Thursday, December 19, 2024

అసెంబ్లీకి భూభారతి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ భూభారతి 2024 బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇద్దరు వ్యక్తులు తయారుచేసిన ధరణి, ఆర్‌వోఆర్ చట్టాన్ని ప్రక్షాళన చేశామని మంత్రి తెలిపారు. దొరల గడీల్లో కూర్చుని తయారుచేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ నాలుగు గోడల మధ్యన కూర్చొని ధరణి పోర్టల్ తెచ్చారని, వేల పుస్తకాలు చదివిన మేధావి తెచ్చిన 2020 ఆర్వోఆర్ చట్టంతో లక్షల సమస్యలు వచ్చాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరు వ్యక్తులు తయారుచేసిన ధరణి, ఆర్‌వోఆర్ చట్టాన్ని ప్రక్షాళన చేశామని మంత్రి తెలిపారు. హరీష్ రావు తమకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సూచనలను కూడా బిల్లులో పొందుపరచామన్నారు. దొరల గడిల్లో కూర్చుని తయారుచేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. ముసాయిదా బిల్లును వెబ్‌సైట్‌లో పెట్టి 40 రోజులు అభిప్రాయాలు సేకరించామన్నారు. 33 జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకొని కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు.

కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన దరావత్ రవి అనే బీఆర్‌ఎస్ ఎంపీటీసీ తన వద్దకు వచ్చారని, ఆ గ్రామంలో సర్వే నంబర్ 149 నుంచి 160 లో ఉన్న భూమి ధరణి వచ్చాక అటవీ భూమిగా మార్చారని చెప్పారన్నారు. వారి స్థానిక ప్రజాప్రతినిదులకే ధరణి న్యాయం చేయలేదన్నారు. అలాంటి వారికి న్యాయం చేసేలా కొత్త చట్టం తీసుకువచ్చామని చెప్పారు. 18లక్షల ఎకరాలు పార్ట్ బిలో ఉందన్నారు. గతంలో ఆ భూమికి పాస్ బుక్కులు ఉంటే ఎందుకు పార్ట్ బి లో చేర్చారని ప్రశ్నించారు. కొత్త చట్టం ద్వారా పార్ట్ బి లోని భూముల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అబాది, గ్రామ కంట భూములకు పరిష్కారాలు ఈ కొత్త చట్టంలో ఉన్నాయన్నారు. పొజిషన్‌కు, పాసుబుక్కులో ఉన్న భూ విస్తీర్ణ వ్యత్యాసాలను సరిచేసే అవకాశం ఉందన్నారు.

మ్యుటేషన్‌పై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవో ఆధ్వర్యంలో అప్పీల్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వారసత్వ ఆస్తుల అభ్యంతరాలపై అప్పిల్ అథారిటీకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. క్రాస్ చెక్ చేసి మ్యూటేషన్ చేసే అధికారం ఆర్డీవోకి కొత్త చట్టంలో కల్పిస్తుందన్నారు. సభ్యుల నుంచి మంచి సూచనలు వస్తే ఈ బిల్లులో చేర్చడానికి తమకు ఎలాంటి బేషజాలు లేవని స్పష్టం చేశారు. ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు. ఆర్డిఓ, కలెక్టర్ అప్పీల్ అథారిటీగా ఉంటారన్నారు. ఆ తర్వాత అప్పీల్ చేసుకోవడానికి ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 2020 కి ముందు 9,24,000 సాధబైనామ దరఖాస్తులు చేసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

అర్ధరాత్రి అసెంబ్లీ బిజినెస్ ఎజెండాపై విపక్షాల గరం : అసెంబ్లీ బిజినెస్ ఎజెండాను ప్రభుత్వం అర్ధరాత్రి 12గంటల తర్వాత పెట్టడం సమంజంగా లేదంటూ ప్రతిపక్ష సభ్యులు ఎంఐఎం పక్ష నేత అక్బరుద్ధీన్ ఓవైసీ, బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలో భూ భారతి బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆ వెంటనే చర్చ పెట్టడంపై బీఆర్‌ఎస్ సహా ఎంఐఎం, బీజేపీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అక్బరుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని, అర్ధరాత్రి 12గంటల వరకు అసెంబ్లీ బిజినెస్ ఎజెండా కనిపించడం లేదన్నారు. ఒక బిల్లుపై మాట్లాడాలంటే కనీసం 12గంటల సమయం అవసరమన్నారు.

ఇప్పుడే బిల్లు పెట్టి ఇప్పుడే సలహాలు, సూచనలివ్వమంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి పొరపాట్లు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీష్ మాట్లాడుతూ అర్ధరాత్రి 12 గంటల తర్వాతా బిజినెస్ ఎజెండా పెట్టడాన్ని తప్పుబట్టారు. ఇది శాసన సభలో సభ్యుల హక్కులను ఈ సభ ఉల్లంఘిస్తుందని విమర్శించారు. బిల్లుపై కనీసం ఒక రోజు వర్కింగ్ డే ముందే మాకు అమెండ్మెంట్ పంపాలని కోరారు. సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ భూ భారతి ప్రాధాన్యతతో కూడిన బిల్లు కావడంతో దీనిపై సభ్యులకు అధ్యయనానికి ఈ రోజు సమయమిచ్చి రేపు బిల్లుపై చర్చ పెట్టాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News