ఎల్కతుర్తి: ప్రత్యేక తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు కొందరు తనను వెటకారం చేశారని అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణ సాధించానని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. ఎల్కతుర్తిలో జరుగుతున్న బిఆర్‌ఎస్ రజతోత్సవ సభలో ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి విశేషాలను ఆయన పంచుకున్నారు.
‘1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి మళ్లీ జీవం పోశాను. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా టిఆర్‌ఎస్ ఆవిర్భావం జరిగింది. ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని ఆనాడు చెప్పాను. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలుపడ్డారో నాకు తెలుసు. కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి లేదని శ్రీరాముడు ఏనాడో చెప్పాడు. వలసవాదుల విష కౌగిలిలో నలిగిపోతున్న నా భూమికి విముక్తి కల్పించాలని భావించాను. తెలంగాణ విముక్తి కోసం ఒక్కడినే బయలుదేరాను. ఆనాడు కాంగ్రెస్, టిడిపిలో ఉన్న నేతలు పదవుల కోసం పెదాలు మూసుకొని కూర్చున్నారు. శాసనసభలో తెలంగాణ అనే పదం ఉపయోగించవద్దని రూలింగ్ ఇచ్చారు’ అని కెసిఆర్ పేర్కొన్నారు.
ఇక ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. ఆనాడు, ఈనాడు, ఏనాడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీనే. 1956లో బలవంతంగా ఆంధ్రతో కలిపింది జవహర్‌లాల్ నెహ్రూనే అని కెసిఆర్ ఎద్దేవా చేశారు. ‘1969లో తెలంగాణ ఉద్యమం వస్తే నిరంకుశంగా అణిచివేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత మలిదశ ఉద్యమం ఉద్ధృతమైంది. సాగరహారం, వంటావార్పు సకల జనుల సమ్మె వంటి కార్యక్రమాలతో ఉద్యమం ఉద్ధృతం చేశాం. తెలంగాణ ఇస్తామని ప్రకటించి.. ఆంధ్రలో వ్యతిరేకత రాగానే వెనక్కి తగ్గారు’ అని మండిపడ్డారు.
ఇక బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాల గురించి మాట్లాడుతూ.. ‘సాధించుకున్న తెలంగాణలో ప్రజలు దీవించి పదేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి సాగుభూమిని గణనీయంగా పెంచాం. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం. పంజాబ్ తలదన్నేలా పండే పంటల తెలంగాణను నిర్మించుకున్నాం. షేర్‌షా కాలం నుంచి స్వాతంత్ర్యం వచ్చే వరకూ రైతుల నుంచి ఎన్నో పన్నులు వసూలు చేశారు. రైతుల వద్ద నుంచి పన్నులు వసూలు చేసిన వాళ్లు తప్ప రైతులను ఆదుకొనే వారు లేరు. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే రైతు బంధు పథకం తీసుకువచ్చాం. బిఆర్‌ఎస్ హయాంలో రైతుబంధు పథకం నిరాటంకంగా అమలైంది. వానాకాలం, యాసంగి పంటలకు సకాలంలో రైతు బంధు జమ చేశాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మీ, చేపల పెంపకం వంటివి అమలు చేశాం. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చేశాం’ అని అన్నారు.
ఎన్నో అద్భుతాలు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి బీమార్ వచ్చిందని కెసిఆర్ తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు ఎన్నెన్నో చెప్పారని.. నకిలీ గాంధీలు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారని ఆయన విమర్శించారు. ‘పింఛను రూ.2వేలు ఉంటే కాంగ్రెసోళ్లు రూ.4వేలు ఇస్తామన్నారు. మేం రైతుబంధు రూ.10వేలు ఇస్తే.. రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ ఒక్క సంతకంతో రద్దు చేస్తామని చెప్పారు. ధాన్యం తడిసినా.. మొలకలు వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసేది. కళ్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. కానీ, ఇప్పటికీ పింఛన్లు పెరగలేదు. రుణమాఫీ జరగలేదు. కాంగ్రెస్ నేతలు ఎన్నో మాటలు చెప్పి ప్రజలను ఏమార్చారు’ అని కెసిఆర్ ధ్వజమెత్తారు.