Thursday, January 23, 2025

ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయండి

- Advertisement -
- Advertisement -

అధికారులను ఆదేశించిన సిఎస్

మనతెలంగాణ/హైదరాబాద్:  ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం బిఆర్‌ఆర్‌కె భవన్‌లో నియామక బోర్డుల అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. టిఎస్పీఎస్సీ భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకైందని తేలడంతో ఉద్యోగ నియామకాలపై సిఎస్ సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో టిఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, పోలీసు నియామక బోర్డు చైర్మన్ శ్రీనివాస్ రావు, గురుకుల నియామక బోర్డు కార్యదర్శి మల్లయ్య భట్టు, వైద్య నియామక బోర్డు జెడి గోపీకాంత్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్ రాస్, జీఏడి ముఖ్య కార్యదర్శితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఇప్పటివరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 17,285 ఉద్యోగాలకు సంబంధించి 17 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయన్నారు. కొన్ని నోటిఫికేషన్లకు ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తి చేశామని అధికారులు వివరించారు. గ్రూప్ 2 ,3 ,4 నోటిఫికేషన్లకు సంబంధించి జూలై నెలలోగా రాత పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ నెలవరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ కానున్న అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి రాత పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు సిఎస్‌తో తెలిపారు.

మొత్తం పది వేల పోస్టులకు సెప్టెంబర్‌లోగా….

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 17,516 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పోర్ట్ చేశామని, ఏప్రిల్‌లో రాత పరీక్షలు పూర్తి చేసి, సెప్టెంబర్ నెలలోగా నియామకాలు జరుపుతామని అధికారులు సిఎస్‌తో పేర్కొన్నారు. మెడికల్, హెల్త్ సర్వీస్ బోర్డు ద్వారా ఆగస్టులోగా దాదాపు పదివేల వివిధ స్థాయి ఉద్యోగ ఖాళీలను నింపనున్నట్టు సిఎస్ తెలిపారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా మొత్తం పది వేల పోస్టులకు సెప్టెంబర్‌లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు శాంతికుమారి స్పష్టం చేశారు. ఉద్యోగాల నియమాకాల ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకొని సర్వీసు అంశాలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల అంశాల్లో కొన్ని శాఖల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించి ఆయా ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News