ఏళ్ల తరబడి నియామకాల కోసం ఎదురు చూస్తున్న డిఎస్‌సి 2008 అభ్యర్థులకు ఒకటి రెండు రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి కానున్నది. హైకోర్టు ఆదేశాల మేరకు 1,382 మందికి అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తూ త్వరలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనున్నది. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఆయా జిల్లాల్లో అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖాధికారులు పోస్టింగులు ఇవ్వనున్నరు. హైకోర్టులో విచారణ సందర్భంగా 1,382 మంది డిఎస్‌సి 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని విద్యాశాఖ న్యాయస్థానానికి తెలిపగా, తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతున్నది.
2008లో నోటిఫికేషన్‌లో డిఎడ్ అభ్యర్థులతో భర్తీ కాగా మిగిలిన 2367 పోస్టులను అర్హత సాధించిన బి.ఇడ్ అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా కాంట్రాక్ట్ పద్ధతిన నియమించాలని హైకోర్టు గత ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. 2367 మందికిగాను 1382 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలకు ఆసక్తి చూపారని, ఎంఎల్‌సి ఎన్నికల నియమావళి రావడంతో నియామకాలకు కొంత గడువు కావాలంటూ హైకోర్టును ప్రభుత్వం గడువు కోరింది. ఎన్నికల నియమావళి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డంకి కాదని వాటిని అమలు చేయాల్సిందేనంటూ గత వారం తేల్చి చెప్పడంతో విచారణకు హాజరైన విద్యాశాఖ కమిషనర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు.