దావోస్: ప్రపంచంలోనే ఉత్తమ నగర రవాణా వ్యవస్థ కలిగిన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి తెలిపారు. అర్బన్ మొబిలిటీపై రౌండ్ టేబుల్ సమావేశంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం నాలుగుముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. భాగ్యనగరాన్ని భవిష్యత్తు నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఫాస్టెస్ట్, గ్రీనెస్ట్, లోయెస్ట్ కాస్ట్అనేవి లక్ష్య సాధనకు మార్గదర్శకాలని తెలియజేశారు.
రవాణా చౌకదనం, స్థిరత్వం, వేగం అనేవి నగరాల భవిష్యత్ ను నిర్ణయిస్తాయని సిఎం పేర్కొన్నారు. దావోస్ సదస్సులో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణలో మరో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ల, కంట్రోల్ ఎస్ సంస్థతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో 3,600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.