Sunday, December 22, 2024

ఎకో టూరిజంలో తెలంగాణ రాష్ట్రాన్ని… ఫ్రంట్ రన్నర్ గా తీర్చిదిద్దుతాం : కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎకో టూరిజంలో తెలంగాణ రాష్ట్రాన్ని ‘ఫ్రంట్ రన్నర్’ గా తీర్చిదిద్దే దిశగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ప్రకృతి సమతుల్యతకు ఏమాత్రం హాని కలగకుండా ఎకో టూరిజం ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులకు సూచించారు. శనివారం డా. బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని అటవీ మంత్రిత్వశాఖ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో ఎకో టూరిజం కన్సల్టేటివ్ కమిటి ఛైర్మన్ అయిన మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశమైన కమిటి ‘ఎకో టూరిజం పాలసీ’ ఫైనల్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలిపి, తుది అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపింది.

ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, సిఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, పిసిసిఎఫ్ ఆర్‌ఎం డోబ్రీయాల్, పిసిసిఎఫ్ (వైల్ లైఫ్) ఏలు సింగ్ మేరు, పిసిసిఎఫ్ (కంపా) సువర్ణ, టిజిఎఫ్ డిసి వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్, టిజిటిడిసి మేనేజింగ్ డైరక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ, ఎంతో జీవవైవిధ్యంతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎకో టూరిజం కేంద్రంగా మలిచేందుకు సమర్థ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టులను పర్యావరణహితంగా, ప్రకృతికి సహజ సంపదకు హాని కలగకుండా, ప్రజలకు, ప్రకృతికి మధ్య వున్న సంబంధాలు తెగిపోకుండా ఎంతో పకడ్బందీగా పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా పలు గ్రామాలను ఎకో విలేజ్ లుగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.

ఇందులో భాగంగా వారసత్వ, సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యత నివ్వటంతో పాటు స్థానిక ప్రజల ఆచార వ్యవహారాలు, వంటకాలు, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను గుర్తిస్తూ, వాటిని భాగం చేస్తూ ఎకో టూరిజం రంగాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఎకో టూరిజం స్పాట్లను తెలిపేలా అర్థవంతంగా వుండేలా వెబ్‌సైట్ ను రూపొందించి, తెలంగాణ ఎకో టూరిజానికి ఓ బ్రాండ్ ను సృష్టించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ఇతర ప్రదేశాల్లోనూ ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేసేలా చర్యలు చేపట్టాలని, ఎకో టూరిజం స్పాట్లను సందర్శించిన పర్యాటకుల చేత మొక్కను నాటించడంతో పాటు, పచ్చదనం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని మంత్రి అధికారులను నిర్దేశించారు. స్టడీ టూర్ కేంద్రాలుగా ఎకో టూరిజం స్పాట్లను అభివృద్ధి చేయాలన్నారు. హార్టికల్చర్, డెయిరీ ఫార్మ్ లపై ఆధారపడి జీవించే వారికి ఈ కేంద్రాలను ఉపాధి కేంద్రాలుగా మలిచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సందర్భంగా ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయదలిచిన సర్క్యూట్ల వివరాలను, వాటి ప్రత్యేకతలను అధికారులు మంత్రి సురేఖకు వివరించారు. సుదీర్ఘ చర్చ అనంతరం ఎకో టూరిజం పాలసీ ఫైనల్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలిపిన కన్సల్టేటివ్ కమిటి తుది అనుమతుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి ఫైలును పంపింది. ఈ సందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలను కమిటీ వెల్లడించింది. ఎకో టూరిజం పాలసీ అమలుకు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుందని, ఎకో టూరిజం ప్రాజెక్టుల ఆమోదానికి ఎకో టూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటి ఏర్పాటవుతుందని, ఎకో టూరిజం కేంద్రాల అభివృద్ధికి ఇతర నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులను, సీఎస్‌ఆర్ తదితర నిధులను సమీకరించాలని, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఎకో టూరిజం ప్రాజెక్టులను అమలుచేస్తుందని, స్క్రీనింగ్ కమిటిలో హార్టికల్చర్ డైరక్టర్ కు స్థానం కల్పించాలని మంత్రి సురేఖ ఆదేశించారు. ఎకో టూరిజం కేంద్రాల నిర్వహణను ప్రైవేట్ ఏజన్సీలకు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News