త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం
హైదరాబాద్: మద్యం బాబులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. త్వరలోనే మద్యం ధరలను తగ్గించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. గత సంవత్సరం మే నెలలో బీర్లపై ప్రత్యేక ఎక్సైజ్ సెస్ చార్జీని రూ. 10 వరకు ప్రభుత్వం తగ్గించడంతో బీర్ల అమ్మకాలు భారీగా జరిగాయి. ఈ నేపథ్యంలో మద్యం ధరలను తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించినట్టుగా తెలిసింది. కొవిడ్ కారణంగా గత సంవత్సరం మద్యం రేట్లను 20 శాతం వరకు ప్రభుత్వం పెంచింది. ఈ పెరిగిన ధరలతో మద్యం అమ్మకాలు కొంతమేర తగ్గాయి. దీంతో మద్యం, సప్లయ్‌ను పెంచే దిశగా ఆబ్కారీ శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మద్యం రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. లిక్కర్ అమ్మకాలు పెంచుకోవడానికి ఒక్కో బాటిల్‌పై 10 రూపాయలు తగ్గించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానున్నట్లు సమాచారం. అందువలన బీర్లు మినహా ఇండియాలో తయారయ్యే మద్యం పై స్వల్పంగా ధరలు తగ్గించనున్నట్లు ఆబ్కారీ వర్గాలు పేర్కొన్నాయి.