Sunday, January 19, 2025

మూసీ కంటే ముందు..పోవలసింది రాజకీయ కాలుష్యమే!

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు హైదరాబాద్ నగరం పెహచాన్ మూసీనదితో ఉండేది. అనంతగిరిలో పుట్టి హైదరాబాద్ నగరం మీ దుగా నల్లగొండ జిల్లాలోకి వెళ్లి వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలిసే మూసీ ఒకప్పుడు జీవనది. కాలక్రమేణా ఇప్పుడు ఆ నది పేరు తలచుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి. ‘అరయంగా కర్ణుడీల్గె ఆ ర్గురి చేతన్’ అన్నట్టు మూసీ మురికికూపంగా మారడానికి చాలా కారణాలు ఉ న్నాయి. రాజకీయ నాయకుల ప్రేరేపిత ఆక్రమణలు, అధికార యంత్రాంగం అవినీతి కలగలిసి చివరికి మూసీ ఒక మురికికూపంగా తయారైంది. మూసీనది పునరుజ్జీవనానికి సంబంధించి మొ న్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సుదీర్ఘ పత్రికా గోష్ఠిలో ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి తన నలుగురు కూతుళ్లకు నదుల పేర్లు పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. నదుల్ని మనం తల్లుల్లాగా పూజిస్తాం, గౌరవిస్తాం. మరి మూసీ కూడా పవిత్రంగా పూజించదగ్గ, గౌరవించదగ్గ నదేనా? మూసీ పేరు తలచుకోడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఎందుకొచ్చింది? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి.

తాను ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మంచిదే. ఆయన ఆ పని చేయగలిగితే చరిత్రలో నిలిచిపోతారు. మూసీనదికి పూర్వవైభవం కల్పించాలన్న ప్రయత్నం ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డితో ప్రారంభం కాలేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ముఖ్యమంత్రులు ఆ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మూసీని పునరుద్ధరించి హైదరాబాద్ నగరానికి కొత్త కళ తీసుకురావాలన్న కోరిక పలువురు ముఖ్యమంత్రులలో ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆ ప్రయత్నం కొనసాగింది. కానీ ఆ ప్రయత్నాలు సమావేశాలు, చర్చలకే పరిమితమయ్యాయి. మూసీనది ఇప్పుడు హైదరాబాద్ వాసులకు ఒక కలుషిత కాసారంగానే తలపునకు వస్తుంది. దశాబ్దాల తరబడి ఎవరూ పట్టించుకోని ఆక్రమణలు, నీటి కాలుష్యం ఇందుకు కారణం.

ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన సంవత్సరంలోపునే రేవం త్ రెడ్డి మూసీనది పునరుజ్జీవనాన్ని తన ప్రాధాన్యతగా ఎంచుకున్నారు. ఇంతకుముందు ముఖ్యమంత్రులు అందరూ విఫలమైన ఈ పనిలో రేవంత్ రెడ్డి కృతకృత్యుడవుతారా లేక ఇతరుల మాదిరిగా ఈయన కూడా మధ్యలో వదిలేస్తారా అనేది చూడాలి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఆయన ఇందులో విజయం సాధించినట్టయితే పలు కారణాలవల్ల చరిత్రలో నిలిచిపోతారు. మళ్లీ జీవనది మూసీని హైదరాబాద్ నగరవాసులకు కానుకగా ఇచ్చిన ముఖ్యమంత్రిగానే కాకుండా గత పాలకులు పూర్తి చేయలేకపోయిన ప్రాజెక్టును పూర్తి చేసినవాడు అవుతారు.

