భారతదేశ రైతాంగం ‘అప్పుల్లో పుట్టి అప్పుల్లో చనిపోతారు’. దేశంలో 86 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. వీరిలో చాలా మంది నిరక్షరాస్యులు, ఇప్పటికీ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కొనసాగిస్తున్నారు. ఈ పాతకాలం వ్యవసాయం పద్ధతుల మూలంగా దేశ రైతాం గం ఇప్పటికీ అప్పుల్లోనే కొట్టుమిట్టాడుతోంది. దేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల పరంపర ఈ రోజు కూడా కొనసాగుతోంది. కాని 2 జూన్ 2014 లో 29 వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం ‘రైతులు అప్పులో పుట్టి అప్పుల్లో చావకూడదని’ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల వెనుకబాటు తనానికి మూల కారణాలైన రుణమాఫీ, సాగునీరు, పెట్టుబడి, (రైతుబంధు), 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా, కుటుంబం రైతును కోల్పోతే రైతు బీమా, ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఇలాంటి గొప్ప, గొప్ప పథకాలను ప్రవేశపెట్టి ‘రైతు లక్షాధికారి కావాలని, రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడూ రూపాయలు నిల్వ ఉండాలని ఒక గొప్ప ఆకాంక్షతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిర్విరామంగా రైతుల కోసం శ్రమిస్తున్నారు. గత ఏడు సంవత్సరాల ( ప్రకృతి వైపరీత్యాలు కొంత ఇబ్బంది పెడుతున్నా) నుండి వ్యవసాయానికి కొంత భరోసా వచ్చింది.
ఒకప్పుడు వరి ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానం ఆక్రమించుకోవడం వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న పట్టుదలకు నిదర్శనం. ‘వ్యవసాయ రంగం దండుగ అన్న నానుడి నుండి వ్యవసాయ రంగం పండుగ అనే నానుడికి క్రమక్రమంగా మారుతున్నది’. అందులో భాగంగానే రైతు రుణమాఫీ ఈ పథకాన్ని 1 ఏప్రిల్ 2014 ప్రారంభించి బ్యాంకులలో ఒక రూ. లక్ష రూపాయలలోపు వ్యవసాయ రుణం తీసుకున్న ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. ఇందులో భాగంగా 16,144.10 కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లించి 35,29,944 మంది రైతులకు ప్రభు త్వం రుణ విముక్తులను చేసింది. 2018 ఎన్నికల్లో రూ. లక్ష లోపు బ్యాంకులలో ఉన్న రుణాన్ని నాలుగు దఫాలుగా మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి వాగ్దానం చేసింది. ఇందుకుగాను 2018 సంవత్సరంలో మొదటి దఫా గా రూ. 25 వేల లోపు రుణం ఉన్న 2 లక్షల 96 వేల మందికి రైతులకు 408.38 కోట్ల రూపాయలు మాఫీ చేసింది.
అదే విధంగా రెండో దఫా రుణమాఫీ 16 ఆగస్టు 2021 నుండి ప్రారంభించి 31 ఆగస్టులోపు రూ. 50 వేల రూపాయలులోపు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందని దీనికి గాను 6,06,811 మంది రైతులకు రూ. 2,006 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. బ్యాంకులలో 50,000 రూపాయలు లోపు ఉన్న రైతులందరికీ రుణ విముక్తి కల్పించి కొత్త రుణాలను కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. ఏ వయసులోనైనా చావు చాలా విషాదకరమైన, బాధాకరమైన విషయం. ఆ లోటును ఎవరు తీర్చలేనిది. ఆ కుటుంబానికి కొంత మేరకు ఆర్థికపరమైన చేయూతను అందిస్తే ఆ కుటుంబానికి కొంత మేరకు ఆసరాగా ఉంటుంది. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రభు త్వం ప్రవేశపెట్టిన ‘రైతు బీమా’ తెలంగాణ రైతాంగానికి కొంత ఆసరాగా నిలుస్తుంది. 18 సంవత్సరాల వయసు నుండి 59 సంవత్సరాల వయసు వారికి పట్టాదారు అయిన రైతు చనిపోతే (సహజ మరణమైన, పాము కాటు, కరెంట్ షాక్, యాక్సిడెంట్లు, ఆత్మహత్య చేసుకున్న కారణం ఏదైనా? ) ఆ రైతు కుటుంబాలకు అన్ని సక్రమంగా ఉంటే రైతు చనిపోయిన ఇరవై రోజుల లోపు ఆ రైతు నామిని పేరు మీద 5 లక్షల రూపాయలు అకౌంట్‌లో జమ అవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేదీ. 2018 ఆగస్టు -15-నుండి తెలంగాణ వ్యాప్తంగా గుంట భూమి నుండి ఎంత భూమి పట్టా వున్న ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎల్‌ఐసికి రైతుల పేరు మీద ప్రీమియం చెల్లించి రాష్ట్రంలో చనిపోయిన 18 నుండి 59 సంవత్సరాల వయసు లోపు ఉన్న ప్రతి బాధిత రైతు కుటుంబానికి గత మూడు సంవత్సరాలుగా సహాయం అందిస్తున్నది. 85 శాతం నిరక్షరాస్యులైన రైతాంగం బీమా ఉంటుందని తెలియదు, తెలిస్తే ప్రీమి యం కట్టే పరిస్థితి రాష్ట్ర (దేశ) రైతాంగానికి లేదు. అందుకని తెలంగాణ రాష్ట్రంలో ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే కుటుంబం బజారున పడకుండా ఉండడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం దేశంలో ఎక్కడా కూడా లేదు. చావును ఎవరు ఆపలేరు కానీ ఆ కుటుంబానికి ప్రభు త్వం ఆర్థికపరమైన చేయూత నివ్వడం శుభపరిణామం. నిజానికి ‘రాష్ట్ర రైతాంగానికి ఈ రైతు బీమా ధీమాను ఇస్తుంది’. 1995 సంవత్సరం నుండి 2019 వరకు దేశ వ్యాప్తంగా 3,64,092 (ఎన్‌సిఆర్‌బి ప్రకా రం) మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 1995 నుండి 2019 వరకు తెలంగాణ (రాష్ట్ర) వ్యాప్తంగా 31,637 (ఎన్‌సిఆర్‌బి ప్రకారం) మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
