Friday, September 27, 2024

మార్కింగ్ టెన్షన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/ఉప్పల్: మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి క్షేత్ర స్థాయిలో రీ సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాల యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను రెండు రోజులుగా అధికారులు సేకరిస్తున్నారు. ఒకవేళ ఈ నిర్మాణాల్లో కిరాయి దారుడు ఉంటే ఎంత అద్దె చెల్లిస్తున్నారు? ఆధార్ కార్డు ఉందా? వయస్సు ఎంత? తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. నివసించేది యజమాని అయితే కరెంట్ బిల్లు వస్తుందా? ఇంటి పేపర్లు ఏమైనా ఉన్నాయా? వంటి ప్రాథమిక వివరాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం చైతన్యపురి, కొత్తపేట, సత్యనగర్, మారుతీనగర్, ఉప్పల్ పరిధిలోని మూసీ రివర్ బెడ్‌లోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ నిర్మాణాలకు ఆర్‌బిఎక్స్ (RB-X) అనే ముద్ర వేశారు. అయితే ఎక్కడ తాము నివాసాలను కోల్పోతామోనన్న భయంతో మూసీ నిర్వాసితులు కొన్నిచోట్ల రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బాధితులకు పునరావాసం కల్పించిన తరువాతే చర్యలు
బాధితులకు ఇళ్ల పట్టాలు ఇచ్చాకే తరలింపు కార్యక్రమం ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వారితో స్పష్టం చేశారు. దీంతోపాటు చాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్‌నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు సర్వే చేపట్టారు. మూసీనది ఆక్రమణలను గుర్తించి కూల్చివేసే ప్రాంతాలను సిబ్బంది మార్కింగ్ చేశారు. బాధితులకు పునరావాసం కల్పించిన తరువాతే చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు ప్రకటించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. హిమాయత్‌నగర్ మండల పరిధిలో మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో సుమారు 225 ఇళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే మూసీనదిలో 2,166 అక్రమ నిర్మాణాలను ఇప్పటికే అధికారులు గుర్తించగా, అవన్నీ హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఐదు బృందాలుగా ఏర్పడి మార్కింగ్
పాతబస్తీ బహదూర్‌పురా నియోజకవర్గంలో మూసీ నది రివర్ బెడ్‌లో ఉన్న ఇళ్లను రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. పాతబస్తీ కిషన్‌బాగ్, అసద్ బాబా నగర్, నందిముసలైగూడ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు 5 టీంలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో సర్వే చేస్తూ మార్కింగ్ చేశారు. ఈ ప్రాంతాల్లోని దాదాపు 386 ఇళ్లు మూసీ రివర్ బెడ్‌లోకి వస్తాయని అధికారులు తెలిపారు. బహదూర్‌పురా తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ ఐదు 5 టీంలు సర్వే చేశాయి.

డబుల్ బెడ్‌రూం తాళాలను అందచేసిన అధికారులు
ఉప్పల్ మండలంలో 239 ఇళ్లను రెవెన్యూ అధికారులు గుర్తిం చారు. మండలం పరిధిలోని కొత్తపేట్, చైతన్యపురి, నాగోల్, రామంతాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లోని మూసీ పరివాహక ప్రాంతంలో బఫర్‌జోన్‌లో ఉన్న ఇళ్లను గుర్తించిన అధికారులు అక్కడ ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ విజయేందర్‌రెడ్డి , కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మార్వో టి.వాణి రెడ్డి సిబ్బం దితో గురువారం మూసీ పరివాక ప్రాంతాన్ని సందర్శిం చారు. ఐదు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఇళ్లు కేటా యించామని, ఖాళీ చేయాలని బాధితులకు చెప్పగా తొలుత వారు అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి బాధితు-లను అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ఒప్పించారు. తొలుత సానుకూలంగా ఉన్న బాధితులను వనస్థలిపురంలోని భవానీనగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇంటికి తరలించారు. దీనికి సంబంధించిన తాళం చెవులను బాధితులకు అధికారులు అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News