Wednesday, January 22, 2025

మెడికల్ వార్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరారని.. అందుకు కేంద్రం సైతం సానుకూలంగా స్పందించిందని పేర్కొంటూ ఓ వీడియోను మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్షా యోజన కింద కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మండవీయ పిలుపుమేరకు అన్ని కొత్త వైద్య కళాశాలల కోసం దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ ప్రభుత్వం సకాలంలో మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోలేదంటూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన హరీశ్ రావు ఈ అంశంపై వరుస ట్వీట్లు చేశారు.

మెడికల్ కాలేజీల కేటాయింపులో కేంద్ర మంత్రులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరు తెలంగాణ మెడికల్ కాలేజీలు కావాలని కోరలేదంటే… మరొకరు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్న ఖమ్మం, కరీంనగర్‌లో కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోవటం వల్లే కొత్తవి మంజూరు చేయలేదంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని సైతం మంత్రి ట్వీట్‌లో జతచేశారు. ప్రతి లక్ష మందికి 19 మెడికల్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని హరీశ్ రావు అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతోనే సిఎం కెసిఆర్ రాష్ట్ర నిధులతో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కేంద్రం, గవర్నర్ అనవసరంగా విమర్శలు చేసే బదులుగా ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన తెలంగాణను అభినందించాలని సూచించారు.
ఎయిమ్స్‌కు నిధులు తక్కువ ఎందుకిచ్చారు..?
గతంలో బీబీనగర్ ఎయిమ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదని ఓ కేంద్రమంత్రి మంత్రి నాలుక కరుచుకున్నారని గుర్తు చేశారు. ఆధారాలు చూపిస్తే నోట మాటరాలేదని, ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు, ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సిన బీబీనగర్ ఎయిమ్స్, ఎందుకు అధ్వాన్నంగా ఉంది..? అని ప్రశ్నించారు. ఎయిమ్స్‌కు రూ.1,365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా.. ఎందుకు రూ.156 కోట్లు (11.4 శాతం) మాత్రమే మంజూరు చేశారు నిలదీశారు. గుజరాత్ ఎయిమ్స్‌కు 52 శాతం తెలంగాణ 11.4 శాతం నిధులు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ తన పంధాను మార్చుకొని… ట్రైబల్ యూనివర్సిటీ, రైల్ కోచ్‌లు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే రాష్ట్ర ప్రజలకు మేలు చేసినవారవుతారని హరీశ్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News