మోటారువాహనాల చట్టాలను సరిచేసే యత్నాలు
ఇక ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బారీకేడ్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్షంగా సర్కారు సమాలోచనలు సాగిస్తోంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టే అవగాహన కార్యక్రమాల కోసం నిధులను పెంచాలని కేంద్రానికి ఇటీవల కాలంలో నివేదిక సైతం సమర్పించింది. ఈక్రమంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రాష్ట్రంలో మోటారు వాహనాల చట్టంలోని లోపాలను సరిచేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న మోటారు వాహన చట్టం 1988 నాటిదన్న విషయం తెలిసిందే. ఆ కాలంలో ఉన్న వాహనాలకు అనుగుణంగా చట్టాన్ని రూపొందించారు. ఇదిలావుండగా అప్పట్లో దేశ వ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో 49వేల పైచిలుకు ఉండగా అది కాస్త నేడు 1.50లక్షలకు చేరుకుంది. దీంతో మోటారు వాహనచట్టం విషయంలో 17 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం విచారకరం.
ఏడాదికి సగటు 50 ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించడంలో అధికారులు విఫలమౌతున్నారు. అలాగే రహదారుల ఏర్పాటులో ఇంజినీరింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదాల నియంత్రణ నిమిత్తం పలు రకాలు ప్రయోగాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కార్లకు, లారీలకు, మినీ బస్సులకు వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు వేయాలన్న నిబంధనను కఠినతరం చేయనున్నారు. అదేవిధంగా వాహనాలకు వెనుకవైపులో రియర్ ల్యాంప్స్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకునే సమాలోచనలు సాగిస్తున్నారు. అలాగే రాష్ట్రానికి నలువైపులా ఉన్న జాతీయ రహదారుల్లో బ్లాక్ స్పాట్స్, డార్క్ స్పాట్స్‌లను గుర్తించి యూటర్న్, అటవీ ప్రాంతాలలో డ్యాష్ బోర్డులు, సైన్ బోర్డుల ఏర్పాటు చేసేందుకు సర్కారు సుముఖత చూపుతోంది.
ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా వాహనాలకు నిర్ధిష్ట వేగాన్ని నిర్ణయించడం, ఆపై వేగ నియంత్రణ సూచికలను రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసేందుకు అధికారులు పనిచేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశించినా అశించిన మేరకు పనులు జరుగలేదని తెలుస్తోంది, ఈ నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ ప్రాంతాలలోని రోడ్లలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లును మరోసారి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు నివేదిక సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అదనపు నిధులకై నివేదికలు
రాష్ట్ర పరిధిలో ఉన్న నేషనల్ హైవేలలో ప్రమాదాలను నియంత్రించేందుకు అవసరమైతే అదనపు నిధులు కేటాయించాలని కేంద్రానికి నివేదికలు సమర్పించడంతో పాటు జాతీయ రహదారులలో ఇంజినీరింగ్ లోపాలను సరిదిద్దేందుకు టోల్‌గేట్స్ నిర్వహకుల బాధ్యత ఎంతవరకు ఉంటుందన్న విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు. రాష్ట్రంలోని హైవేలలో ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు, నిధుల కేటాయింపులపై కేంద్రానికి సమర్పించిన పూర్తిస్థాయి నివేదికలో పేర్కొన్నట్లు తెలియవచ్చింది.
ఎనిమిదవ స్థానంలో రాష్ట్రం
దేశవ్యాప్తంగా మిలియన్ జనాభా పైబడిన 50 పట్టణాలను అధ్యయనం చేసిన కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎనిమిదవ స్థానంలో నిలిచిందని ఓ నివేదికలో పేర్కొంది. దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలను అధ్యయనం చేసిన రవాణా మంత్రిత్వ శాఖ స్థానాల నివేదిక రూపంలో పొందుపరిచింది. అలాగే ప్రమాదాలలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణ కూడా ఎనిమిదవ స్థానంలోనే ఉండడం గమనార్హం. ప్రమాదాల సంఖ్య, వాటిల్లో మృతుల సంఖ్య ప్రాతిపదికన కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో ఈ గణాంకాలను తెలియజేసింది. ఈ ప్రమాదాలు సైతం అత్యధికంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయంలో చోటుచేసుకున్నాయని గుర్తించింది.