Wednesday, January 22, 2025

డైట్ ఛార్జీలు పెంపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హాస్టల్ విద్యార్థులకు శుభవార్త వెలువడింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ళ డైట్ చార్జీలను గణనీయంగా పెంచింది. పతి నెలా అదనంగా రూ. 275 కోట్ల మేరకు ప్రభుత్వ కేటాయింపులు పెరగనున్నాయి. ఏడాదికి రూ.3,302 కోట్ల మేరకు నిధులను అదనంగా వచ్చించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి బుధవారం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, అన్ని సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంక్షేమ హాస్టళ్ళ డైట్ చార్జీలపై కూలంకషంగా చర్చించి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రతిపాదనలు పంపించారు.

డైట్ చార్జీల్లో ప్రస్తుత ధరలకనుగుణంగా పెంపును ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 2012, 2017 లో డైట్ చార్జీలను పెంచారు. ఆ తర్వాత ప్రస్తుతం ధరల పెంపును అమల్లోకి తేబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ సంక్షేమ హాస్టళ్ళలోని 8 లక్షల 59 వేల 959 మంది విద్యార్థులతో పాటు మోడల్ స్కూళ్ళు, కస్తూరిబా విద్యాలయాలు, సాధారణ గురుకులాల్లోని హాస్టల్ విద్యార్థులకు సైతం ఈ నిర్ణయంతో కడుపునిండా పోషకాహారాన్ని ప్రభుత్వం అందించబోతోంది. దేశంలో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక తదితర ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధిక డైట్ చార్జీలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న డైట్ చార్జీలకు 25 శాతం మేర పెంపుతో కూడిన ప్రతిపాదనలను మంత్రులు ఆమోదించి ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించారు.

ప్రతి నెలా మూడవ తరగతి నుండి 7వ తరగతి వరుకు గతంలో ఉన్న రూ. 950 ఉన్న డైట్ చార్జీలను రూ. 1200కు పెంచారు. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు గతంలో ఉన్న రూ. 1,100లను రూ. 1400 లకు, ఇంటర్ నుండి పిజి వరకు రూ. 1500 నుండి రూ. 1875 లకు నిర్ణయించారు. వాటికి అదనంగా ప్రతి నెలా ఒక్కో విద్యార్థికి దాదాపు 15 కిలోల చొప్పున 47 కోట్లతో 14,514 మెట్రిక్ టన్నుల బలవర్థక సన్నబియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకోసం సంవత్సరానికి రూ. 560 కోట్లను వెచ్చించి సంక్షేమ హాస్టళ్ళ విద్యార్థులకు నాణ్యమైన, పోషణను ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1136 ఎస్‌సి హాస్టల్స్‌లో 2,43,673 మంది విద్యార్థులు,

812 ఎస్‌టి హాస్టల్స్‌లో 2,15,934 మంది విద్యార్థులు, 1013 బిసి హాస్టల్స్‌లో 2,46,299 మంది విద్యార్థులు, 216 మైనారిటీ హాస్టల్స్‌లో 1,30,549 మంది విద్యార్థులు, 37 జనరల్ హాస్టల్స్‌లో 23,504 మంది మొత్తం 3,214 హాస్టల్స్‌లో 8,59,959 మంది విద్యార్థులు దీని ద్వారా లబ్దిపొందనున్నారు.
డైట్ చార్జీలకు ఏటా 16 వేల కోట్లు…
సంక్షేమ హాస్టళ్ళ డైట్ చార్జీలను తెలంగాణ ప్రభుత్వం గణనీయంగా పెంచిన నేపధ్యంలో ఏటా అదనంగా భారీగా నిధులను కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి నెలా రూ. 1053.84 కోట్లను కేవలం డైట్ చార్జీల కోసమే వెచ్చిస్తోంది. సంవత్సరానికి దాదాపు 12,646.08 కోట్లను ఖర్చు చేస్తున్నది. ప్రస్తుతం పెంచిన డైట్ చార్జీలకు అనుగుణంగా ప్రుభుత్వం ప్రతినెలా అదనంగా రూ. 275 కోట్ల మేర మొత్తంగా ఏడాదికి రూ. 3302 కోట్ల మేరకు నిధులు అదనంగా వెచ్చించాల్సి రావడం గమనార్హం. ప్రభుత్వం ఏడాదికి డైట్ చార్జీల కోసం రూ. 16 వేల కోట్ల నిధులు వెచ్చించాల్సి వస్తుంది.
హాస్టళ్ళను తరచూ తనిఖీ చేయాలి
2012 తర్వాత 2017 లో డైట్ చార్జీలను పెంచారని ప్రస్తుతం ఐదేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా 2023లోనూ డైట్ చార్జీలను పెంచాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. సంక్షేమ హాస్టళ్ళ విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో వసతి కల్పిస్తున్నామని, వారికి మరింత మెరుగైన వసతుల కల్పన లక్షంతో పది కంటే తక్కువ సంఖ్యలో ఉన్న హాస్టళ్ళను వాటికి సమీపంలోని ఆదే శాఖ నిర్వహిస్తున్న సంక్షేమ గురుకులాలల్లో కలిపే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నెలలో తరచుగా జిల్లా కలెక్టర్ మొదలు తాలుకా స్థాయి యంత్రాంగం సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలను తనిఖీ చేస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే నిద్రించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎస్‌సి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, సాంఘీక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, మైనారిటీ గురుకుల సొపైటీ కార్యదర్శి షఫిఉల్లా, బిసి గురుకుల కార్యదర్శి మల్లయ్యబట్టు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిధుల కేటాయింపు
ఇప్పటి వరకు అన్ని కేటగిరిల్లో కలిసి ప్రభుత్వం రూ.1.053.84 కోట్లు ఇందుకోసం వచ్చిస్తోంది. 25 శాతం డైట్ చార్జీలు పెంచడం వల్ల రూ. 1,329.02 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై ప్రతి నెలా అదనంగా రూ.275.18 కోట్లు, ప్రతి సంవత్సరం అదనంగా రూ. 3,302 కోట్ల భారం పడనుంది.
ఐదేళ్ళ క్రితం అప్పటి ధరలకనుగుణంగా ప్రభుత్వం మెస్ చార్జీలను నిర్ణయించింది. అప్పటి నుండి ధరలు రెండు మూడింతలు పెరిగినా మెస్ చార్జీలు సవరించలేదు. మెస్ చార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. పెరిగిన ధరలకనుగుణంగా మెస్ చార్జీల పెంపుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విషయమై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం పలు దఫాలు చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

కేటగిరి మొత్తం హాస్టల్స్ విద్యార్థుల సంఖ్య
ఎస్‌సి 1136 2,43,673
ఎస్‌టి 812 2,15,934
బిసి 1013 2,46,299
మైనారిటీ 216 1,30,549
జనరల్ 37 23,504
మొత్తం 3214 8,59,959

మెస్ చార్జీలు
తరగతి 201415లో 201617 లో ప్రస్తుత ప్రతిపాదనలు
రేట్లు రేట్లు (25 శాతం)
3 7వ తరగతి 750 950 1200
8 10 తరగతి 850 1100 1400
ఇంటర్ పిజి 1050 1500 1875

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News