జవహర్‌నగర్: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మంగళవారం జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో కోఆప్షన్ సభ్యురాలు, మహిళా స్వయం సంఘాల చైర్మన్ ఉప్పుగళ్ల శోభారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రూ.12కోట్ల రుణాల చెక్కును నగర మేయర్ కా వ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, స్వయం సహాయక సంఘాలకు కోట్ల రూపాయలను మంజూరు చేస్తు వారు ఉపాధితో ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రతి మహిళ స్వశక్తితో ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
బ్యాంక్ నుంచి రుణం పొందిన మహిళ దురదృష్టవశాత్తు మరణిస్తే వారు పొందిన రుణాన్నిమాఫీ చేయాలని బ్యాంక్ అధికారులను కోరారు. ఈ విషయమై సీఎం కెసిఆర్ నుంచి ప్రకటన ఇచ్చేట ట్లు కృషి చేస్తానని ఆయన స్వయం సహాయక బృందాలకు హామీ ఇచ్చారు. కోఆప్షన్ సభ్యురాలు, స్వయం సహాయక సంఘాల చైర్మన్ శోభారెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, మున్సిపల్ రెవెన్యూ అధికారి ప్రభాకర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజు,వివిధ బ్యాంక్‌ల అధికారులు పాల్గొన్నారు.