ఏడేళ్లుగా రాష్ట్ర ప్రగతిలో ముందంజ
సొంత వనరుల నుంచి అన్ని రంగాల వరకు వృద్ధిరేటు
ఆదాయ వృద్ధి 11.52 శాతంపైగా
తలసరిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానం
జాతీయ తలసరి సగటు కంటే 95శాతం అధికం
అప్రతిహత వృద్ధిలో తెలంగాణ
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ సుస్థిర అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. 2014లో తలసరి ఆదాయంలో దేశంలో 10వ స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు 3వ స్థానానికి ఎగబాకింది. సొంత వనరుల రాబడిలో అద్భు త పనితీరుతో 11.52 శాతం వృద్ధిరేటును సొంతం చేసుకుంది. తలసరి ఆదాయం 2014లో రూ.1,24,104లు ఉండగా ప్రస్తుత ఆర్థిక ఏడాది రూ.2,37,632లుగా నమో దయ్యింది. ఆరేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం 91.5శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. బడ్జెట్‌లో పొందుపర్చుకున్న రాబడులు, అంకెలను వాస్తవంలోకి తెచ్చుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నోట్ల రద్దు, జీఎస్టీ కరో నా కల్లోలం వంటి ఇబ్బందులను అధిగమిస్తూ ఆదాయ రాబడులను సమీకరించుకుంటోంది. దీనికి పాలనా సంస్కరణల మొదలు అన్ని రంగాలు ఇతోధిక వృద్ధిరేటు తో అభివృద్ధికి అండగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరుసగా ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోనే అత్యధిక ఆదాయ వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది.
ప్రజలపై పన్నుల భారం మోపకుండా..
ప్రజలపై పన్నుల భారం మోపకుండా ఖజానాను మరిం త పరిపుష్టిగా చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఆర్థిక ప్రగతిలో విజయా లు నమోదు చేసుకుంటూనే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే 2014-, 15 నుంచి అధిక వృద్ధి పథంలో గణనీయ పురోగతిని సాధిస్తోంది. స్థూల జాతీయోత్పత్తిలో జాతీయ వృద్ధిని అధిగమిస్తూ రెండెంకెల వృద్ధిని వరుసగా నిలుపుకుంటోంది. రాష్ట్ర తలసరి ఆదాయ జీవన ప్రమాణాలు జాతీయ సగటుకంటే అధికంగా నమోదవుతున్నాయి. ఆర్థిక నిర్వహణ సక్రమంగా సాగిన ఫలితంగానే విజయా ల పరంపర సాధ్యమైంది. సుస్థిర పాలన, స్థిరమైన అభివృద్ధి, నిరంతరాయ విద్యుత్, అద్భుతమైన శాంతిభద్రత లు ఇవన్నీ సంపద పెంపునకు కారణమవుతున్నాయి.
తద్వారా ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుతో తెలంగాణకు అంతర్జాతీ య గుర్తింపును తెచ్చిపెట్టాయి. పారిశ్రామిక వర్గాల్లో ప్రభు త్వం పట్ల బలమైన విశ్వాసంతో ప్రజల సంపదతో పాటు రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రా న్ని జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలిచిన తెలంగాణకు దేశ, విదేశాల నుంచి పెట్టుబడుల వరద పెరుగుతోంది. పారిశ్రామిక ప్రగతి, ఉత్పాదకరంగంలో అనూహ్యమైన ఫలితాలు, వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు ఇలా అన్నిరంగాల్లో అనూహ్యమైన ఫలితాలు వస్తున్నా యి. వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వ కృషి ఫలిస్తోంది.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తూ మెరుగైన ఆదాయం దిశగా వృద్ధిరేటు పరుగులు పెడుతోంది. రాష్ట్ర సంపదే కాదు, వ్యక్తుల తలసరి ఆదాయం రెట్టింపవుతోంది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి రూ. 4లక్షల కోట్లుగా ఉంటే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐదేళ్లలో రెట్టింపై రూ. 9,69,604 లక్షల కోట్లకు చేరుకుంది. రాష్ట్ర స్థూల సంపద ప్రస్తుత ధరల వద్ద రూ. 6,63,258 కోట్ల మార్కుకు చేరడం కెసిఆర్ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి రూ. 4లక్షల కోట్లుగా ఉండగా, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం అనుసరించిన అనేక పథకాలు, చర్య ల కారణంగా రెట్టింపైన సంగతి పారిశ్రామిక వేత్తల్లో ఉత్సాహం నింపింది.
తెలంగాణ వృద్ధిరేటు 11.6శాతంగా
జాతీయ స్థాయిలో జిడిపి వృద్ధిరేటు తగ్గుతుండగా, రాష్ట్రంలో వృద్ధిరేటు పెరుగుతూ పోతుంది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,35,050తో వృద్ధిరేటు 6.4 శాతం కాగా, తెలంగాణ వృద్ధిరేటు 11.6శాతంగా నమోదైంది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అనేక మార్పులు సంతరించుకు న్నాయి. ప్రగతి పథంలో తెలంగాణ స్థానం సాధించేందుకు కీలక కృషి చేసింది. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో జిఎస్‌డిపి వృద్ధిరేటు 10శాతం దాటింది. 2011, -12లో తెలంగాణ సంపద వృద్ధిరేటు ప్రస్తుత ధరలవద్ద 11.7 శాతంగా నమోదైంది. స్థిర ధరలవద్ద వృద్ధిరేటు 3 శాతంగా నమోదైంది. తెలంగాణ ఏర్పాటైన ఏడాది తర్వాత నుంచే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా మార్పులు గోచరించడం ఆరంభమైంది.