Sunday, January 12, 2025

హోంగార్డులకు వరాలు

- Advertisement -
- Advertisement -

రోజువారీ వేతనం రూ.920 నుంచి వెయ్యికి పెంపు వీక్లీ పరేడ్
అలవెన్స్ రూ.100 నుంచి రూ.200కు హెచ్చింపు విధి
నిర్వహణలో మరణిస్తే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వ
ఉద్యోగుల మాదిరి వైద్య సదుపాయాలు జనవరి 1 నుంచి
అమల్లోకి.. ప్రమాదంలో మరణించిన ఐపిఎస్‌లకు రూ.2కోట్ల
ఎక్స్‌గ్రేషియా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా
స్కూల్ డ్రగ్స్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు పోలీస్ శాఖ
నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకలో సిఎం రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్ : హోంగార్డుకు సిఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం రాష్ట్ర పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్‌ఎండిఎ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పోలీసుశాఖలో కీలక పాత్ర పోషించే హోంగార్డ్సులకు ప్రస్తుతం వారికి ఇస్తున్న రోజు వారి జీతం రూ.920 నుంచి 1000 కి పెంచుతున్నట్టు ప్రకటించారు. అలాగే వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ. 100 నుంచి రూ. 200 కు పెంచుతున్నామని వెల్లడించారు. విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగి హోంగార్డు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని పేర్కొన్నారు. హోం గార్డుకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రమాదంలో మరణించిన ఐపిఎస్ కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. ఇవన్నీ జనవరి 1 వరకు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

పోలీసు కుటుంబాల పిల్లలకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేశామని అన్నారు. పోలీస్ సిబ్బంది పిల్లలకు ఈ స్కూల్ లో 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు సైనిక్ స్కూల్, డిఫెన్స్ స్కూల్స్ వంటి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పడిందన్నారు. రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావులేకుండా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి పైరవీలు లేకుండా పోలీసులకు పదోన్నతులు, బదిలీలు జరిపామన్నారు. పోలీసు, అగ్నిమాపక శాఖలో 15 వేల మందికి నియామక పత్రాలు అందించామని తెలిపారు. పిజిలు, పిహెచ్‌డీలు చేసిన వారు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు వస్తున్నారన్నారు. సైబర్, డ్రగ్స్ రూపంలో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. గంజాయి, కొకైన్, హెరాయిన్ మన రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయన్నారు. యువతకు సైబర్ క్రైమ్ విభాగంలో శిక్షణ ఇవ్వాలని డిజిపిని కోరుతన్నానని తెలిపారు. టిజి న్యాబ్‌కు డిజిపి స్థాయి అధికారిని నియమించామన్నారు.

కఠిన చర్యలు చేపట్టి గంజాయి, డ్రగ్స్‌ను అరికడుతున్నామని తెలిపారు. డ్రగ్స్ రవాణాదారులు ఇక్కడికి రావాలంటేనే భయపడాలన్నారు. డ్రగ్స్ విష వలయం గురించి పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన వారితో విద్యార్థులకు పాఠాలు చెప్పించాలన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి పాఠశాలల యాజమాన్యాలకు బాధ్యత ఉండాలని తెలిపారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో పోలీసు కమిషనర్లు సదస్సులు నిర్వహించాలన్నారు. డ్రగ్స్ కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 6 నెలల్లోగా తీర్పులు వచ్చేలా చూస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 94 వేల మంది పోలీసులు ఉన్నారన్నారు. ఎక్కడ తీవ్రవాద కార్యకలాపాలు జరిగినా మన పోలీసుల సాయం తీసుకుంటామన్నారు. పోలీసు ఉద్యోగం భావోద్వేగం, ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత అని అన్నారు. బాధితుల పట్ల పోలీసులంతా గౌరవంగా, మర్యాదగా మెలగాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరగాళ్లు, కబ్జారాయుళ్లకు అండగా ఉండటం కాదన్నారు. పోలీసు పేరు వినిపిస్తే చాలు నేరగాళ్లు భయపడేలా ఉండాలని తెలిపారు. కొందరు పోలీసుల తీరు కారణంగా అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు.

నేరగాళ్ల పట్ల కఠిన వైఖరి ప్రదర్శించాల్సి ఉందన్నారు. స్టేషన్‌కు వచ్చిన ఏ ప్రజా ప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు. నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని వెల్లడించారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చూడాలన్నారు. ట్రాన్స్ జెండర్ల సమస్యలను ప్రతి ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాలని తెలిపారు. ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నామన్నారు. వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇస్తామని పేర్కొన్నారు. వారికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.