గత గురువారం నిర్వహించిన పత్రికా గోష్ఠిలో ఆయన మూసీనది పునరుజ్జీవనంపట్ల తన నిబద్ధత గురించి స్పష్టంగా ప్రకటించడమే కాదు, ఈ ప్రాజెక్టును పూర్తిచేసే క్రమంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని కూడా ఆయన నమ్మకం కలిగించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, స్లైడ్ షోల ద్వారా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ కోసం నియమించుకోనున్న కంపెనీల పేర్లను కూడా ఆయన ప్రకటించారు. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్నట్టుగా రూ. 1,50,000 కోట్లు కాదు ప్రస్తుతం ప్రాజెక్టు రిపోర్ట్ తయారీ కోసం రూ. 150 కోట్లు మాత్రమే ఇచ్చినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. దానితోపాటు నిర్వాసితులైన 200 కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడం తప్ప ఇప్పటివరకూ ఏ ఖర్చు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

18 మాసాల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ అందాక ప్రాజెక్టుకి ఖర్చు ఎంత అనేది తేలుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ముందుకు సాగకుండా ప్రతిపక్షాలు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తును గురించి ఆలోచించి తమ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంటున్నదని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతిపక్షాలు ప్రజల్ని మభ్యపెడుతున్నాయని, తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. మూసీని ప్రక్షాళన చేయకపోతే ఇప్పటికే వర్షాకాలంలో నానా ఇక్కట్లు పడుతున్న హైదరాబాద్ నగరవాసులకు ముందు ముందు చెన్నై, బెంగళూరు పరిస్థితులు దాపురిస్తాయని చెప్పారాయన.

ఆయన చెప్పినట్టు ఒక వి శేషం ఉంది ఇక్కడ. ప్రపంచంలో చాలా కొద్ది నగరాల్లోనే నదులు నగరం మధ్యలో నుంచి పారుతూ ఉంటాయి. అటువంటి వాటిలో హైదరాబాద్ ఒక టి. నిజంగానే ముఖ్యమంత్రి కోరుకుంటున్నది జరిగి మూసీనది ప్రక్షాళన జరిగినట్టయితే హైదరాబాద్ నగరం మధ్య నుండి పారుతున్న ఒక గొప్ప నదిని మనం చూడవచ్చు. ఆయనే చెప్పినట్టుగా ప్రస్తుతం మూసీనది బఫర్ జోన్‌లో దాదాపు పది వేల నిర్మాణాలు ఉన్నాయి. వాటికితోడు నదీ గర్భంలో కూడా వందలాది ఆక్రమణలు కనిపిస్తాయి. మూసీనదిని ప్రక్షాళన చేసే క్రమంలో నష్టపోయేవారందరికీ సరైన పరిహారం చెల్లించడం, పునరావాసం కల్పించడం జరుగుతుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అంతా సజావుగా జరిగితే అయిదారేళ్ల కాలంలో మూసీనది మళ్ళీ పాత వైభవం సంతరించుకుంటుందన్నది ముఖ్యమంత్రి విశ్వాసం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 9 ఏళ్లకు పైగా అధికారం లో ఉన్న ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి మరి ఎందుకు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నది? మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఆ పార్టీ కూడా అధికారం లో ఉండగా ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం. బిఆర్‌ఎస్ గాని, భారతీయ జనతా పార్టీ గానీ చేస్తున్న విమర్శ మూసీ పునరుజ్జీవనం పేరిట కాంగ్రెస్ ప్ర భుత్వం అవినీతికి పాల్పడబోతున్నదని. ముఖ్యమంత్రి పత్రికా గోష్ఠి నిర్వహించిన మరునాడే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తాను కూడా ఒక సుదీర్ఘ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సరే, ఆ పార్టీ తన వైఖరిని, ప్రక్షాళనపై తనకున్న ఆలోచనలని, తాను వాస్తవాలు అనుకుంటున్న విషయాలను ప్రకటించింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మూసీని ప్రక్షాళన చేసి పునర్వైభవం తీసుకురావాలన్న విషయంలో ఏ పార్టీకీ రెండో అభిప్రాయం లేదు. అటువంటప్పుడు రాజకీయ విభేదాలు, విమర్శలు, కక్షలు, కార్పణ్యాలు పక్కన పెట్టి మూసీని బాగు చేసే కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పక్షాలు కలిసి వస్తే బాగుంటుంది.

అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రతిపక్షాల సలహాలు, సూచనలూ తీసుకోవడానికి, ఇదే అంశం మీద శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఎ న్ని రోజులయినా నిర్వహించడానికీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతిపక్షాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బా గుంటుంది. నదుల పునరుజ్జీవనం అనేది మన దేశంలో కొత్తేమీ కాదు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 43 నదులను పునరుజ్జీవింపచేసి న ఉదంతం మన కళ్ళముందున్నది. దీనివల్ల 5వేల గ్రామాలకు చెందిన 70 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందిన విషయం అందరూ గుర్తించాలి.
మూసీనది బఫర్ జోన్‌లో, నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించే క్రమంలో అధికార యంత్రాంగం అత్యుత్సాహానికి పోకుం డా కట్టడి చెయ్యాల్సిన బాధ్యతా ప్రభుత్వానిది. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు సక్రమరీతిలో పునరావాసం కల్పించే చర్యలకు సరయిన ప్రణాళిక రచించాలి. ముఖ్యమంత్రి ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుంటేగాని ఇది సాధ్యం కాదని అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ కలుషిత వాతావరణంలో మూసీ కాలుష్యాన్ని తొలగించి పునరుజ్జీవనం సాధించడం అయ్యే పనేనా?

కొస మెరుపు: ప్రజలకు మేలు జరిగే క్రమంలో విభేదాలు మరిచి రాజకీయ నాయకులు ఎంత హుందాతనం ప్రదర్శిస్తారో చెప్పడానికి ఇటీవల సీనియర్ పాత్రికేయ మిత్రుడు సాయి శేఖర్ విట్టిలీక్స్ పేరిట గ్రంథస్థం చేసిన తన అనుభవాల్లో రాసిన ఒక సంఘటన గుర్తు చేసుకోవాలి. 1989లో తెలుగుదేశం ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజుల్లో జరిగిందీ సంఘటన. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమం త్రి. ఎన్‌టి రామారావు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఎన్‌టి రామారావు నాయకత్వంలోని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఒక ఫైలుకు సంబంధించిన సంఘటన ఇది. కేబినెట్ ఆమోదం పొందినా, ఎన్నికలు రావడంతో ఉత్తర్వుల జారీ ఆగిపోయింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఫైల్ తాలుకు పెద్ద మనిషి ప్రతిపక్ష నాయకుడు ఎన్‌టి రామారావును కలిసి తన గోడు వెళ్ళబోసుకున్నారు.

ఎన్‌టి రామారావు వెంటనే తన కార్యదర్శిని పిలిచి ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి ఫోన్ కలపమని కోరారట. చెన్నారెడ్డి లైన్‌లోకి వచ్చాక ఉభయకుశలోపరి అనంతరం ఎన్‌టి రామారావు విషయం వివరించి వీలైతే ఆ పని చెయ్యండని కోరారట. సీన్ కట్ చేస్తే గంట తర్వాత మన జర్నలిస్టు మిత్రుడు సచివాలయానికి వెళ్ళేసరికి తాను ఎన్‌టి రామారావు దగ్గర చూసిన పెద్దమనిషి హడావిడిగా ముఖ్యమంత్రి చాంబర్లోకి వెళ్లడం కనిపించింది. ఆ వెనుక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు కూడా వెళ్లారు. అరగంట తర్వాత ఆ పెద్దమనిషి ఆర్డర్ కాపీ తీసుకొని వెళ్ళిపోయారు. అది ఒక పరిశ్రమకు సంబంధించిన విషయం. ఆ రోజుల్లోనే 12 వందల మందికి ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిన నిర్ణయం. ఈ విషయం ఒక ఉన్నతాధికారి స్వయంగా సాయిశేఖర్‌కు చెప్పారు. ఇదే స్ఫూర్తిని మన ప్రస్తుత రాజకీయ నాయకులంతా ప్రదర్శిస్తే భావితరాలవారు మూసీ జీవనది ప్రవాహాన్ని తప్పక చూస్తారు.

డేట్‌లైన్ హైదరాబాద్

దేవులపల్లి అమర్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News