మంది ఉన్నారు. వీరి చేతుల్లో 2,24,733 ఎకరాల విస్తీర్ణమున్న భూములు ఉన్నాయి
లోటు విద్యుత్ నుంచి.. మిగులు విద్యుత్ దిశగా..
తెలంగాణ వస్తే ఏం వస్తుంది? అనే వారికి రాష్ట్ర ప్రభుత్వం కోతల్లేని కరెంటు సరఫరా చేసి మొదటి జవాబు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయగీతికలో పల్లవిగా నిలిచింది విద్యుత్ విజయం. పాలనే చేతకాదు అనే వాళ్ల నోళ్లు మూయించిన మొదటి అంశం విద్యుత్ సంక్షోభం నుంచి విజయవంతంగా గట్టెక్కడం. తెలంగాణ వస్తే ఇక చిమ్మచీకట్లే అని విమర్శించిన నోళ్లు మూయించిన సక్సెస్ స్టోరీ నిరంతర కరెంటు సరఫరా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టి పెట్టిన రంగం విద్యుత్. చాలా వేగంగా ఫలితం వచ్చి ప్రజలు నూటికి నూరు శాతం సంతృప్తితో ఉన్న అంశం విద్యుత్. 13 వేల మెగావాట్లకు పైగా డిమాండ్ వచ్చినప్పటికీ ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేసిన ఘనతను తెలంగాణ విద్యుత్ సంస్థలు దక్కించుకున్నాయి. తెలంగాణ వచ్చేనాటికి లోటు విద్యుత్‌గా ఉన్న దుస్థితి నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.
విద్యుత్ సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకున్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడమనే సవాల్ ను మొదటగా స్వీకరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు వేశారు. ముందుగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. సరఫరాలో, పంపిణీలో కలుగుతున్న నష్టాలను బాగా తగ్గించుకోగలిగారు. నత్తనడకన నడుస్తున్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. అవి వేగంగా పూర్తయి ఉత్పత్తి ప్రారంభించే వరకు వెంటపడ్డారు. తెలంగాణలో పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ అత్యవసం కాబట్టి, ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఎక్కడ కరెంటు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి తీసుకున్నారు. ఉత్తరాది నుంచి కరెంటు పొందడానికి వీలుగా ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని పిజిసిఎల్ ద్వారా కొత్త లైను నిర్మాణం చేయించారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూపకల్పన చేశారు. విద్యుత్ సంస్థలు సింగరేణికి బకాయిపడిన 5,772 కోట్ల రూపాయలను ప్రభుత్వమే చెల్లించింది. గరిష్ట డిమాండ్ వచ్చినప్పుడు జరిపే అదనపు విద్యుత్ కొనుగోళ్లకు అయ్యే వ్యయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వమే భరిస్తున్నది. మొత్తంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 42,632 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించింది.
తెలంగాణలో సంక్షేమం.. స్వర్ణయుగం
తెలంగాణ రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల్లో సహజంగానే పేదరికం అధికం. కనీసం రోజుకు రెండు పూటలా అన్నం కూడా తినలేని దుర్భర పరిస్థితులను పేదలు అనుభవించేవారు. ఇక్కడ రోజూ ఆకలి చావులే. తెలంగాణ ఏర్పడే నాటికి ఇలాంటి దయనీయ పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆకలి చావులనేవి ఉండకూడదని, కనీస జీవన భద్రత కల్పించాలని ఏడేండ్ల క్రితమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంకల్పించారు. అందుకే, దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.45 వేల కోట్లతో పలురకాల ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాలతో పేదలకు కనీస జీవన భద్రత ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే దేశంలో మరెవ్వరూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగం స్థాపించింది.
సామాజిక బాధ్యతగా ‘ఆసరా పెన్షన్లు’
నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు,గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు అండగా నిలవడం సామాజిక బాధత్యగా భావించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. 39,07,818 మందికి ప్రతినెలా ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. ఇందులో రాష్ట్రంలోని 13,41,380 మంది వృద్ధులు, 13,91,041 మంది వితంతువులు, 35,527 మంది నేత కార్మికులు, 59,920 మంది గీత కార్మికులు, 32,185 మంది ఎయిడ్స్ పేషంట్లు, 4,17,757 మంది బీడీ కార్మికులు, 1,19,640 మంది ఒంటరి మహిళలు, 16,131 మంది బోదకాలు బాధితులకు రూ.2016 చొప్పున, 4,76,864 మంది వికలాంగులకు, 43,504 మంది వృద్ధ కళాకారులకు రూ.3,016 చొప్పున ఆసరా పెన్షన్లు ప్రభుత్వం అందజేస్తున్నది. వీరందరి పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.855 కోట్ల చొప్పున ఏటా 10,266 కోట్లు ఖర్చు చేస్తున్నది.
పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం తీర్చేందుకు ‘కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్’
రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.దీంతో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు కళ్యాణలక్ష్మి, మైనారిటీలకు షాదీ ముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టి, రూ.1,00,016 చొప్పున అందజేస్తున్నది. ఇందులో షాదీ ముబారక్ పథకం ద్వారా 2,04,915 మందికి, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 4,14,526 మందికి 6,19,441 మందికి ఈ పథకాలను అందజేశారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5556 కోట్లు ఖర్చు చేసింది.
విద్యార్థులకు సన్నబియ్యం
రాష్ట్రంలోని గురుకులాల్లో చదువుకునే విద్యార్థులందరికీ సన్నబియ్యంతో వండిన అన్నమే పెట్టాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో 3,854 సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు, 28,623 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ప్రతినెలా 12 వేల మెట్రిక్‌టన్నుల సన్న బియ్యాన్ని 16 సంక్షేమ విభాగాల ద్వారా సరఫరా చేస్తున్నది. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 3,300లకు కొనుగోలు చేసి, 44,61,000 మంది విద్యార్థులకు ఈ బియ్యాన్ని అందజేస్తున్నది.
Telangana formation day on June 2