Monday, December 23, 2024

దివ్యాంగులకు దశాబ్ది కానుక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల ఆసరా పింఛన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే నెల నుంచి వికలాంగులకు రూ. 4,116 పింఛను చెల్లిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం జరగాలని కోరుకున్నామో వాటిని ఒక్కొక్కటిగా సాధించుకుంటున్నామని తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. మంచిర్యాల వేదికగానే బిసి కులవృత్తులకు రూ.లక్ష సాయం, రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నస్పూర్‌లో 26.24 ఎకరాల విస్తీర్ణంలో రూ.41 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని, జిల్లా బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు.

గోదావరి నదిపై రూ. 164 కోట్లతో నిర్మించనున్న మంచిర్యాల అంతర్గాం రహదారి వంతెన, హాజీపూర్ మండలం గుడిపేటలో వైద్య కళాశాల, మందమర్రిలో రూ.500 కోట్ల వ్యయంతో ఫామ్ ఆయిల్ పరిశ్రమ, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. మంచిర్యాలలో నిర్వహించిన బిఆర్‌ఎస్ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. మొత్తం తెలంగాణ సమాజం బాగుండాలి అని కెసిఆర్ పేర్కొన్నారు. ముసలమ్మలు, ముసలి తాతలు ఆసరా పెన్షన్లతో బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పారు. వికలాంగులకు రూ. 3,116 పెన్షన్ ఇస్తున్నామని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నామని వెల్లడించారు. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నామని సిఎం తెలిపారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో జిల్లా వాసులు ఎన్నో ధర్నాలు చేశారని, అలాంటిది ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో పని కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.
వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు రూ. 700 కోట్ల బోనస్
సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త వినిపించారు. వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు రూ. 700 కోట్ల బోనస్ ఇస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు.మనం సంక్షేమంలో, వ్యవసాయంలో బాగున్నామని తెలిపారు. సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర అని, ఇది మన సొంత ఆస్తి అని పేర్కొన్నారు. సింగరేణి నిజాం కాలంలో ప్రారంభమైందని, వేలాది మందికి అన్నం పెట్టిన సంస్థ సింగరేణి అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ సింగరేణిని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తీసుకొచ్చి, మన సొంత కంపెనీని అప్పులు చెల్లించక 49 శాతం వాటా కింద కేంద్రానికి కట్టబెట్టిందని తెలిపారు. ఆ విధంగా సింగరేణిని పూర్తిగా నాశనం చేసింది అని సిఎం కెసిఆర్ ధ్వజమెత్తారు. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే, బిజెపి పూర్తిగా ముంచాలని చూస్తోందని విమర్శించారు. దేశంలో చెడ్డ పాలసీలను అంతా కలిసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ వచ్చాక సింగరేణి నడక మారింది..
2014 కంటే ముందు కార్మికులకు ఇచ్చే బోనస్ 18 శాతం మాత్రమే అని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. అంటే కేవలం రూ. 50 నుంచి 60 కోట్లు మాత్రమే కార్మికులకు పంచేదని, తెలంగాణ వచ్చాక సింగరేణి నడక మారిందని చెప్పారు. 2014లో సింగరేణి టర్నోవర్ రూ. 11 వేల కోట్లు మాత్రమే అని, ఇవాళ అదే సింగరేణి టర్నోవర్‌ను రూ. 33 వేల కోట్లకు పెంచుకున్నామని తెలిపారు. అదే విధంగా సింగరేణి లాభాలు కేవలం రూ. 300 నుంచి రూ. 400 కోట్లు మాత్రమే ఉండేవని, ఇవాళ సింగరేణిలో ఈ ఏడాది వచ్చిన లాభాలు రూ. 2,184 కోట్లు అని వెల్లడించారు. సింగరేణిలో నూతన నియామకాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఆనాడు కంపెనీకి వచ్చే లాభాల కన్నా మూడు రెట్లు బోనస్ ఇచ్చే పరిస్థితికి సింగరేణిని తీసుకొచ్చామని అన్నారు.

10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 6,453 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునుదర్ధరించి 19,463 ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించామని సిఎం గుర్తు చేశారు. సింగరేణిలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే గత ప్రభుత్వాలు రూ. లక్ష ఇచ్చి చేతులు దులుపుకునేదని, కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇస్తుందని తెలిపారు. వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణం ఇంటి కోసం ఇస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. దేశంలో బొగ్గు కొరత లేదని, 361 బిలియన్ టన్నుల బొగ్గు ఉండగా, విద్యుత్‌ను ప్రైవేట్ పరం చేస్తామంటున్నారని విమర్శించారు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారని అన్నారు.
తెలంగాణ దేశంలో చాలా రంగాల్లో నంబర్ వన్ స్థాయికి చేరింది
తొమ్మిదేళ్లలో తెలంగాణ దేశంలో చాలా రంగాల్లో నంబర్ వన్ స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. అనేక విషయాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, సంక్షేమ పథకాల్లో అగ్రస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. మంచిర్యాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం సిఎం కెసిఆర్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని అధికారులను ఉద్దేశించి సిఎం కెసిఆర్ మాట్లాడారు. పరిపాలన సంస్కరణ అంటే పది ఆఫీసులు ఏర్పాటు చేసి..

నలుగురు ఆఫీసర్లను పెంచడం కాదని, సంస్కరణ అనేది ఒక రోజుతో అంతం అయ్యేది కూడా కాదని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని, సంస్కరణలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలమైందని తెలిపారు. దేశంలో నోట్ల రద్దు భయంకరమైన పరిస్థితి అని విమర్శించారు. సంక్షేమ పథకాలను సమర్థంగా ప్రజలకు చేరవేస్తున్నామని. బిసి కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. యాదవులకు గొర్రెల పంపిణీ విజయవంతంగా చేపట్టామని, 3.8 లక్షల మందికి రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని వెల్లడించారు.
భారత్‌కు తెలంగాణ తలమానికంగా నిలవాలి
రాష్ట్రంలో మాతా-శిశు మరణాలు చాలా తగ్గాయని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కంటి వెలుగు పరీక్షలు స్ఫూర్తిగా నిలిచాయని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్‌లో కూడా కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తామన్నారని పేర్కొన్నారు. భారత్‌కు తెలంగాణ తలమానికంగా నిలవాలని
సిఎం కెసిఆర్ అధికారులకు సూచించారు. కొత్త రాష్ట్రం ఏర్పడే నాటికి ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాబోతున్నాయని, పెద్ద సంఖ్యలో వాటిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పామాయిల్‌కు దేశంలో గిరాకీ ఏర్పడుతోందని, ఆ తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలని అన్నారు.
సిఎం కెసిఆర్‌కు ఘనస్వాగతం
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మంచిర్యాలకు చేరుకున్న సిఎం కెసిఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంఎల్‌ఎలు, స్థానిక బిఆర్‌ఎస్ నేతలు ఘనస్వాగతం పలికారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సంక్షేమ దినోత్సవం నేపథ్యంలో రెండో విడత గొర్రెల పంపిణీని సిఎం కెసిఆర్ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News