సిద్ధిపేట: దేశంలోనే వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తించి కేంద్రం అవార్డుతో కితాబిచ్చిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో వికలాంగులకు వెయ్యికి మించి ఫించన్లు ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వమే ఒక్కో వికలాంగుడికి రూ.3016 చొప్పున అందిస్తున్నదని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో సోమవారం ఉదయం మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివ్యాంగులలో సామర్థ్యం చూడాలని, పనితనం చూడాలని వారిని చిన్నచూపు చూడొద్దని ఆశాభావం వ్యక్తం చేశారు.
దివ్యాంగులు ఆత్మ గౌరవంతో బతకాలని రాష్ట్రంలోని 5 లక్షల 69వేల 792 మందికి ప్రతీ నెలా 1700 కోట్లు పింఛను కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం అన్నీ రంగాలలో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగాలకు 4 శాతం, విద్యలో 3 నుంచి 4 శాతం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి వెల్లడించారు. దేశంలోనే కల్యాణ లక్ష్మీతో పాటు దివ్యాంగుల కోటా కలుపుకుని దివ్యాంగుడి పెళ్లికి రూ.2.25 లక్షల అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వానిదేనని ధీమాగా హరీశ్ రావు చెప్పారు. దివ్యాంగులు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, వికలాంగుల భవన్ కోరిన మేరకు మంజూరు చేయిస్తానని మంత్రి మాట ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 14,500 మంది దివ్యాంగులను గుర్తించినట్లు, 6615 మందికి సదరం సర్టిఫికేట్ అందజేస్తున్నట్లు, అలాగే సిద్ధిపేట జిల్లా వికలాంగుల సంక్షేమం కోసం రూ.1కోటి రూపాయలు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, రాష్ట్ర వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ, స్త్రీ, శిశు సంక్షేమ, దివ్యాంగుల శాఖ జిల్లా అధికారి రాంగోపాల్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణుగోపాల్ రెడ్డి, వికలాంగుల రాష్ట్ర, జిల్లా బాధ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.