Tuesday, December 24, 2024

సర్వేకు సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనెల 06వ తేదీ నుంచి ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే)కులగణనను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. అందులో భాగంగా నేడు అన్ని జిల్లాల్లో ఈ సర్వేపై సమావేశాలు నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు ఇప్పటికే అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నేడు డిసిసి అధ్యక్షులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, టిపిసిసి ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, వ్యవసాయ మార్కెట్, దేవాలయ, గ్రంథాలయ కమిటీలు, సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొని ఆయా జిల్లాల్లో కులగణన ప్రాధాన్యత, ప్రచార అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు. అందులో భాగంగా నేడు జిల్లాల్లో జరిగే సమావేశంలో కులగణనపై చేపట్టనున్న అంశాలను, ప్రజా ప్రతినిధులతో చర్చించాల్సిన విషయాల గురించి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు శుక్రవారం దిశానిర్దేశం చేశారు.

ఫిబ్రవరి 4వ తేదీన సర్వేపై కేబినెట్ తీర్మానం
కులగణన కోసం ప్రభుత్వం ఇప్పటికే జీఓ నెం 199 ద్వారా బిసి కమిషన్ చైర్మన్‌గా నిరంజన్‌ను, రాపోలు జయ ప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మిలను మెంబర్లుగా ను నియమించింది. ఇక రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్ మెంట్‌ను నోడల్ డిపార్ట్ మెంట్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ పౌరులతో పాటు ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలపై ప్రణాళికలు రచ్చించి వాటిని అమలు చేయడం కోసం ఫిబ్రవరిలోనే శాసనసభలో ఈ సర్వే కోసం ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది.

పార్ట్-1లో యజమాని, కుటుంబ సభ్యులు
ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే)కులగణనను సంబంధించిన ప్రశ్నావళిని ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 56 ప్రధాన ప్రశ్నలతో పాటు 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలను ఖరారు చేసింది. పార్ట్-1లో యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించి 58 ప్రశ్నలుండగా పార్ట్-2లో కుటుంబ వివరాలకు సంబంధించి 17 ప్రశ్నలున్నాయి. మొత్తం 7 పేజీల్లో వీటిని పూరించాల్సి ఉంటుంది. కుటుంబ యజమానితో పాటు కుటుంబంలోని సభ్యుల వ్యక్తిగత వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. పార్ట్-1లో వ్యక్తిగత వివరాల్లో మతం, సామాజిక వర్గం, కులం, ఉప కులంతో పాటు మాతృభాష, వైవాహిక స్థితి, పాఠశాల రకం, విద్యార్హత, ఉద్యోగం, ఉపాధి, కుల వృత్తి, వార్షిక ఆదాయం, ఐటి రిటర్న్, స్థిరాస్తులు, ధరణి పాసుబుక్ నెంబర్, రిజర్వేషన్‌తో పొందిన ప్రయోజనాలు, గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన సంక్షేమ పథకాల పేర్లు, రాజకీయ నేపథ్యం, వలస వివరాలను సేకరిస్తారు.

కుటుంబ వివరాలు పార్ట్-2లో నమోదు
కుటుంబ వివరాలు పార్ట్-2లో నమోదు చేస్తారు. ఇందులో గత ఐదేళ్లలో తీసుకున్న రుణాల వివరాలు, పశుసంపద, స్థిరాస్తి, చరాస్తి వివరాలు, రేషన్ కార్డు నెంబర్, నివాస గృహం రకం, మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్ వివరాలు తెలపాల్సి ఉంటుంది. ఆధార్ వివరాలు తప్పనిసరి కాదని ఇందులో స్పష్టం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే లాంటి ప్రశ్నలనే ప్రభుత్వం ఇందులో పొందుపరిచింది.
గత ప్రభుత్వంలో జరిగిన సర్వేలో 8 అంశాలు, 94 ప్రశ్నలు
2014 ఆగస్టు-19వ తేదీన గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలోని కోటి గృహాలు, 3.68 కోట్ల జనాభాకు సంబంధించి ఆర్థిక సామాజిక వివరాలను సేకరించింది. పదేళ్ల కిత్రం నిర్వహించిన నాటి సర్వేలో 8 అంశాలకు సంబంధించి 94 ప్రశ్నలకు సమాధానాలు సేకరించారు. అప్పటితో పోలిస్తే ఈ కులగణన సర్వేలో దాదాపు 90శాతం ప్రశ్నలు మళ్లీ పునరావృతం అయ్యాయి. కుటుంబసభ్యుల అనారోగ్య వివరాలు అందులో ఉండగా ఇప్పుడు కులాలకు సంబంధించిన ప్రశ్నలు అదనంగా ఉన్నాయి. గతంలో ఆధార్ వివరాల నమోదు తప్పనిసరి చేయగా ఇప్పుడు ఐచ్ఛికంగా ఉంచారు.

ఈనెల 30వ తేదీలోపు పూర్తయ్యేలా….
నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వేను ఈనెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను ప్రభుత్వం నియమించింది. ఇక గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు సైతం ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయులను కూడా ఈ సర్వేకు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల వేళలు అయిపోయిన తరువాత ఒక్కో ఉపాధ్యాయుడు ప్రతిరోజు 5 నుంచి 7 ఇళ్లను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్యుమరేటర్‌లకు, సూపర్‌వైజర్‌లకు, ఇతర సిబ్బందికి ఆకర్శణీయమైన వేతనాన్ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సర్వే జరిగే ప్రతి గ్రామంలో ముందుగా డప్పు చాటింపు వేయించాలని, సర్వే నిర్వహించే సమయంలో కలెక్టర్‌లు క్షేత్రస్థాయిలో తిరిగి తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్ పరిధిలో 21 వేల మంది ఎన్యుమరేటర్‌లను ప్రభుత్వం వినియోగించుకుంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News