అంటే దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 2021 జూలై వరకు దాదాపు 33 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా 1995 నుండి 2014 వరకు 27,334 (ఎన్‌సిఆర్‌బి) మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1998 నుండి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి 1 లక్ష 50 వేల రూపాయలు ఎక్స్‌గ్రేషియో అందించాలని 2004 సంవత్సరంలో జీవో నం. 421 తీసుకువచ్చి తెలంగాణ వ్యాప్తంగా సుమారు 7000 మంది రైతు ఆత్మహత్య కుటుంబాలకు మాత్రమే ఎక్స్‌గ్రేషియో అందించింది. అంటే దాదాపు పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిహారం కోసం రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, చివరకు కోర్టు మెట్లు ఎక్కితేగాని 7 వేల మంది రైతులకు పరిహారం రాలేదు. 13 రకాల పత్రాలను పరిశీలించి మండల, డివిజన్ స్థాయిలో ముగ్గురు సభ్యుల కమిటీ సిఫారసు మేరకు పరిహారం అందింది. అయినా అన్ని ఆత్మహత్య కుటుంబాల అందరికీ అందలేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా 2018 ఆగస్టు 15 నుండి 2021 ఆగస్టు 1 వరకు దాదాపు 59,200 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోతే 53,550 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా 20 రోజుల లోపు ఎలాంటి పైరవీలు లేకుండా అందించింది. ఇంకా 5,650 మంది రైతులకు వివిధ కారణాలతో బీమా చెల్లింపులు పెండింగ్‌లో ఉంది. ఈ బీమా డబ్బు కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ రైతు కుటుంబాలకు చాలా ఆసరాగా ఉంటుంది. ఈ బీమా చెల్లింపునకు కావలసిన పత్రాలు:- 1. పట్టా పాస్ బుక్ జిరాక్స్, 2. డెత్ సర్టిఫికెట్ 3. నామిని ఆధార్ కార్డ్ 4. నామిని బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ జిరాక్స్. మండల వ్యవసాయాధికారికి ఇస్తే 20రోజులలో నామిని అకౌంట్‌లో 5 లక్షల రూపాయలు జమ అవుతున్నాయి.
2018 -19 సంవత్సరంలో 31.27 లక్షల మంది రైతులు బీమా అర్హులైనారు. దీనికి ఒక్కొక్కరికి ప్రీమియం 2,271.50 రూ. చొప్పున మొత్తం 710.58 కోట్ల రూపాయలను ఎల్‌ఐసికి ప్రభుత్వం చెల్లించింది. ఆ సంవత్సరం 17,620 మంది రైతులకు బీమా వర్తించింది. 201920 సంవత్సరంలో 32.16 లక్షల మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారు. ఒక్కొక్కరికి ప్రీమియం 3,457.50 రూపాయలు మొత్తం ప్రీమియం 1,065.37 కోట్లు, బీమా వర్తించిన రైతులు 18 వేల 793 మంది. 2020 -21 సంవత్సరం లో 32.73 లక్షల మంది రైతులకు బీమా పరిధిలోకి వచ్చారు. ఒక్కొక్కరికి ప్రీమియం రూ.3486.90 ప్రభుత్వం చెల్లించిన మొత్తం ప్రీమియం రూ. 1141.44 కోట్లు బీమా వర్తించిన కుటుంబాలు (రైతులు) 22,004. 2021-22 సంవత్సరానికి 1450 కోట్ల రూపాయల చెక్కును ఐటి శాఖ మంత్రి తారకరామారావు ఎల్‌ఐసికి అందజేశారు.
దాదాపుగా ప్రతి సంవత్సరం సగటున 19,735 మంది పట్టా భూమి ఉన్న రైతులు వివిధ కారణాలతో చనిపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 నుండి 2014 వరకు 7 వేల బాధిత రైతు ఆత్మహత్య కుటుంబాలకు పరిహారం అందితే, తెలంగాణ రాష్ట్రంలో 2018 ఆగస్టు 15 నుండి 2021 జూలై వరకు అంటే మూడు సంవత్సరాల్లో 53,560 మంది బాధిత కుటుంబాలకు బీమా పరిహారం అందడం చాలా సంతోషించాల్సిన విషయం. రైతులారా మీరు ఎవరూ అధైర్యపడకండి, మీకు ప్రభుత్వం, పౌర సమాజం అండగా ఉంటుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏమనగా 1). రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు దఫాల రుణ మాఫీ బ్యాంకులలో మిత్తికే సరిపోతుంది కావున రుణమాఫీ ఒకేసారి చేయాలి. 2). రైతు కుటుంబం ఒక యూనిట్‌గా తీసుకొని రైతు బీమా అమలు చేయాలి. 3). రైతు బీమాను 75 సంవత్సరాల వయసుకు పెంచాలి. 4). కౌలు రైతులను గుర్తించాలి. 5). కౌలు రైతులకు కూడా రైతు బీమాను అమలు చేయాలి. 6). ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 194 జిఒను అమలు చేయాలి.
పులి రాజు
9908383567