Friday, December 20, 2024

బాలల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా బాలల రక్షణ కమిటీల ఏర్పాటు
బాలల పరిరక్షణ కమిటీల కరపత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి రాథోడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : బాలల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పర్చువల్ కార్యక్రమంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీల కోసం ముద్రించిన కరదీపిక (పుస్తకం) ను మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సహకారంతో ప్లాన్ ఇండియా సాంకేతిక సహాయంతో ఈ బుక్‌లెట్‌ను ముద్రించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల సంక్షేమ అధికారులు, సిడబ్లుసిలు, డిసిపి యూనిట్‌లు, బాల రక్షా భవన్ అధికారులు, ప్లాన్ ఇండియా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలు పూర్తిగా అరికట్టబడుతున్నాయన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కిషోర బాలికలకు సోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్థాల కిట్‌లను త్వరలోనే అందించనున్నామన్నారు.

కెసిఆర్ పాలన దక్షత ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా ఉన్నాయన్నారు. ఈ కరదీపిక రాష్ట్రంలోని 12,769 పంచాయితీల్లోని విసిపిసి (గ్రామ బాలల పరిరక్షణ కమిటీ) సభ్యులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, వాలల పట్ల లైంగిక వేధింపులు, అత్యాచారాలు, స్కూల్ డ్రాప్ ఔట్స్ పరిష్కరించే క్రమంలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటి సభ్యులందరూ ఈ కరదీపికను ఉపయోగించుకోవాలని సూచించారు. విసిపిసి కమిటీ అద్యక్షులుగా ఉన్న గ్రామ సర్పంచీలు నిర్దిష్ట తేదీల్లో సమావేశాలు నిర్వహించి పిల్లల సమస్యలు చర్చించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులను భాగస్వాములుగా చేసి వారికి ఆడపిల్లల హక్కుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.

బాలల రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా బాలల రక్షణ కమిటీలు ఏర్పాటవుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గ్రామాల్లో, వార్డుల్లో, మండలాల్లో, పట్టణాల్లో, జిల్లాల్లో ప్రతిచోటా బాలల హక్కులు కాపాడడానికి బాలలు రక్షణాత్మక వాతావరణంలో పెరిగేలా చేయడం కోసం కమిటీలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. బాలలందరూ బడికి వెళ్ళేలా చేయడం, గ్రామంలో బాల కార్మికులు లేకుండా చూడడం, బాల్యవివాహాలను అరికట్టడం, బాలలపై లైంగిక వేధింపులు జరగకుండా కాపాడడం, బాలలు హింసకు లోను కాకుండా చర్యలు తీసుకోవడంఈ కమిటీల ప్రధాన కర్తవ్యమన్నారు.

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ శ్రీనివాసారావు మాట్లాడుతూ పిల్లల రక్షణలో తెలంగాణ రాష్టంలో దేశంలోనే ముందు వరసలో ఉందన్నారు. గ్రామ స్థాయి బాలల రక్షణ కమిటీలు ఒక మోడల్‌గా ఎదగాలని ఒక ప్రయత్నం చేస్తున్నామన్నారు. బాలల రక్షణకు చర్యలు తీసుకోవడంలో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. బాలల సమస్యలు, వారి హక్కులపై తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో కరపత్రాలను ముద్రించడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News