ఎస్డీఆర్‌ఎఫ్ వ్యవస్థను బలోపేతం చేశాం : డిప్యూటీ సిఎం భట్టి
రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు వచ్చిన ఎదుర్కోవడానికి నిష్ణాతులైన పోలీసులతో ప్రత్యేక వింగ్‌ని ఏర్పాటు చేసి, వారికి సకల వసతులు, సౌకర్యా లు కల్పించి ప్రజా ప్రభుత్వం ఎస్డీఆర్‌ఎఫ్ వ్యవస్థను బలోపేతం చేసిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. విపత్తుల వస్తే కేంద్ర బలగాలపై ఆధార పడాల్సిన పరిస్థితిని అధిగమించడానికి ఖమ్మంలో పోటెత్తిన వరదలను దృష్టిలో పెట్టుకొని సిఎం రేవంత్ రెడ్డి ఎస్డీఆర్‌ఎఫ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. హైదరాబాద్ నగరం తో పాటు రాష్ట్రాన్ని సురక్షితంగా తీర్చిదిద్దడం కోసం ఫ్రెండ్లీ పోలీస్ కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా మార్చాలని ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నదని తెలిపారు.

ఉన్నత, మధ్య తరగతి వర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలు బయటకు వెళ్లి వ్యసనాలకు బానిసవ్వడంతో వారు పడుతున్న బాధలను అర్థం చేసుకున్న ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణచివేయాలని ముందుకు పోతోందని స్పష్టం చేశారు. ఐటీ సెక్టర్ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో సవాలుగా మారిన సైబర్ సెక్యూరిటీ నేరాలను అదుపు చేయడానికి రాష్ట్రంలో ప్రత్యేక వింగ్‌ను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు రక్షణ, ధైర్యం, నమ్మకం కల్పిస్తున్న పోలీసు వ్యవస్థ కు ఎటువంటి అవసరాలు వచ్చిన తీర్చడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలను కంటికి రెప్పల కాపాడేటువంటి పోలీస్ శాఖ కు కావలసిన బడ్జెట్, రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేయడానికి కావలసిన వాతావరణాన్ని ప్రజా ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. కొంత మంది అవసరాల కోసం కాకుండా, సమాజ అవసరాల కోసం మాత్రమే పోలీస్ వ్యవస్థ ప్రజా ప్రభుత్వంలో పనిచేస్తున్నదన్నారు.

హైదరాబాద్ మహానగరంలో గందరగోళ పరిస్థితులు సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకురావడానికి కొంతమంది చేస్తున్న కుట్రలను సాగనివ్వమన్నారు. ప్రజా సంక్షేమం కోసం అందరం కలిసి పని చేద్దాం. హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చడానికి, రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేద్దామని పిలుపునిచ్చారు. పోలీస్ ఉద్యోగుల సమస్యలు వినడానికి ప్రజా ప్రభుత్వం తలుపులు తెరిచే ఉంచుతుందన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండే ఏ మంచి పని అయినా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. పోలీస్ సిగ్నల్స్ వద్ద యాచక వృత్తి చేస్తున్న ట్రాన్స్ జెండర్స్‌కు శిక్షణ ఇచ్చి పోలీస్ శాఖలో భాగస్వామ్యం చేసిన మానవత్వం కలిగిన తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఈ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

సిఎం రేవంత్‌కు పోలీసు సిబ్బంది ప్రత్యేక స్వాగతం
అంతకు ముందు సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఆయన ఎస్డీఆర్‌ఎఫ్ మార్గ్ వద్ద జెండా ఊపి ఎస్డీఆర్‌ఎఫ్ వాహనాలు, బోట్లను ప్రారంభించారు. అనంతరం హెచ్‌ఎండిఎ మైదానంలో ఏర్పాటు చేసిన ఎస్డీఆర్‌ఎఫ్ స్టాల్‌ను సంద ర్శించారు. కార్యక్రమంలోని ఎస్డీఆర్‌ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం రెండు వేల మంది సిబ్బందితో ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్‌ఎఫ్‌కు రూ.35.03 కోట్లు మంజూరూ చేసింది. విపత్తు సమయంలో బాధితుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్‌ఎఫ్ ను ఏర్పాటు చేసింది. అదే విధంగా నేడు డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కావడంతో ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వేదికపైకి చేరుకున్నారు. అయితే సిఎం రేవంత్ రెడ్డికి పోలీసు సిబ్బంది ప్రత్యేక స్వాగతం పలికారు. సిఎం సెక్యూరిటీలోని ప్రత్యేక ట్రైన్డ్ డాగ్ అయిన ’మాయ’ తో రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించారు. మాయ అందించిన పుష్పగుచ్చం అందుకున్న సిఎం ఆనందం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News