జఫర్‌గడ్ : అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సిఎం కెసిఆర్ పాలన సాగిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే డా తాటికొండ రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని ఆళ్వార్ బండ తండ (శంకర్ తండ), దుర్గ తండ, కోనాయచలం, తిడుగు, రఘునాధ్‌పల్లి, కూనూరులో ఎమ్మెల్యే ప్రగతి నివేదన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్ళ ప్రభుత్వ పాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రగతి నివేదన యాత్ర చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మీ, కెసిఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, కంటి వెలుగు వంటి పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రపంచ దేశాలకే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలో స్థానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.