రూ.1500 కోట్లు పెట్టుబడితో వస్తున్న
అంబాసిడర్ వాల్టర్ జేలిండర్
ప్రత్యక్షంగా 9వేల మందికి, పరోక్షంగా 18వేల మందికి ఉపాధి కల్పన మంత్రి కెటిఆర్ సమక్షంలో ఎంఒయు
మన : జర్మనీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుందని, పరిశ్రమల ఏర్పాటుకు 2 వేల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో జరిగిన జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. జర్మనీకి చెందిన కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. జర్మనీ అంబాసిడర్ వాల్టర్ జేలిండర్, మంత్రి కెటిఆర్ సమక్షంలో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ కంపెనీ రూ. 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దాదాపు 9 వేల మందికి ప్రత్యక్షంగా, 18 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ కంపెనీ కార్లు, కామర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలకు సంబంధించిన మెగ్నిషీయం భాగాలను ఉత్పత్తి చేయనుంది.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు జర్మనీ రూపొందించిన విధివిధానాలు బాగున్నాయని పేర్కొన్నారు. జర్మనీ ప్రభుత్వం, అక్కడి పారిశ్రామికవేత్తలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చిన్నతరహా పరిశ్రమలే జర్మనీ జిడిపివృద్ధికి సహకరిస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ పాలనలో తొలి ప్రాధాన్యతగా విద్యుత్ సమస్యను పరిష్కరించాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. అమెరికాలో కూడా టీఎస్ ఐపాస్ లాంటి చట్టం లేదని స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా 17,500 కంపెనీలకు ఇప్పటి వరకు అనుమతులు ఇచ్చామని తెలిపారు.