Sunday, January 19, 2025

వెలిగొండ మాకు గుదిబండ

- Advertisement -
- Advertisement -

అనుమతులు లేకుండా ఎపి ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును ఆపండి
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం
హైదరాబాద్‌కు తాగునీటి ఇబ్బందులు వస్తాయి
కృష్ణాబోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపైన ఏవిధమైన అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీయాజమాన్యబోర్డుకు ఫిర్యాదు చేసింది. వెలిగోండ ప్రాజెక్టు నిర్మాణం అక్రమం అని వివరిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. భవిష్యత్తులో ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసినపుడు, బేసిన్లలోని ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణా ట్రిబ్యునల్ 1 (బచావత్ ట్రిబ్యునల్) అవార్డు పేర్కొందని లేఖద్వారా తెలిపారు.

తదనుగుణంగానే, బచావత్ ట్రిబ్యునల్ 1960 సెప్టెంబర్ తరువాత చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసినప్పుడు కేవలం కృష్ణా నది పరివాహక ప్రాంతం లోపలి ప్రాజెక్టులకు మాత్రమే నీటి కేటాయిపులు చేసిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ ఆవార్డుకు వ్యతిరేకంగా వెలిగొండ ప్రాజెక్టు లాంటి కృష్ణాబేసిన్ అవతలి ప్రాజెక్టులకు మిగులు జాలాలు కేటాయించిందని తెలిపారు. వరదల సమయంలో మూడు వేలక్యూసెక్కుల నీటిని బేసిన్‌కు అవతల ఉన్న గుండ్లకమ్మ తరలించే పనులు చేస్తున్నారని తెలిపారు.

వెలిగొండకు కృష్ణానదీజలాలను మళ్లించేందుకు టన్నల్ నిర్మాణం పనులు వడివడిగా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని నల్లమల సాగర్ మొదటి టన్నల్ పూర్తయిందని, రెండవ టన్నల్ 5.5కిలోమీటర్ల మేర పనులు జరుగున్నట్టు తెలిపారు.ఈ ప్రాజెక్టుల వల్ల బేసిన్ లోని కరువు ప్రాంతాలకు నీరందించే నాగార్జున సాగర్ వంటి తెలంగాణ ప్రాజెక్టులు (ఇప్పటికే నిర్మించినవి, నిర్మాణంలో ఉన్నవి) నష్టపోతాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన ఉన్న ప్రాంతాలకు నీటి ఎద్దడి పెరుగుతుందని, హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అందువల్ల శ్రీశైలం రిజర్వాయర్ నుండి రోజుకు ఒక టిఎంసీ చొప్పున బేసిన్ ఆవలకు నీటిని మళ్లించే వెలిగొండ ప్రాజెక్టు పనులు వెంటనే నిలువరించాలని కృష్ణాబోర్డు చైర్మన్‌ను కోరారు. బచావత్ ట్రిబ్యునల్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ప్రకారం, అనుమతులన్నీ లభించాకే వెలిగొండ ప్రాజెక్టును చేపట్టాలని, అప్పటివరకూ ప్రాజెక్టు పనులను నిలిపివేయించాలని ఈఎన్నీ మురళీధర్ ఈ మేరకు లేఖ ద్వారా బోర్డును కోరారు.

Also Read: మావోయిస్టు కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరం: డిజిపి అంజనీ కుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News